ఈ ఏడాది కూడా జి.హెచ్.యం.సి ఎన్నికలు లేనట్లేనా?

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి) బోర్డు కాలపరిమితి గతేడాది డిశంబర్ 3వ తేదీనే ముగిసిపోయింది. తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా ఇంతవరకు దానికి ఎన్నికలు నిర్వహించలేదు. చివరికి ఈ ఏడాది డిసెంబర్ 15 లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది.

 

హైదరాబాద్ లో పెరిగిన జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన చేయవలసి ఉంది గనుకనే ఆలస్యం జరుగుతోందని తెలంగాణా ప్రభుత్వ వాదన. కానీ ఆంధ్రాకి చెందిన ప్రజలు ఎక్కువగా స్థిరపడున్న హైదరాబాద్ లో పోటీ చేసి గెలవలేమనే భయంతోనే తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి.కి ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాటి ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుగానే ఈ ఏడాది కూడా ఎన్నికలు నిర్వహించలేకపోవచ్చునన్నట్లు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంకేతం ఇచ్చేరు.

 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వార్డుల పునర్విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. వీలయినంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఒకవేళ డిసెంబర్ లోగా ఆ ప్రక్రియ పూర్తి కాకపోయినట్లయితే మేము మళ్ళీ హైకోర్టుని మరికొంత గడువు కోరుతాము. ఒకవేళ హైకోర్టు అందుకు అంగీకరించకపోయినట్లయితే అవసరమయితే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చును,” అని అన్నారు.

 

వార్డుల పునర్విభజనలో ఆలస్యం కారణంగానే జి.హెచ్.యం.సి ఎన్నికలు నిర్వహించడంలో ఆలస్యం జరుగుతోందా లేక తెరాస తనకు రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఏర్పడేవరకూ ఎదురుచూస్తూ ఎన్నికలని వాయిదా వేస్తోందా అనే విషయాన్ని పక్కనబెడితే, జి.హెచ్.యం.సి ఎన్నికలకు నిర్వహించక పోవడం వలన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ‘స్మార్ట్ సిటీ’ గా మలిచేందుకు ఏటా విడుదల చేయబోయే రూ.100 కోట్లు వదులుకోవలసి ఉంటుంది. ఎన్నికలు నిర్వహించబడని స్థానిక సంస్థలకి నిధులు విడుదల చేయకూడదనే నిబంధన ఉన్నందున, ఈ ఏడాదిలో హైదరాబాద్ కోసం కేటాయించిన రూ.100 కోట్లు, ఒకవేళ ఎన్నికలను వచ్చే మార్చి నెలాఖరులోగా నిర్వహించలేకపోతే వచ్చే ఏడాదికి మంజూరయ్యే మరో రూ. 100 కోట్లు కూడా కోల్పోకతప్పదు.

 

ఇదికాక కేంద్ర ప్రభుత్వం వివిధ పధకాల క్రింద స్థానిక సంస్థలకు ఏటా మంజూరు చేసే నిధులు కూడా కోల్పోవలసి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.100 కోట్ల కంటే తెరాస జి.హెచ్.యం.సి ఎన్నికలలో గెలవడమే ముఖ్యం అని తెలంగాణా ప్రభుత్వం భావించినట్లయితే, మంత్రిగారు చెపుతున్నట్లు మళ్ళీ గడువు కోరుతూ హైకోర్టుకి, అది ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చును. ఛాయిస్ రాష్ట్ర ప్రభుత్వానిదే!