అక్షయ్, సైనాను  తప్పుబట్టిన మావోలు జనానికి ఇస్తోన్న సంకేతం ఏంటి?

 

పేదల కోసం, తాడిత, పీడిత జనం కోసం, గిరిజనుల కోసం మొదలైన ఉద్యమం నక్సల్ బిరీ ఉద్యమం. అది క్రమంగా పెరిగి పెద్దదై ఇవాళ్ల మావోయిస్టు హింసగా మారింది. యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న అడవిలో అన్నల ఆదర్శం… వేలాది ప్రాణాలు బలి తీసుకుని సాధించింది ఏంటి? సూటిగా మాట్లాడుకుంటే ఎలాంటి సమాధానం దొరకదు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో తప్ప మరెక్కడా ఇప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం లేదు. మిగతా చోట్ల అక్కడక్కడా బలంగా వున్నా మొత్తానికి మొత్తంగా ప్రభావితం చేసే శక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ క్రమంలో మావోయిస్టులు వున్నట్టుండీ విరుచుకుపడి జవాన్లను చంపటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. తరువాత ఆర్మీ, ప్రభుత్వాలు కూడా ప్రతీకార దాడులతో మరింత రక్తపాతం చేస్తున్నాయి…

 

అంతం అంటూ లేకుండా నడుస్తోన్న మావోయిస్టు హింసలో అమరులయ్యే సైనికులు, పోలీసులే అత్యంత అభాగ్యులు. ఎందుకంటే, వారు అన్నల మాదిరిగా అడవుల్లోకి ఏవో ఆదర్శాలతో ఆవేశంతో రారు. ఉద్యోగం కోసం భద్రతా దళాల్లో చేరి తరువాత అధికారులు చెప్పిన విధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోకి వస్తారు. వారికి ఏ నక్సలైటుతోనూ , గిరిజనుడితోనూ వ్యక్తిగత పగ, ప్రతీకారం వుండదు. కాని, వారు తమని చంపుతున్నారు కాబట్టి మావోలు కూడా వాళ్లని మట్టుబెడుతుంటారు. యుద్ధంలో అది తప్పు కాకపోవచ్చు. కాని, అసలు సీఆర్పీఎఫ్ జవాన్ల కూంబింగ్ ఎందుకు నడుస్తోంది? వామపక్ష ఉగ్రవాదులు ఆయుధాలు వదలకపోవటం వల్ల. యాభై ఏళ్లుగా తమకంటే వందల రెట్లు బలవంతమైన ప్రభుత్వాల్ని చాలీ చాలని ఆహారం, ఆయుధాలతో ఎదుర్కోవాలని ప్రయత్నిస్తుండటం వల్ల! ఇలా కొండను ఢీకొడుతూనే వుంటే ఎప్పటికి అది పగిలేది? ఎప్పుడు సమ సమాజం ఏర్పడేది? మావోయిస్టుల వద్ద ఎలాంటి సమాధానం లేదు!

 

రష్యా మొదలు నిన్న మొన్నటి నేపాల్ వరకూ ఎక్కడా సాయుధ విప్లవం శాశ్వత మార్పు సాధించలేకపోయింది. రక్త చరిత్ర అలాంటి నిజం చెబుతున్నా… మన మావోలు మాత్రం తమ పంథా మార్చుకునే ఉద్దేశంలో లేరు. కనీసం ఇప్పుడున్న పంథాలోని లోపాల్ని సైతం విశ్లేషించుకునే తీరికలో లేరు. పైగా అక్షయ్ కుమార్, సైనా నెహ్వాల్ అమరులైన జవాన్ల కుటుంబాలకి ఆర్దిక సాయం చేస్తే మావోయిస్టులు దాన్ని తప్పుపట్టడం ఆశ్చర్యకరం! విషాదం! ఎందుకంటే, అక్షయ్, సైనా జీవితం గడపటం సమస్యగా మారిన కుటుంబాల్ని ఆదుకున్నారు కాని మావోయిస్టులపై పోరుకి జవాన్లకి ఆయుధాలు కొనివ్వలేదు. కాబట్టి వారికి యుద్ధంతో సంబంధం లేదు. యుద్ధం ఆపాల్సింది మావోలు. వాళ్లతో చర్చలు జరిపి సంధికి ప్రయత్నించాల్సింది ప్రభుత్వాలు. మధ్యలో జవాన్ల కుటుంబాల్ని ఆదుపుకున్న ఆక్షయ్, సైనాల్ని టార్గెట్ చేస్తే వారేం చేస్తారు?

 

ఎప్పుడు ఏ ఎన్ కౌంటర్ జరిగినా అది ఫేక్ అంటూ మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మావోయిస్టులకు మద్దతుగా బయటకు వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో వారలా సాయుధ విప్లవకారులని సపోర్ట్ చేయటం సబబైతే జవాన్లకి ఆర్దిక సాయం చేసిన అక్షయ్, సైనాల్ని ఏమనగలం? వారి స్వంత కష్టార్జితం ఎవరికి ఇచ్చినా తప్పేముంది? అలాంటి సెలబ్రిటీల్ని కూడా తమ కరపత్రాల్లో విమర్శించి మావోయిస్టులు సామాన్య జనం ముందు మరింత తప్పైపోతున్నారు. ఇది ఖచ్చితంగా అత్యంత అట్టడుగు వర్గాల క్షేమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అన్నలు పునరాలోచించుకోవాల్సిన చారిత్రక సమయం!