ఇదీ బాధ్యతంటే...... ఇదీ రక్షణంటే...!

ప్రభుత్వమంటే ఇలా ఉండాలి. ప్రజల్ని కన్న బిడ్డల్లా సాకే ప్రేమ ఉండాలి...ప్రజల రక్షణకు ఏమైనా చేయాలనే తపన ఉండాలి. ఈ లక్షణాలన్నీ థాయ్‌లాండ్ ప్రభుత్వానికి ఉన్నాయని ప్రపంచానికి తెలిసింది. పదిహేడు రోజులుగా థాయ్‌లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారి ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి కోచ్‌ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. చీకటి గుహలో చిక్కుకున్న ఆ పదిహేడు మందికి మంగళవారం నిజమైన వెలుగులు నింపిన రోజు. వారే కాదు ప్రపంచ దేశాల్లోని చిన్నారులందరికీ ఇది వెలుగులు నింపిన రోజు. ప్రజల రక్షణకు ప్రభుత్వాలు ఎంతటి విలువ ఇవ్వాలో థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం నేర్పిన పాఠం. గుహలో చిక్కుకున్న పిల్లల్లో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని బయటకు తీసుకు వచ్చిన డైవర్స్ మంగళవారంతో ఈ రక్షణ క్రతువును పూర్తి చేయాలని సంకల్పం చెప్పుకున్నారు. " ఈ ఫుట్‌బాల్ జట్టును ఈ రోజే కలుపుతాం" అని ప్రపంచానికి ప్రకటించారు. వారు చెప్పినట్లుగానే గుహాలో మిగిలిన ఐదుగురిని సుర‌క్షితంగా బయటకు తీసుకు వచ్చారు. 

ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రపంచ దేశాలన్ని థాయ్‌ల్యాండ్ ప్రభుత్వానికి బాసటగా నిలవడం మంచి పరిణామం. చిన్న దేశాల పట్ల కాసింత చులకనగా ఉండే ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ " ఈ ఆపరేషన్‌లో థా‍య్ ప్రభుత్వానికి సహకరిస్తాం" అని స్వయంగా ట్విట్ చేయడం చిన్నారుల పట్ల ఆయన వాత్సల్యానికి నిదర్శనం. ఈ ఆపరేషన్‌లో బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆమెరికా, చైనా, జపాన్‌, స్వీడన్, దేశాలకు చెందిన 90 మంది డైవర్లు పాల్గొనడం ఈ ఘటన పట్ల ఆయా దేశాలు చూపించిన చొరవగానే పరిగణించాలి. 17 రోజుల పాటు నిద్రాహారాలకు దూరమై ఆ చిన్నారులు మనుగడ సాగించారంటే వారి మనోనిబ్బరానికి ప్రపంచం యావత్తూ జేజేలు పలకాలి. వారిలో ఆత్మస్దైర్యాన్ని నింపిన వారి కోచ్ ఎక్కా పోల్ చాంతావాంగ్‌కే ఆ ఘనత దక్కుతుంది. ఈ కోచ్ కూడా ఏమంత వయస్కుడేం కాదు. నిండా పాతికేళ్ళు కూడా లేని కోచ్ ఎక్ లో ఇంత ధైర్యానికి కారణం అతను పడ్డ కష్టాలే. నా అన్నవారిని కోల్పోయి కష్టాల కొలిమి లోంచి వచ్చిన కోచ్ ఎక్ గుహలో చిన్నారులకు ఆత్మస్దైర్యాన్ని నింపడం నిజంగా అధ్బుతం. 

కోచింగ్‌ అంటే ఫుట్‌బాల్‌ను ఎలా తన్నాలో, ఎలా గో‌ల్ చేయాలో, ప్రత్యర్ది జట్టు గోల్ చేయకుండా ఎలా నిలువరించాలో చెప్పడమే కాదని, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పడమేనని కోచ్ ఎక్ నిరూపించారు. ఈ సంఘటన నుంచి ప్రపంచ దేశాలు... ముఖ్యంగా భారతదేశం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడడం అలవర్చుకోవాలి. ఒక ఘటన జరిగితే ఎంత వేగంగా స్పందించాలో నేర్చుకోవాలి. ఏలికలకు ప్రజలపై ప్రేమ, గౌరవం, వారికి రక్షణ కల్పించాలనే బాధ్యత ఉండాలి. ప్రజలంటే ఐదేళ్ళకొకసారి కనిపించే ఓటర్లుగా చూడకూడదు. కుటుంబంలో పిల్లల పట్ల తలిదండ్రులు ఎంత శ్రద్దగా, ప్రేమగా ఉంటారో పాలకులు కూడా ప్రజల పట్ల అంతే ప్రేమ, శ్రద్ద, బాధ్యతతో మెలగాలి.