తెలంగాణా తెదేపా నేతలని అలా లొంగదీస్తుందేమో?

 

రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎసిబి వేసిన పిటిషన్ న్ని హైకోర్టు, ఆ తరువాత సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో ఎసిబికి ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఈ కేసు విషయంలో తెలంగాణా ప్రభుత్వం మొదటి నుండి అత్యుత్సాహం చూపుతునందున, ఎసిబి కంటే దానికే ఎదురు దెబ్బ తగిలినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో తెరాస ప్రభుత్వానిదే పైచేయిగా కనబడింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులో రెండు సార్లు వరుసగా ఎదురు దెబ్బలు తగిలిన తరువాత దీనిపై తెలంగాణా ప్రభుత్వం తన పట్టుకోల్పోయిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అసలు ఎసిబి అభ్యర్ధనని హైకోర్టు త్రోసిపుచ్చినప్పుడే తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉండి ఉంటే ప్రజలలో ఇటువంటి భావన ఏర్పడేది కాదు. కానీ అనవసరమయిన పంతానికి పోయి సుప్రీంకోర్టుకి వెళ్లి భంగపడినట్లయింది.

 

కనుక ఆ పరాభవం నుండి బయటపడి తిరిగి తన ప్రత్యర్ధులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తుందని అందరూ భావించారు. ఊహించినట్లే ఎసిబి అధికారులు తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి, ఖమ్మం జిల్లా తెదేపా యువత సభ్యుడు జిమ్మీ అనే వ్యక్తికి విచారణకు హాజరు కమ్మని కోరుతూ నోటీసులు జారీ చేసారు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంతకు ముందు సెక్షన్: 160 క్రింద నోటీసులు జారీ చేయగా ఈసారి సెక్షన్: 41(ఎ) క్రింద నోటీసులు జారీ చేసారు. ఈ సెక్షన్ క్రింద నోటీసులు అందుకొన్న వారిని ఎటువంటి అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండానే ఎసిబి అధికారులు అరెస్ట్ చేసే వీలు ఉంటుంది. అంటే ఎసిబి అధికారులు వారిరువురూ విచారణకు హాజరయినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.

 

వారిని కనుక అరెస్ట్ చేసినట్లయితే, ఇంతకు ముందు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు తెదేపా నేతలు, మంత్రులు ఏవిధంగా ఆందోళన చెంది, ఒత్తిడికి గురయ్యారో ఇప్పుడూ అదేవిధంగా ఇబ్బందిపడటం ఖాయం. అప్పుడు తిరిగి తనదే పైచేయి అవుతుందని తెరాస ప్రభుత్వం భావిస్తోందేమో? అదే దాని వ్యూహమయితే సండ్ర వెంకట వీరయ్య, జిమ్మీల అరెస్ట్ అనివార్యమని భావించవచ్చును. అప్పుడు మళ్ళీ తెదేపా, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం మొదలవవచ్చును.

 

ఇక మరో ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు రేవంత్ రెడ్డి అరెస్టయినప్పుడు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సహా తెదేపా నేతలందరూ రేవంత్ రెడ్డికి, ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య, జిమ్మీలకి కూడా అదేవిధంగా అండగా నిలబడాల్సి ఉంటుంది. ఈ విషయంలో తెదేపా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సండ్ర వెంకట వీరయ్యని తెరాస తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేయవచ్చును. అదే కనుక జరిగితే ఈ కేసు కొత్తమలుపు తిరుగవచ్చును.

 

రేవంత్ రెడ్డి తను జైల్లో ఉన్నప్పుడు కూడా అధికారిక పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు తనను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసారని చెప్పినట్లు వార్తలు వచ్చేయి. అదే నిజమయితే సండ్ర వెంకట వీరయ్యని కూడా నయాన్నో భయాన్నో లొంగదీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగవచ్చును. ఒకవేళ ఈ వ్యూహం ఫలించినట్లయితే మున్ముందు తెదేపా తెలంగాణా నేతలందరి మీద తెరాస ప్రభుత్వం ఇదే అస్త్రం ప్రయోగించినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.