ఆంధ్రప్రదేశ్ కు అదనంగా ఐపీఎస్ ల కేటాయింపు
posted on Jul 27, 2024 10:20AM
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఓ వైపు జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల వరద పారింది. కేంద్రం ఏపీకి భారీ కేటాయింపుల వెనుక చంద్రబాబు ఒత్తిడి ఉందన్న సంగతి తెలిసిందే. మరో వైపు జగన్ పాలనలో అక్రమాలు, అన్యాయాలను కళ్లకు కట్టే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ జగన్ శిబిరంలో భూకంపం వచ్చేలా చేస్తున్నారు. అంతే కాకుండా జగన్ హయాంలో ప్రతిష్ట కోల్పోయిన పోలీసు శాఖను ప్రక్షాళన చేసే విషయంలో కూడా చంద్రబాబు వేగంగా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగానే రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ లను కూటాయించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆయన వినతి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి అదనపు ఐపీఎస్ లను కూటాయించేందుకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
దీంతో రాష్ట్రానికి అదనంగా 30 మంది ఐపీఎస్ లు రాబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంక్త్ 144 కాగా ఆ సంఖ్యను 174కు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ కు అదనపు ఐపీఎస్ ల కేటాయింపు ఇదే మొదటి సారి.