తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకంపై గవర్నర్ సమీక్ష

 

తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం ఎందరో విద్యార్థులకు శాపంగా మారింది. ఒకవైపు కార్పోరేట్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల పేరుతో పోటీ పడుతూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తుంటే.. మరోవైపు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏకంగా విద్యార్థుల జీవితాలతోనే ఆడుకుంటుంది. ఏపీలో ఇంటర్ ఫలితాలు వచ్చాయి., తెలంగాణలో ఫలితాలు ఎప్పుడని అడిగేసరికి తెలంగాణ ఇంటర్ బోర్డు కంగారు కంగారుగా నిర్లక్ష్యంగా ఫలితాలు విడుదల చేసింది. అయితే ఆ ఫలితాలు మార్కులు, ర్యాంకులతో కాదు.. లోపాలతో నిండిపోయాయి. 900 పైగా మార్కులొచ్చిన టాపర్లు ఒక సబ్జెక్టులో ఫెయిల్, ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్టులో 98 మార్కులు వచ్చిన వారికి సెకండ్ ఇయర్ లో సున్నా, కొందరి మార్కులకి బదులు ఏబీసీడీలతో వింత కోడ్ లు. ఇలా తెలంగాణ ఇంటర్ ఫలితాలు తప్పులతడిక. ఈ ఫలితాల పుణ్యమా అని ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. మొత్తానికి విద్యార్థుల ఆవేదన, తల్లిదండ్రుల ఆందోళనతో.. తెలంగాణ ఇంటర్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్ బోర్డు నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తడంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తప్పుల తడకల రిజ‌ల్ట్స్‌కు కారణమెవరో తెలుసుకునే పనిలో పడ్డారు. విద్యాశాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. సబ్జెక్టులవారీగా ఉత్తీర్ణులు కానివారి సంఖ్యపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

మరోవైపు వరుస విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో సమీక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు టీఎస్‌టీఎస్ ఎండీ వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో కమిటీ నియమించినట్లు ప్రకటించారు. కమిటీ సభ్యులుగా హైదరాబాద్ బిట్స్ ఫ్రొఫెసర్ వాసన్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిశాంత్‌ ఉన్నారు. కొంతమంది అధికారుల అంతర్గత విభేదాలతో ఫలితాలపై అపోహలు ఏర్పడ్డాయని జగదీష్ రెడ్డి చెప్పారు.