మీ పౌరసత్వం నిరూపించుకోండి... హైదరాబాదీలకు ఆధార్ సంస్థ నోటీసులు

పౌరసత్వ సవరణ చట్టంపై దేశం మొత్తం అట్టుడుకుతున్నవేళ, ఆధార్ సంస్థ తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. అసలే, ఒకపక్క సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే, మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ నోటీసులు ఇవ్వడం ప్రకంపనలు పుట్టిస్తోంది. తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డు పొందారంటూ 127మంది హైదరాబాదీలకు నోటీసులిచ్చిన ఉడాయ్‌.... పౌరసత్వం నిరూపించుకోవాలంటూ ఆదేశించింది.

నకిలీ పత్రాలతో ఆధార్ కార్డు తీసుకున్నారంటోన్న ఉడాయ్.... పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన ఒరిజినల్‌ డాక్యుమెంట్లతో తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఒకవేళ, భారతీయులు కాకపోతే, చట్టబద్ధంగానే భారతదేశంలోకి అడుగుపెట్టినట్లు నిరూపించుకునే డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించింది. అయితే, విచారణకు రాకపోయినా, పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించకపోయినా, రూల్ 29 ప్రకారం ఆధార్ కార్డును కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. అయితే, ఆధార్ కార్డు పౌరసత్వానికి గుర్తింపు కాదని అత్యున్నత న్యాయస్థానం చెబుతుంటే, మరోపక్క ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ నోటీసులు జారీ చేయడమేంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ ఇష్యూ చేసిన నోటీసులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఆధార్ సంస్థ జారీ చేసిన నోటీసులకు.... కార్డెన్ సెర్చ్ లకు సంబంధం ఏమిటో తెలియదు గానీ, తెలంగాణ పోలీసుల తీరుపై అసద్ మండిపడ్డారు. అసలు, కార్డెన్‌ సెర్చ్‌లో ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారంటూ తెలంగాణ పోలీసులను ప్రశ్నించారు. ఇంటింటి తనిఖీల్లో ఆధార్ కార్డు చూపించాలని అడగటానికి తెలంగాణ పోలీసులకు ఉన్న చట్టబద్ధత ఏమిటని నిలదీశారు. ఇక, ఆధార్ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న అసదుద్దీన్‌.... నోటీసులిచ్చిన 127మందిలో ఎంతమంది ముస్లింలు, దళితులు ఉన్నారో చెప్పాలంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు.

అయితే, అసదుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఘాటుగా రియాక్టయ్యారు. అసద్ కామెంట్స్... ఉగ్రవాదులను సమర్ధించేలా ఉన్నాయన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు... ఆధార్ కార్డు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. దాంతో, ఆధార్ సంస్థ నోటీసులపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపించి మీ భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం కలకలం రేగుతోంది. అసలే, సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటం... పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లిం మైనార్టీ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్న పరిస్థితుల్లో... ఆధార్ సంస్థ ఏకంగా మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ నోటీసులు ఇవ్వడం ప్రకంపనలు పుట్టిస్తోంది. మరి, దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లోనే నోటీసులు జారీ చేసిందా? లేక ఇంకెక్కడైనా ఇలా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే ఫస్ట్ కేస్ అయితే, మాత్రం పౌరసత్వంపై ఆందోళన చెందుతున్న వర్గాలు మరింతగా భయాందోళనలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.