ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడే

ఆంధ్రప్రదేశ్‌కు సూర్యుడే బ్రాండ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇవాళ జరిగిన సూర్యారాధన కార్యక్రమానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తూర్పు తీర ప్రాంతంగా ఏపీ నుంచే సూర్యుడు ఉదయిస్తున్నందున సన్ రైజ్ స్టేట్ నినామిచ్చామని.. అన్ని మతాల్లోనూ.. ప్రాంతాల్లోనూ.. సూర్యునికి ప్రాధాన్యత ఉందన్నారు.. సర్వజనీన నిత్యచైతన్య శక్తిగా ఉన్న సూర్యుడిని ఆరాధిస్తే.. ఆరోగ్యంగా, మానసికంగా వృద్ధిని సాధిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 460 కోట్ల సంవత్సరాల వయసున్న సూర్యుడి నుంచి మనం రోజూ శక్తిని పొందుతూనే ఉన్నామన్నారు.. ప్రకృతికి సాంకేతికతను జోడించి ముందుకు వెళ్లాలన్నారు. ఈ రెండు మానవ మనుగడకు అవసరమేనన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో సౌరశక్తితోనే 5 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు.

 

ఆసనాలకు దూరంగా ముఖ్యమంత్రి:
సూర్యారాధన కార్యక్రమంలో వందలాది మంది విద్యార్ధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు యోగాసనాలు చేస్తుండగా.. ముఖ్యమంత్రి మాత్రం వీటన్నింటికి దూరంగా ఉండిపోయారు. తనకు కుడి చెయ్యి నొప్పిగా ఉందని ఆయన అనడంతో.. ఆసనాలు వేయవద్దని ఫిజియో థెరిపిస్టులు వారించారు. దీంతో వారి సలహా మేరకు చంద్రబాబు అక్కడే కూర్చుండిపోయారు.