ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాలు వారం రోజులే?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి కారణం స్ధానిక సంస్ధల ఎన్నికలే. ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రిజర్వేషన్ల వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చే తీర్పు ఆధారంగానే స్ధానిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ రానుంది.

ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. అయితే అసెంబ్లీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన కీలక బిల్లులు ఆమోదం పొందినా శాసనమండలిలో మాత్రం చుక్కెదురైంది. ఓవైపు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయో లేదో తెలియక సాధారణ జనం గందరగోళంలో మునిగిపోతే ప్రభుత్వం మాత్రం బిల్లులు ఆమోదం పొందాయని చెప్పుకుంటోంది. మండలి ఛైర్మన్ గవర్నర్ కు చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం గవర్నర్ కోర్టులోకి వెళ్లినట్లయింది. అధికార విపక్షాల విమర్శనాస్త్రాల సంగతి ఎలా ఉన్నా కేంద్రంతో సీఎం జగన్ నెరుపుతున్న సంబంధాల పుణ్యమాని శాసనమండలి రద్దుకు అడుగులు వేగంగా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న పార్లమెంటు తిరిగి ప్రారంభం కాగానే ఏపీ మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా కేంద్రం నుంచి జగన్ కు హామీ లభించినట్లు ప్రచారం సాగుతోంది.

కేంద్రం ఏపీ శాసనమండలి రద్దుకు ఆమోద ముద్ర వేస్తే మాత్రం మూడు రాజధానుల ప్రక్రియ జోరందుకోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లోపే స్ధానిక సంస్ధల ఎన్నికలను కూడా పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై తుదితీర్పు ఇచ్చిన వెంటనే స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు శరవేగంగా స్ధానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయబోతోంది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ను బట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. స్ధానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఆలస్యమైతే మాత్రం బడ్జెట్ సమావేశాలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయనుంది. అదే జరిగితే ఈసారి వారం రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

అలా కాకుండా స్ధానిక సంస్ధల రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో వాయిదా పడుతూ పోతే మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయి. అదే జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం మార్చి మొదటి వారంలోనే నిర్వహించే ఛాన్సుంది. అలా అయినా సరే బడ్జెట్ సమావేశాలను వారంలో ముగించి స్ధానిక ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే పంచాయతీ రాజ్ చట్టం సవరణపై జారీ చేసిన ఆర్డినెన్స్ స్ధానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. దీంతో పాటు కేంద్రం మండలి రద్దుపై నోటిఫికేషన్ జారీ చేస్తే మూడు రాజధానులపై తదుపరి ప్రక్రియ కూడా మొదలు కానుంది. అప్పుడు మూడు రాజదానులపై అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.