సైకిల్ - కమలం సర్దుబాటు ఓకే?

 

 

 

వచ్చే ఎన్నికల్లో బీజేపీ,టీపీడీ మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చలు మొదలయ్యాయి. రెండు రోజులుగా ఇక్కడే ఉన్న ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి,సీనియర్లు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. గతంలో పొత్తు ప్రాతిపదికలను వీరి నుంచి తెలుసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటరీలోని నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఫోన్‌లో సంప్రదించినట్టు తెలిసింది. ఈ వివరాలను కిషన్‌రెడ్డికి చెప్పగా... పొత్తును కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. జవదేకర్ అసహనం వ్యక్తంచేస్తూ... ముగిసిన వ్యవహారాన్ని మళ్లీ తిరగదోడవద్దని సలహా ఇచ్చినట్టు సమాచారం. దీంతో తెలంగాణలో మెజారిటీ సీట్లన్నా దక్కేటట్లు చూడమని కోరడంతో జవదేకర్ మరోసారి సీఎం రమేష్‌ను సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణలో బీజేపీ చెప్పినట్టు టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ చెప్పినట్టు బీజేపీ వినాలన్న సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు బీజేపీ తెలంగాణలో 64 అసెంబ్లీ, 9 లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్‌లో 6 లోక్‌సభ, 25ఎమ్మెల్యేల సీట్లు కోరుతున్నట్టు తెలిసింది. కాగా, తెలంగాణ శాఖ సమ్మతించినా లేకున్నా తాము పొత్తుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ నేతలు జవదేకర్‌కు స్పష్టం చేశారు.