తెరాస అభ్యర్థిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళ

 

తెలంగాణలో ఎన్నికల నేపధ్యంలో తెరాస పార్టీ ప్రచారాల్లో ముందంజలో ఉంది.ఆ పార్టీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాల్లో నిమగ్నమయ్యారు.కానీ ప్రచారానికి వెళ్లిన అభ్యర్థులను మాకు ఏం చేసారని ఓట్లు అడగటానికి వస్తున్నారంటూ గ్రామస్తులు నిలదీయడంతో అనుకోని చేదు అనుభవాలు మిగులుతున్నాయి.ఇంకొందరు నాయకులైతే సహనం కోల్పోయి అడ్డుకున్నవారిపై దుర్భాషలాడుతున్నారు.తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.

తాజాగా మానకొండూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్‌ ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్‌లో తెరాస ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అయితే ఆ సమయంలో మహిళలు హామీలపై నిలదీయగా అసభ్య పదజాలంతో దూషించారని జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు మానకొండూర్‌ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్‌, కందికట్కూర్‌ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఫిర్యాదు చేశారు.మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటంతో పాటు కొందరి భుజాలపై చేయి వేసి చెప్పరాని విధంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన రసమయిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్‌లను జతపరిచినట్లు వారు తెలిపారు.