ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు చంద్రబాబు ప్లాన్

 

ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వేగాన్ని పెంచింది. భారత దేశానికి ముంబై వాణిజ్య రాజధానిగా పేరొందిన విధంగా విశాఖను ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిగా మార్చాలన్న యోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. గంగవరం పోర్టు పరిధిలో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుని నిల్వ చేసే ఈ ప్లాంట్ కోసం 5,000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. కాకినాడ వద్ద కూడా మరో గ్యాస్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్లోటింగ్ స్టోరేజీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ రెండు ప్లాంట్ల వల్ల ప్రభుత్వానికి పన్నుల ద్వారా 5000 కోట్లకు పైబడి రాబడి లభిస్తుందని ప్రభుత్వం వివరిస్తోంది. అదే విధంగా మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్టిమెంట్ రీజియన్‌కు (పిసిపిఐఆర్) మార్గం సుగమం అయిందని చెబుతోంది.