రెడ్డిగారూ ఉండబట్టే..మేమిక్కడ ఉండగలిగాం!

 

 

 
- డా. ఎబికె ప్రసాద్

[సీనియర్ సంపాదకులు]

 

 

డాక్టర్ సంజయ్ బారు పేరు పత్రికాపాఠకులకు తెలిసే ఉండాలి. ఆయనెవరో కాదు, మన తెలుగువాళ్ళలో స్థిరపడిన ఉత్తముల్లో ఒకరు. ఇంకా అంతకంటే వివరించి చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శిగా కీలకపాత్ర వహించిన సుప్రసిద్ధ విశ్రాంతాధికారి బి.పి.ఆర్. విఠల్ కుమారుడే డాక్టర్ బారు; మరింత వివరంగా చెప్పాలంటే ఇటీవల సంవత్సరాలలో ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ కు విశిష్ట మీడియా సలహాదారుగా పనిచేసి ఉన్న ప్రముఖుడే ఈ బారు. ఇతని ప్రస్తావన ఇప్పుడెందుకు చేయవలసి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ విభజన ప్రతిపాదనను అర్థాంతరంగా తెరమీద కెక్కడానికి కారణమైన పాలకపార్టీ అయిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆ పార్టీ అధ్యక్షులయిన సోనియా నాయకత్వాన తెలుగుజాతిని చీల్చడానికి తీర్మానం రూపంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల!

 


ఈ నెల 16న "హిందూ'' పత్రికలో బారు "విభజన'' సమస్యపై రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో మనకు తెలియని ఒక విశేషాన్ని బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ను చీల్చడంకోసం తెలంగాణాలోని కొందరు మోతుబరులయిన గుప్పెడు రాజకీయ నిరుద్యోగులు తమ పదవీ స్వార్థప్రయోజనాల కోసం లేవనెత్తిన ఉద్యమం [ఇలాంటిది 1969-70 లలో కూడా ఇదే బాపతు వర్గం మరొక రూపంలో లేవనెత్తింది]సందర్భంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానవర్గం 2001లోనూ 2004లోనూ ఇరుప్రాంతాల మధ్య సమస్యలేమైనా ఉంటే రాష్ట్రం విడిపోవటం కాకుండా వాటి పరిష్కారానికి మరొక ఎస్.ఆర్.సి.ని నియమిస్తే చాలునని ప్రతిపాదిస్తూ వచ్చింది; ఈ సమస్య పూర్వరంగంలో ఆనాటి [2004 నుంచి 2009 మధ్య, ఆ పిమ్మట 2009లోనూ] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఢిల్లీ వెడుతుండేవారు. వెళ్ళినప్పుడల్లా ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకుంటూ వుండేవారు. ఆ సమయంలో బారు ప్రధాని మీడియా సలహాదారుగా ప్రధానికి సన్నిహితంగా ఉండి ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య సంభాషణ వింటూండేవారు. అలాంటి సందర్భాల్లో మన్మోహన్ సింగ్ తనకు కలవవచ్చిన రాజశేఖర్ ను ఉద్దేశించి ఎప్పుడూ ఏమంటూ సంబోధించేవారో బారూ తాజా వ్యాసంలో పేర్కొన్నారు "రండి రెడ్డిగారూ, స్వాగతం. మీరక్కడ (ఆంధ్రప్రదేశ్ లో) ఉండబట్టే మేమిక్కడ (ఢిల్లీ) ఉండగలిగాం'' అని మన్మోహన్ కితాబు!



ప్రధాని మన్మోహన్ - ముఖ్యమంత్రి వై.ఎస్.కు అంత కితాబివ్వగలిగారు? "కారణం లేని తోరణం'' ఉండదు. 2004లోనూ, 2009లోనూ రెండుసార్లు జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అఖండవిజయం సాధించిపెట్టింది రాజశేఖర్ రెడ్డి. అటు దేశేయంగానూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పరువుప్రతిష్ఠలు స్థిరపడడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారకులయిన ముఖ్యులలో ముఖ్యుడు రాజశేఖర్ అని మన్మోహన్ కే కాదు, తాము కాంగ్రెస్ 'పెద్దలం' అనుకునే వాళ్ళందరికీ తెలుసు. కాని మన్మోహన్ కు ఆ కృతజ్ఞతాభావం వుందిగాని సోనియాకు ఉందని నమ్మలేం! ఏ నాయకుడైనా/నాయకురాలైనా తన కొడుకులు/కూతుళ్ళు తన స్థాయికి రావాలని కోరుకోవతంలో తప్పులేకపోవచ్చుగాని, ఎదుటివాళ్ళ బిడ్డలు ఎదిగిరాకూడదని తలంచేవాళ్ళు దుష్టులుగానే ముద్రపడతారు! తాను అందుకు భిన్నం కాబట్టే బహుశా మన్మోహన్, నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ ను అలా తనను కలుసుకున్నప్పుడల్లా 'ఢిల్లీ లో కూడా మేము అధికారంలో ఉండగలగడానికి మీ కృషి వల్లనే'నని ధ్వనించగలిగాడు! మొత్తం ఆంధ్రప్రదేశ్ విజయం ప్రభావమే కేంద్రంలో సోనియా 'ప్రభ' వేలులోకి రావడానికి కారణమయింది. దేశ, విదేశీ పత్రికలూ ఆ విజయాన్ని ఘనంగా కీర్తించడమూ జరిగింది!

 

1999లో కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో దక్కిన పార్లమెంటు లోక సభ సీట్లు కేవలం 9 కాగా ఆ సంఖ్య 2004ఎన్నికల్లో టిడిపి సహా అన్ని ప్రతిపక్షాలనూ ఓడించి 29 స్థానాలు కాగా, ఆ సంఖ్య తిరిగి 2009 ఎన్నికల్లో 33కి పెరిగి, కాంగ్రెస్ పార్టీ ఇటు హైదరాబాద్ లోనూ, అటు ఢిల్లీలోనూ అధికారానికి దిలాసాగా రాగల్గింది! కాంగ్రెస్ కు 'పాడికుండ'లాంటి అలాంటి ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి కాంగ్రెస్ నిష్కారణంగా కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు కృత్రిమంగా పెంచిన ప్రాంతీయ ఉద్యమానికి బెదిరిపోయి, రాజనీతిజ్ఞతను మరిచిపోయి అధిష్ఠానం పూనుకోవడాన్ని సంజయ్ బారు ఎంతో ఆవేదనలో నిశితంగా విమర్శించవలసి వచ్చింది౧ ఆ వేదనలో అతనొక మాత అన్నాడు : "బ్రిటీష సామాజ్యవాద ప్రభుత్వం సహితం భారతదేశాన్ని విభజించడానికి ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సివచ్చింది. కాని నేటి స్వతంత్ర భారతప్రభుత్వం మాత్రం దేశంలోనే తొలి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యను పూర్తిగా అనాలోచితంగా పరిష్కరించడానికి గజ్జేకట్టింది''!

 

కాంగ్రెస్ అధిష్ఠానానిది ఎంత అనాలోచితమైన చర్యో, అంతకన్నా ఎక్కువరెట్లు అనాలోచితమైన వైఖరిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు, ఎం.పి.లూ, శాసనసభ్యులూ వహించారని చెప్పాలి. వాళ్ళకి అవినీతితో బంధుత్వమేగాని ఆలోచనతో కాదు; వాళ్లకి అధిష్ఠానం కాళ్ళకు మొక్కడంలో అవమానం చూడరు, ప్రజల కాళ్ళు మొక్కడానికి బిడియపడతారు. విభజన సమస్యపై అధిష్ఠానం నుంచి కిందిస్థాయి ఛోటా-మోటా కాంగ్రెస్ నాయకులవరకూ తమ పదవులు వదులుకోవడానికి సిద్ధంగా లేరు; వదులుకున్నట్టుగా ప్రజలకు కన్పించేందుకు స్పీకర్ లకు రాజేనమా పత్రాలు సమర్పించామని చెప్పడమేగాని ఆమోదింపజేసుకునే దమ్ములు లేవు! నేడు "ఆత్మగౌరవం'', "ఆత్మవిశ్వాసం'' అన్న పదాలకు విలువలేకుండా చేస్తున్నవాళ్ళు కాంగ్రెస్, టిడిపిలే; అందరూ రెండునాల్కలతో మాట్లాడేవారేగాని, ఏకావాక్యతతో మెలగడంలేదు. తమ రాజీనామా లేఖల్ని లోక సభ స్పీకర్ తిరస్కరించినా కాంగ్రెస్ ఎం.పి.లు ఎందుకు తిరస్కరించాల్సివచ్చిందో గద్దించే దమ్ములు కూడా కోల్పోయారు; అదేమంటే, విభజన సమస్యపై చర్చలకు ఇంకా రంగంలోకి రాని "మంత్రులబృందం'' అనే "దేవతావస్త్రాల'' సంఘాన్ని చూపుతూ ఆ సంఘాన్ని 'ఇదిగో, అదిగో' కలుస్తామని కేంద్రంలోని మంత్రులు ఊరించుతున్నారు!

 

"మా రాజీనామాల వల్ల విభజన ఆగద''ని పరువు కోల్పోయిన మంత్రులు సిగ్గువిడిచి ప్రకటించుకుంటున్నారు. రాష్ట్రానికి ఇంత రాజకీయ, ఆర్ధిక, సామాజిక  నష్టాలకు కారణమయిన కాంగ్రెస్ ను 2014 ఎన్నికల్లో ఎలాగోలా గట్తెక్కించుకుందామనే కాంగ్రెస్ వందిమాగధులు ఆశిస్తున్నారుగాని, ప్రజలు  మరోసారి మోసపోరు! ఎందుకంటే రాష్ట్రవిభాజనకు జరిగిన కుట్రలో ఎవరెవరు భాగాస్వాములో, ఎవరు, ఏ పార్టీ నాయకులు ఎవరితో ఎక్కడ కుమ్ముక్కు అయ్యారో, ఎవరిమధ్య ఎలాంటి ఒప్పందాలు జరిగాయో పూసగుచ్చినట్టు వెల్లడిస్తానని కాంగ్రెస్ సీనియర్ ఎం.పి. లగడపాటి ఇప్పటికి ప్రకటనలవరకే సరిపెట్టుకుంటున్నారుగాని, 'ముగ్గు'లోకి దిగడం లేదు! కాంగ్రెస్ లో ఆదినుంచీ "క్రమశిక్షణ'' అనే పేరుతొ నెహ్రూ కుటుంబసభ్యులకు దాసోహం అవడమే తమ ప్రత్యేక "జన్యు'' (డి.ఎన్.ఎ) లక్షణంగా భావించుకోవటం వల్లనే ప్రజల్ని మోసగించడానికి నాయకులు వెనుదీయడంలేదు. ఈ నేపథ్యంలోనే విభజన సమస్యపై సీమాంధ్రులతో చర్చలకు వస్తుందనుకున్న "ఆంటోనీ కమిటీ''ని ఆటక ఎక్కించారని పత్రికలు వార్తలందించాయి!

 

పిసిసి అధ్యక్షుడు బొత్సా నాటకాలు మానలేదు. జీవితంలో ప్రశ్నార్థకమైన "లాడ్జీ''రాజకీయాలకు అలవాటుపడిన రాజకీయ నాయకులు రాష్ట్ర రాజకీయాయపక్షాలకు నాయకత్వం వహించటం హాస్యాస్పదం! అందువల్ల స్పీకర్  ఫార్మాట్ లో రాజీనామాలు చేసి ప్రజలకు 'టోపీ'పెట్టె కార్యక్రమాన్ని రాష్ట్ర ఎం.పి.లు, శాసనసభ్యులూ మానుకొని ప్రజలతో మమేకతను, సమైక్యతా ఉద్యమానికి ఆచరణలో అండగానూ నిలబడి తీరాలి. అదే దేశభక్తికీ, తెలుగుజాతి పట్ల అనురక్తికీ నిదర్శనంగాని, స్పీకర్ కు యిచ్చే దొంగ ఫార్మాట్లు కావు. ఇటువంటి తప్పుడు ప్రకటనలతో, నర్మగర్భ కుట్ర రాజకీయ ప్రయోజనాలతో స్వాతంత్రోద్యమంలో వ్యవహరించి ఉండగలిగితే భగత్ సింగ్ లాంటి వీరులు తమ విలువైన ప్రాణాలను ఏనాడో కాపాడుకోగలిగి ఉండేవారు; ఆత్మగౌరవానికి పరీక్ష దొంగఫార్మాట్ లో రాజీనామాలు యివ్వడం కాదు. ఆ పత్రాలు లేకపోయినా, స్పీకర్ తొక్కిపట్టినా "ప్రజా ప్రతినిధుల''పేరుకు తగినట్టుగా శాసనకర్తలందరూ ప్రజలమధ్యకి రావలసిందే. రాజీనామాలు, ఆమోదించు ఆమోదించకపో  - కాంగ్రెస్ పార్టీకే రాజీనామా యివ్వగలగాలి!