వైఎస్ షర్మిల కూడా పులుసులో కరివేపాకేనా?

Publish Date:Nov 18, 2013

Advertisement

 

ఈరోజు హైదరాబాదులో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీలో ముఖ్యలయిన నాయకులందరూ పాల్గొన్నప్పటికీ వైవీ సుబ్బారెడ్డి, షర్మిల ఇద్దరు కూడా హాజరుకాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు నుండి, షర్మిల కడప నుండి లోక్ సభ టికెట్స్ ఆశించి భంగపడినందునే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని సమాచారం. అయితే ఇందులో నిజానిజాలెలా ఉన్నపటికీ, జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయిన నాటి నుండి షర్మిల పార్టీలోకి కానీ, ప్రజల మధ్యగానీ కనబడలేదనిధి వాస్తవం.

 

అతను జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి షర్మిల ఏకంగా 3000 కిమీ. పాదయాత్ర చేయడమే కాక, స్వయంగా తన రాజకీయ భవిష్యత్ నిర్మించుకోగల ఆ సదవకాశాన్ని కూడా కాదనుకొని, తాను తన సోదరుడు జగన్ తరపునే ప్రజల వద్దకు వచ్చానని చెప్పిన వ్యక్తి ఆమె. ఒకవేళ షర్మిల కనుక ఆనాడు పూనుకొనకపోయి ఉంటే, ఈరోజు వైకాపా ఉనికి కూడా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదెంత మాత్రం.

 

ఒకవేళ జగన్ జైలు నుండి విడుదల కాకపోయినట్లయితే, రానున్నఎన్నికలలో పార్టీకి ఆమె సారధ్యం వహించవచ్చని, అందువల్ల పాదయాత్ర అనంతరం ఆమెకు పార్టీలో కీలకమయిన పదవి కట్టబెడతారని ప్రజలు కూడా భావించారు. కానీ పార్టీలో ఇప్పుడు ఆమె ఉనికే లేకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం.

 

నిత్యం తన తండ్రి రాజశేకర్ రెడ్డి నామస్మరణ చేస్తూ, ప్రజలకు తన ఆ ‘ప్రత్యేక హోదా’ని గుర్తుచేసే జగన్మోహన్ రెడ్డి నోట పార్టీ కోసం, తన కోసం ఇంత కష్టపడిన తన సోదరి షర్మిల సేవలను ప్రశంసిస్తూ నేటివరకు ఒక్క ముక్క కూడా వినబడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత అంటూ నిత్యం సూక్తులు వల్లించే జగన్, తన సోదరికి కృతజ్ఞతలు తెల్పుకోవడం కాదు కదా, కనీసం ఆమె పేరు కూడా తలచుకోకపోవడం ఎటువంటి విలువలో అతనికే తెలియాలి. ఒకవేళ జగన్ తన స్వంత సోదరి షర్మిలనే పక్కనబెట్టగలిగినప్పుడు, మరిక ఇతరుల గురించి చెప్పేదేముంది? పార్టీ అవసరమయినప్పుడు మాత్రమే వాడుకొని తరువాత పక్కన బెట్టడం చూస్తే ఆమెను కూడా పులుసులో కరివేపాకు వలే ఉపయోగించుకొంటున్నట్లు అర్ధం అవుతోంది.

By
en-us Political News