'జనతా గ్యారేజ్' అంటూ కత్తి పట్టుకొని తిరుగుతున్న యువకుడు

 

సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేస్తారు.. డైలాగ్స్ చెప్తారు.. బయట చూడని, చేయలేని విన్యాశాలు కూడా చేస్తారు. ఇదంతా సినిమాల్లోనే. బయట హీరోలు అందరిలాగే నార్మల్ గా ఉంటారు. ఇది తెలియక కొందరు సినిమాల్లో హీరోలు చేసినట్టు చేస్తే మనం కూడా హీరోలు అవుతాం అన్నట్టుగా.. సినిమాల్లో హీరోలు చేసినట్టు చేస్తారు. లేని తలనొప్పులు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ‘జనతాగ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లూ చేయబడును’ అంటూ  ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. సామాన్యులకు ఏ సమస్యలు వచ్చినా ‘జనతాగ్యారేజ్’కు వెళ్లి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్నట్లు ఆ సినిమాలో చూపించారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో మొక్కలు నాటండి అని చెప్తే ఎంతమంది విన్నారో తెలీదు కానీ.. 'సమస్య ఉందనే తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతాం' అనే మాట ఒక యువకుడి బుర్రకి బాగా ఎక్కింది.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి.. ఎవరికైనా సమస్య ఉంటే జనతా గ్యారేజ్‌లో సెటిల్ చేస్తానని మెసేజ్‌లు పంపేవాడు. అలా పలువురి మీద దాడి కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉండవల్లి సెంటర్‌లో నడిరోడ్డుపై కత్తి పట్టుకొని ప్రదీప్‌ హల్‌చల్ చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రదీప్ పలుసార్లు అరాచకాలకు పాల్పడినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే మరింత రెచ్చిపోయి రోడ్డు మీదే కత్తితో తిరుగుతున్నాడని స్థానికులు అంటున్నారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ప్రదీప్ అరాచకాలకు పాల్పడడం ఆందోళన రేకెత్తిస్తోంది.