రాజధాని గ్రామాల్లో పోలీసులకు త్రాగడానికి నీళ్లు లేవు.. కూర్చోడానికి బెంచి లేదు

అమరావతిలో ఆందోళనలు 27వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు కూడా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమలు చేశారు. రైతులు, మహిళలపై లాఠీ చార్జ్ చేసినందుకు ప్రతీకారంలో ఆయా గ్రామాల వాసులు పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని కనిపిస్తే చాలు టీ , టిఫిన్లు ,భోజనాలు అడిగితే ఇవ్వమని మొఖం మీదే చెబుతున్నారు. కనీసం మంచినీళ్ళు కూడా లేవు పొమ్మంటున్నారు. పోలీసులకు ఎటువంటి అమ్మకాలు చేయబోమని దుకాణాల యజమానులు కూడా చెప్తున్నారు. 

అమరావతి పోలీసులు వర్సెస్ ఆందోళనకారుల మధ్య విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఊళ్లలో సేద తీరేందుకు వేసిన బల్లలపై వాడి పారేసిన ఇంజినాయిల్ కనిపిస్తుంది. ఊళ్లలో మోహరించిన పోలీసులు ఉన్నతాధికారుల ఉత్తర్వులంటూ 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. అందుకు నిరాకరిస్తున్న గ్రామ ప్రజలు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. నలుగురు కలిసి మాట్లాడుకోకుండా అమలు చేసిన 144 సెక్షన్ పై వినూత్న నిరసన తెలిపారు. ఊళ్లో జనాన్ని కూర్చోనివ్వని పోలీసులకు.. వాళ్లను కూడా కూర్చోనివ్వకుండా బల్లలపై ఆయిల్ పోశారు. ఇప్పటికే అమరావతి ప్రాంతాల్లో పోలీసులకి నీళ్లు కూడా ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు గ్రామస్తులు.