భవ్యశ్రీ మిస్సింత్ కేసు.. శభాష్ పోలీసు...

 

తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఆమెను తన కుటుంబ సభ్యలకు అప్పగించారు. ఈ కేసు విషయంలో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించారని అభినందనలు అందుకుంటున్నారు. భవ్యశ్రీ మిస్సయినట్టు ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్‌ని ట్రాక్ చేసిన పోలీసులు ఆమె మొదట తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు తెలుసుకుని అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత భవ్యశ్రీ వైజాగ్‌ పరిసరాల్లో వున్నట్టు తెలుసుకుని అక్కడ అన్వేషణ జరిపారు. ఒక గెస్ట్ హౌస్‌లో వున్న భవ్యశ్రీ పోలీసులు రావడం గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద పోలీసులు భవ్యశ్రీని వైజాగ్‌లోనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌‌కి తీసుకొచ్చారు. ఆమెను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు. భవ్యశ్రీ ఇలా వెళ్ళిపోవడానికి కారణాలను పోలీసులు ఇంతవరకు వెల్లడించనప్పటికీ ఈ కేసు విషయంలో పోలీసులు చేసిన నిర్విరామ కృషిని అందరూ అభినందిస్తున్నారు.