అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి పెట్టాలి..!

 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ మొదటి నుండి పునర్నిర్మాణం చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులందరూ కూడా కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసారు తప్ప రాష్ట్రంలో మిగిలిన జిల్లాలను పెద్దగా పట్టించుకోలేదు. వివిధ జిల్లాలకు చెందిన మంత్రులు, యం.యల్.ఏ.లు, యంపీలు కనీసం తమతమ జిల్లాలను నియోజక వర్గాలను అభివృద్ది చేసుకొనేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు వంటి ఏ కొద్దిమందో ప్రజాప్రతినిధులు మాత్రం తమ నియోజక వర్గానికి, జిల్లాకు పరిశ్రమలు, మౌలిక వసతులు వంటివి ఏర్పాటు చేసుకొన్నారు. అందువల్ల రాష్ట్ర విభజన తరువాత వైజాగ్, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి నాలుగు నగరాలు మాత్రమే ఎంతో కొంత అభివృద్ధి చెందినట్లు కనబడుతున్నాయి తప్ప అభివృద్ధి విషయంలో మిగిలిన ప్రాంతాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ లోటు రాష్ట్ర విభజన తరువాత మరీ కొట్టవచ్చినట్లు కనడుతుంటే, రాజకీయ నేతలు సైతం తాము చేసిన పొరపాటుకు చింతిస్తున్నారు. అందుకే ఇప్పుడు 13 జిల్లాలకు అభివృద్ధిని సమానంగా వ్యాపింపజేయాలనే ఆలోచన వారిలో కూడా మొదలయింది.


మన పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను చూసినట్లయితే అవి మొదటి నుండి కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేసినట్లు అర్ధం అవుతుంది. అందుకే వాటికి ఇటువంటి సమస్య ఎదురవలేదు. ఒకవేళ దురదృష్టవశాత్తు ఎదురయినా అవి ఇంత దైన్యస్థితిలో మాత్రం ఉండవని ఖచ్చితంగా చెప్పవచ్చును. తమిళనాడు రాజధాని చెన్నైతో సమానంగా మదురై, సేలం, కోయంబత్తూర్ జిల్లాలు అభివృద్ధి చెందాయి. అవికాక కన్యాకుమారి, తిరుపూర్, వెల్లూరు వంటి జిల్లాలు వివిధ రంగాలలో ఎంతో కొంత అభివృద్ధి సాధించాయి. అందువల్ల అక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నందున ప్రజలు రాజధాని చెన్నైపై ఆధారపడటం తక్కువ. అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు నగరాన్ని మనదేశ సాఫ్ట్ వేర్ రాజధానిగా అందరూ భావిస్తున్నప్పటికీ, ఆ రాష్ట్రంలో కూడా షిమోగా, బళ్ళారి, కోలార్, దావణగేరే వంటి జిల్లాలకు అభివృద్ధి వ్యాపించి ఉంది. అందువల్ల ఇప్పుడు మన రాష్ట్రం కూడా అదేవిధంగా అభివృద్ధిని అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయవలసి ఉంది. మన నేతల ప్రయత్నలోపం లేకపోతే కేంద్రప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించేందుకు సిద్దంగా ఉంది గనుక అభివృద్ధి సాధించడం అసాధ్యమేమీ కాదు.