అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం మళ్లీ తెరచుకుంది

 

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం మళ్లీ తెరచుకుంది. పెట్రోల్ దాడి జరిగిన పాత బిల్డింగ్ కు కొద్ది దూరంలోనే మరో బిల్డింగ్ లో కార్యాలయం తెరచుకుంది. కొత్త తహసీల్దార్ గా వెంకట్ రెడ్డి చార్జి తీసుకున్నారు. ఆయనతో పాటు సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. నవంబర్ 4వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వోగా ఉన్న విజయా రెడ్డి పై సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విజయారెడ్డితో పాటు ఆమె డ్రైవర్, రైతు సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దాడి ఘటన నుంచి 24 రోజులుగా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీస్ తెరుచుకోలేదు. 

పాస్ పుస్తకాల విషయంలో ఆగ్రహానికి గురైన రైతు సురేష్ మధ్యాహ్నం సమయంలో ఎమ్మార్వో విజయా రెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతనికి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదం లో విజయా రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సురేష్, డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రెవెన్యూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. 

ఈ కేసులో సురేష్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొందరి ప్రోద్బలం తోనే సురేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.  విజయా రెడ్డి పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాడి ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు ప్రభుత్వం భద్రత పెంచింది. మరోవైపు, తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ వృద్ధ దంపతులు ఆర్టీవో కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో జరిగింది. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో వేణుమాధవరావు తనిఖీలు చేస్తూ ఉండగా ఆశప్ప- భారతమ్మ అనే దంపతులు ఆర్టీవో కాళ్ల పై పడ్డారు. సంఘటన పై చలించిన ఆర్టీవో సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు.