మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు... ముగ్గురు యువకులు అరెస్ట్‌

 

40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను కోల్పోయిన సంఘటనను మరచిపోక ముందే పుల్వామాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పింగలాస్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఉగ్రవాదుల ఉనికిని పసిగట్టిన భద్రత దళాలు కూడా ఎదురు కాల్పులు మొదలెట్టాయి. ఈ కాల్పుల్లో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒకరికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీస్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిని ఢీ​​కొట్టి 43 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు రోజుకో రకంగా దాడులు కొనసాగిస్తున్నారు. శనివారం రాజౌరీ జిల్లాలో వారు అమర్చిన ల్యాండ్‌మైన్‌ నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్మీ అధికారి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో మేజర్‌ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందడంతో యావత్‌ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. కాగా ఉగ్రదాడిని సమర్థించిన  ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేసినట్లు బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ శివకుమార్‌ తెలిపారు. కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన జాకీర్, వకార్‌ అహ్మద్, గౌహార్‌లు కేంద్ర ప్రభుత్వ నిధులతో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని స్ఫూర్తి కాలేజీలో బీఎస్సీ చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నారు. గురువారం ఉగ్రవాదుల దాడి జరిగిన వెంటనే సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గురూ హాస్టల్‌ గదిలో డ్యాన్సులు చేశారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు ప్రశ్నించగా వారిపై దాడికి తెగబడ్డారు. కాలేజీ ప్రిన్సిపల్‌ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సూర్యనగర్‌ పోలీసులు ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. సంబరాలు చేసుకోవడంతో పాటు భారత సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేశారని, కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేయనున్నామని ఎస్పీ శివకుమార్‌ తెలిపారు.