జగన్ దెబ్బకి కేంద్రానికి షాక్....తప్పుకుంటామని హెచ్చరికలు జారీ !

 

ఏపీ రాజధాని అమరావతికి రుణ మంజూరుకు మరో బ్యాంక్ వెనుకడుగు వేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ప్రపంచ బ్యాంక్ రుణ ప్రతిపాదన విరమించుకున్న నేపథ్యంలో తాజాగా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. అక్కడితో ఆగక ప్రాజెక్టులపై సమీక్షలు, నిలిపివేతల విషయంగా కేంద్రానికి లేఖ కూడా రాసిందని సమాచారం. 

జగన్‌ సర్కారు వైఖరిని ప్రస్తావిస్తూ ఇలా చేస్తే మీ దేశంలో ఏ రాష్ట్రానికీ రుణం అందించలేమని తెలిపిందని చెబుతున్నారీ. ఒక ప్రభుత్వం వచ్చి ప్రాజెక్టుల కోసం రుణం తీసుకుంటే అదే స్థానంలో వచ్చ్హిన మరో ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను సమీక్షల పేరిట నిలిపివేస్తుందని, ఇది ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్న బ్యాంకు పరిస్థితి ఇలాగే ఉంటే మొత్తం మీ దేశం నుంచే తప్పుకోవాల్సి వస్తుందని కేంద్రాన్ని హెచ్చరించినట్టు సమాచారం. 

గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల మీద సమీక్షలు, అలాగే పనుల నిలిపివేతలపై  జగన్‌ ప్రభుత్వం  మీద ఏఐఐబీ తీవ్రంగా హెచ్చరికలు చేసినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై కూడా చర్చిస్తామని తెలిపింది. తాము ఇచ్చిన రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులను సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లని పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం జరిమానా కూడా విధించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం. 

తమ రుణాలతో చేపట్టిన ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతే తమ పరువు పోతుందని ఏఐఐబీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. అయితే ఈ విషయం మీద విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు చర్చించి ఏఐఐబీ లేఖ కాపీని ఏపీ ప్రభుత్వానికి పంపారు. బెంగుళూరు మెట్రో, ముంబైలో రవాణా మెరుగుదల, రోడ్లు, విద్యుత్‌ వసతుల మెరుగుదల వంటి పలు ప్రాజెక్టులకు ఏఐఐబీ రుణం అందిస్తోంది. 

మరికొన్ని ప్రతిపాదన దశలో ఉండగా ఇప్పుడు గనుక ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించకుంటే ఆ ప్రభావం మిగతా వాటి మీద కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తుందో ? చంద్రబాబు సర్కార్ ఎలా అయినా అవినీతి చేసిందని నిరూపించడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చీవాట్లు పెట్టిస్తున్నాయి. అంతా మనదే ఏమి చేసినా ఇబ్బంది లేదనుకుంటున్న జగన్ సర్కార్ కి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇండియాలో మిగతా ప్రాజెక్ట్ లకి కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది.