పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్న చంద్రబాబు

 

ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు అయిన సంగతి తెలిసిందే.రేపు జరుగనున్న మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, ఎస్టీ, మైనారిటీ నాయకులతో భేటీ కానున్నారు.మంత్రివర్గ విస్తరణ, మండలి ఛైర్మన్ స్థానం భర్తీ, తాజా రాజకీయాలపై చర్చించనున్నారు.ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యంలేదు.దీంతో ముస్లిం మైనారిటీల్లో ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్నఎన్‌ఎండీ ఫరూక్‌కు,ఎస్టీల విషయానికి వస్తే.. ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.అదే విషయాన్ని ఫరూక్‌, శ్రావణ్‌ లకు సమావేశంలో వెల్లడించనున్నారు.అంతే కాకుండా మంత్రిపదవి ఆశించిన నేతలను సీఎం బుజ్జగించనున్నారు.ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.కీలకమైన వైద్యారోగ్య శాఖ బాధ్యతలు కొత్త మంత్రికి ఇవ్వాలా? లేక సీనియర్ మంత్రికా? అనే అంశంపై తర్జన భర్జన జరగుతోంది.మండలి ఛైర్మన్‌గా ఉన్నఎన్‌ఎండీ ఫరూక్‌ మంత్రి వర్గంలోకి రానుండటంతో ఖాళీ అయిన మండలి ఛైర్మన్ స్థానంపై చర్చించనున్నారు.ఈ స్థానానికి షరీఫ్, రెడ్డి సుబ్రమణ్యం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యే చాంద్ భాషాతోనూ ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. మంత్రి వర్గ విస్తరణ కోసం విజయవాడకు రానున్న గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.రేపు మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.