షర్మిల అడిగింది... కేజ్రీవాల్ ఇచ్చాడు... ఆప్ నేతలు నొచ్చుకున్నారు!

 

తాను అనుకోని చేసినా, అనుకోకుండా చేసినా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పని వల్ల న్యూస్ లో వుంటాడు. ఆయనకి ఆ మీడియా కవరేజ్ యోగమేదో జాతకంలో వున్నట్టు వుంది! ఆయన పరిపాలించే రాష్ట్రం ఢిల్లీ దేశంలోనే అత్యంత చిన్నది. నిజానికి ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి నగరాల వంటిదే. ఆయన ముఖ్యమంత్రి అయినా ఒక మేయర్ స్థాయి పదవి ఆయన అలంకరించిన సీటు! కాని, పెద్ద పెద్ద రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కనిపించనంత, వినిపించనంత విరివిగా ఏకే హల్ చల్ చేస్తుంటాడు. ఇప్పుడు మరోసారి తనకు తెలియకుండానే వార్తల్లోకి ఎక్కేశాడు ఆప్ అధినేత!

 

అరవింద్ కేజ్రీవాల్ న్యూస్ అంటే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతోన్న గోవా, పంజాబ్ నుంచి అనుకోకండి. అక్కడ ఆప్ గెలిచే అవకాశాలు బాగానే వున్నాయంటున్నారు. అలాంటి సీరియస్ మ్యాటర్ అయితే అంతా బాగానే వుండేది. కాని, మోదీ మీద వ్యతిరేకతతో కేజ్రీ చురుగ్గా పనిచేస్తుంటాడు. అలా ఆయన కలుసుకున్న ఒకానొక నాయకురాలే షర్మిలా. తెలుగు వారికి తెలిసిన షర్మిల కాదులెండీ! ఇరోమ్ షర్మిల అని మణిపూర్ లో ఏళ్లపాటూ నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారిణి!

 

ఇరోమ్ షర్మిల మణిపూర్ లో సైన్యానికి వుండే ప్రత్యేక అధికారాలు రద్దు చేయాలని చాలా ఏళ్లుగా పోరాటం చేస్తోంది. కాని, అక్కడ వుండే ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బీజేపి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఎన్డీఏ, యూపీఏ ... ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇక లాభం లేదనుకుని ఏళ్ల పాటూ సాగిన తన ఉపవాస దీక్ష ముగించి ఈ మధ్యే షర్మిల ఎన్నికల రాజకీయాల్లోకి దిగింది. ఆమెకు బలవంతంగా ఫ్లుయిడ్స్ ఎక్కిస్తూ ప్రాణాలు కాపాడిన ఢిల్లీ ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, ఆమె అనూహ్యంగా తనకు రాజకీయ సలహా, మార్గదర్శనం చేయమంటూ అరవింద్ ను అప్రోచ్ అయింది. అప్పుడే అందరి కళ్లూ షర్మిల, కేజ్రీవాళ్లను అనుమానంగా చూశాయి. ఇదేదో మోదీ వ్యతిరేక కుట్రేమో అన్నట్టు భావించాయి.

 

అరవింద్ కేజ్రీవాల్ మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలకి ఎలాంటి సూచనలు చేశారో తెలియదుగాని ... ఆమె తన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటానని చెప్పిన పార్టీ ఆఫీస్ కి మాత్రం 50వేలు డోనేట్ చేశాడు. తన అలవాటు ప్రకారం ట్విట్టర్ లో ప్రకటించాడు కూడా. వెంటనే దేశ వ్యాప్త ఆప్ అభిమానులు తమ నాయకుడి గొప్ప మనస్సుకి ఉపొంగి పోయి కామెంట్స్, రీట్వీట్స్ చేశారు. కాని, మణిపూర్ లోని ఆమ్ ఆద్మీ కార్యకర్తలు మాత్రం లోలోపలే తీవ్రంగా మథన పడ్డారు. ఇప్పుడే అదే పెద్ద డిస్కషన్ కి దారి తీసింది!

 

కేజ్రీవాల్ 2014లో పిలుపునిచ్చినప్పటి నుంచీ మణిపూర్ లో కొందరు అభిమానులు పార్టీ కోసం పని చేస్తూనే వున్నారు. అయితే వారికి ఇప్పటికీ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయలేదు ఢిల్లీలోని ఆప్ హైకమాండ్! తమ  స్వంత ఖర్చులతో ఆప్ పార్టీ నడుపుతున్నారు అక్కడి వారు. కాని, నిన్నగాక మొన్న వచ్చిన ఇరోమ్ షర్మిల అడగటమూ , తమ నాయకుడు ఉదారంగా 50వేలు ఇవ్వటమూ అక్కడి వారికి అస్సలు నచ్చటం లేదట! స్వంత దుకాణానికి దిక్కులేదు... పక్క పార్టీలకి పరోపకారమా అంటూ విసుక్కుంటున్నారట!

 

అరవింద్ కేజ్రీవాల్ షర్మిలకు విరాళం ఇవ్వటం, మణిపూర్ అప్ శ్రేణులకి అది నచ్చకపోవటం... పెద్ద రాజకీయ దుమారం ఏం కాదు. అసలు మణిపూర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అస్థిత్వమే అంతంత మాత్రం. అరవింద్ పట్టించుకోకపోతే కాంగ్రెస్, బీజేపి, కొత్తగా వస్తోన్న షర్మిల పార్టీ... దేనిలోకో వెళ్లిపోతారు. కాని, అసలు సమస్య ఢిల్లీ ముఖ్యమంత్రిగారి ఆలోచనా విధానం. పబ్లిసిటీ వచ్చే అంశాలకే ప్రాధాన్యతనిస్తూ , విరాళాల రాజకీయం నడుపుతూ, స్వంత పార్టీ విస్తరణని నిర్లక్ష్యం చేస్తే.. చివరకు ఏం మిగులుతుంది? మోదీ మీద విస్త్రృతంగా చేసిన ఆరోపణల పేపర్ కటింగ్స్ మాత్రమే...