150 రోజులకు చేరుకున్న జై అమరావతి ఉద్యమం!

ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రకటించాలని ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేస్తున్నారు.
జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకున్న నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రైతుల పోరాటాన్ని కొనియాడారు. 'రైతు పోరాటానికి జయహో. లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు, ఆవేదనతో ఆగిన గుండెలు. జై అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి వైకాపా ప్రభుత్వం అడ్డదారులు తొక్కింది. అయినా రైతులు సహనం కోల్పోలేదు' అని చెప్పారు.

'అణచివేయాలనుకున్న ప్రతిసారీ జై అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం సాగుతున్న జై అమరావతి ఉద్యమం నేటితో 150 రోజులకు చేరుకుంది' అని లోకేశ్ ట్వీట్లు చేశారు.

'జై అమరావతి ఉద్యమంలో నేను సైతం అంటూ భాగస్వామ్యం అయిన రైతులు, మహిళలు, యువత అందరికి ఉద్యమ వందనాలు. భేషజాలకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నాం అని ప్రకటించాలి' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకేశ్ డిమాండ్ చేశారు.