విశాఖకు మరో తుఫాను ముప్పు... తప్పించడం ఎలా?

 

హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రని అల్లకల్లోలం చేసేసింది. ముఖ్యంగా విశాఖపట్నం కనీవిని ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంది. దాదాపు 70 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల ముందు ఒకే లక్ష్యం వుంది. తుఫాను కారణంగా దెబ్బతిన్న విశాఖపట్నం సాధ్యమైనంత త్వరగా కోలుకునేలా చేయాలి... విశాఖపట్నానికి పూర్వ వైభవం తేవాలి. అయితే దీనికంటే పెద్ద కర్తవ్యం వీరి మీద వుందని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఆ కర్తవ్య నిర్వహణ చేయకపోతే విశాఖకు మరిన్ని తుఫానులు వచ్చే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు.

 

హుదుద్ తుఫాను విశాఖ దగ్గర తీరం దాటడానికి గల ప్రధాన కారణం ఉత్తరాంధ్ర పరిసర తీర ప్రాంతంలో ఇతర తీరాలకంటే విశాఖ తీరంలోనే ఎక్కువ వేడి వుండటం, ఆ వేడివల్ల ఎక్కువ పీడనం ఏర్పడటమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా సముద్రంలో ఏర్పడిన తుఫానులు వేడి, పీడనం ఎక్కువగా వున్న ప్రాంతంలోనే తీరం దాటుతూ వుంటాయని విశ్లేషిస్తున్నారు. హుదుద్ తుఫాను విశాఖ తీరం దాటిన రోజును పరిశీలిస్తే, ఆరోజున కాకినాడకంటే, కళింగపట్నం కంటే, సమీపంలోని ఇతర తీరప్రాంతాల కంటే విశాఖపట్నంలోనే ఎక్కువ వేడి, పీడనం వున్నాయని గుర్తించారు. అందువల్లే హుదుద్ విశాఖలో తీరం దాటిందని చెబుతున్నారు. ఇతర తీర ప్రాంతాల కంటే విశాఖలో ఎక్కువ వేడి, పీడనం ఏర్పడటానికి గల ప్రధాన కారణం నివాస ప్రాంతాలు పెరిగిపోవడం, చెట్లను కొట్టేయడం, తద్వారా వాతావరణంలో వేడి పెరగడమే నని విశ్లేషిస్తున్నారు.

 

హుదుద్ తీరం దాటింది. కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన విశాఖలో ఇప్పుడు పచ్చని చెట్టు అనేదే లేకుండా చేసింది. ఇప్పటికే విశాఖలో గతంలో కంటే వేడి, పీడనం పెరిగాయి. ఇప్పుడు తుఫాను కారణంగా చెట్లన్నీ మటుమాయం అయిపోవడంతో రాబోయే రోజుల్లో వేడి, పీడనం మరింత పెరిగే అవకాశం వుంది. అలాంటి వాతావరణం కారణంగా బంగాళాఖాతంలో భవిష్యత్తులో ఏర్పడబోయే అల్పపీడనాలు మళ్ళీ విశాఖవైపే వచ్చే ప్రమాదం వుంది. సాధారణంగా ప్రతి ఏడాదీ అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం వుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా నవంబర్‌లోపు అల్ప పీడనాలు ఏర్పడే అవకాశం వుంది. ఇప్పుడు విశాఖలో వేడి పెరగకుండా చూసుకోవడం, త్వరగా పచ్చదనం పెరిగేలా చూడటం వల్ల వేడిని తగ్గించుకోవడం ద్వారా విశాఖ మరో తుఫాను బారిన పడకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో తుఫాన్లు విశాఖను తాకకుండా వుండాలంటే విశాఖ పరిసరాల్లో భారీగా చెట్లను పెంచడం మాత్రమే తరుణోపాయమని నిపుణులు చెబుతున్నారు.