Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 1


                         ఋగ్వేద సంహిత

                                  రెండవ భాగం

                                                దాశరథి రంగాచార్య

   
        శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
        ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||

                                        నాలుగవ అష్టకము

                   మొదటి అధ్యాయము             ఐదవ మండలము
                   మొదటి అనువాకము             తొమ్మిదవ సూక్తము

 ఋషి - ఆత్రేయ గయుడు, దేవత - అగ్ని ఛందస్సు 5-7 పంక్తి, మిగిలినవి అనుష్టుప్

    1. అగ్నీ ! నీవు దీప్యమానుడవు. హోమసాధక ద్రవ్యయుక్తులయ. మర్త్యులు నిన్ను స్తుతింతురు. నీవు చరాచర భూతగణములను ఎరుగుదువు. మేము నిన్ను స్తుతించుచున్నాము. నీ హవన సాధన హవ్యమును నిరంతరము వహింతువు.

    2. సకల యజ్ఞములు అగ్నితోడనే సాగును. యజమానికి కీర్తి సంపాదక హవ్యము అగ్నివలననే ప్రాప్తించును. యజమాని కుశచ్చేదకుడు హవ్యదాత అగును. అగ్ని అతని యజ్ఞమునకు దేవతలను ఆహ్వానించును.

    3. అగ్ని ఆహారాది పాకములద్వారా మానవులకు పోషకుడు అగుచున్నాడు. యజ్ఞములకు శోభనకర్త అగుచున్నాడు. అట్టి అగ్నిని అరణి ద్వయము శిశువునువలె కనుచున్నది.

    4. అగ్నీ! కుటిలగతి సర్పము లేక వక్రగతి అశ్వ శిశువువలె నన్ను ధరించుట కష్టతరమగును. గడ్డి మధ్యన వదిలిన జంతువు గడ్డి మేసినట్లు నీవు అడవులనన్నింటిని దహింతువు.

    5. ధూమవంతములగు అగ్ని శిలలు శోభాయమానములయి సర్వత్ర వ్యాపించును. కమ్మరి తిత్తి ద్వారా అగ్నిని ప్రజ్వరిల్ల చేసినట్లు మూడు స్థానములందు వ్యాపించిన అగ్ని స్వయముగా అంతరిక్ష దిశగా ప్రజ్వరిల్లును. తిత్తి ద్వారా కమ్మరి అగ్నిని తీక్ష్ణము చేసినట్లు అగ్ని హనాను తాను తీక్ష్ణతమము చేసికొనును.

    అగ్నీ ! నీవు అందరి మిత్రుడవు. నీ రక్షణవలనను నిన్ను స్తుతించుట వలనను మానవులమగు మేము శత్రుభూతములగు పాపసాధక కర్మలనుండి ఉత్తీర్ణులము కావలెను.

    అగ్నీ! నీవు బలమానుడవు. హవ్యవాహనుడవు. నీవు మా వద్దకు ప్రసిద్ధ ధనమునుకొని తెమ్ము. మా శత్రువులను పరాభూతులను చేయుము. మమ్ము పోషింపుము. మాకు అన్నము ప్రసాదించుము. యుద్ధమున మాకు సమృద్ధి కలుగు విధానము చూపుము.

                                        పదవ సూక్తము

ఋషి - ఆత్రేయగయుడు, దేవత-అగ్ని ఛందస్సు - 4, 7 పంక్తి, మిగిలినవి అనుష్టుప్.

    1. అగ్నీ ! నీవు మా కొఱకు అతి ఉత్కృష్ట ధనమును సముపార్జించుము. నీ గతి అప్రతిహతము కావలెను. నీవు మాకు సర్వత్ర వ్యాపించిన ధనము ప్రసాదించుము. అన్న లాభమునకుగాను పథమును ఆవిష్కరించుము.

    2. అగ్నీ ! నీవు అందరిని మించిన ఆశ్చర్యభూతుడవగుము. మేము చేయు యజ్ఞాది కార్యములకు ప్రసన్నుడవగుము. మాకు బలమునుగాని ధనమునుగాని ప్రసాదించుము. నీ బలము అసురులను నష్టపరచునట్టిదగును. నీవు సూర్యునివలె యజ్ఞకార్యమును నిర్వహింపుము.

    3. అగ్నీ! ప్రసిద్ధ స్తవకారులగు మానవులు నిన్ను స్తుతించి గోధనాది లాభము పొందుదురు. మేము నిన్ను స్తుతించుచున్నాము. మా ధనమును, పుష్టిని వర్థిల్లజేయుము.

    4. ఆనందదాయకుడవగు అగ్నీ! సుందర స్తుతుల ద్వారా నిన్ను స్తుతించు వారు అశ్వ ధనమును పొందుదురు. తమ బలమున శత్రువులను ఓడింతురు. స్వర్గమును మించిన కీర్తిని ఆర్జింతురు.

    అగ్నీ ! గయ ఋషి స్వయముగా నిన్ను జాగృతము చేయుచున్నాడు.

    5. అగ్నీ! నీ కిరణములు అత్యంత ప్రగల్భములు. దీప్తివంతములు. అవిసర్వత్ర వ్యాప్త విద్యుత్తువలె శబ్దాయమాన రథమువలె అన్నార్థులవలె సర్వత్ర సంచరించును.

    6. అగ్నీ ! నీవు త్వరగా మమ్ము రక్షింపుము. ధనము దానము చేయుము. దారిద్ర్యము తొలగింపుము. మా పుత్రులు, మిత్రులు నిన్ను స్తుతించి పరిపూర్ణ మనోరథులు కావలెను.

    7. అంగిరా! పురాతన ఋషులు నిన్ను స్తుతించినారు. ఇప్పటి ఋషులును నిన్ను స్తుతించినారు. ఇప్పటి ఋషులును నిన్ను స్తుతించుచున్నారు. ధనము మహా వ్యక్తులను సహితము లొంగదీయును. అట్టి ధనమును మా కొఱకు తెమ్ము.

    8. దేవతల ఆహ్వానకారి అగ్నీ ! మేము నిన్ను స్తుతించుము. మాకు స్తుతి సామర్థ్యము ప్రసాదించుము. యుద్ధమున మాకు సమృద్ధికలుగు విధానము ఏర్పరచుము.

                                    పదకొండవ సూక్తము

       ఋషి ఆత్రేయసుతుడు భరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-జగతి.

    1. అగ్ని లోక రక్షకుడు. సదా ప్రవృద్ధుడు. అందరి ద్వారా శ్లాఘనీయుడు. బలశాలి. అతడు జనులకు నవశుభములు కలిగించుటకు ఆవిర్భవించినాడు. అగ్ని ఘృతము ద్వారా ప్రజ్వలితుడగును. తేజోయుక్తుడగును. పరిశుద్ధుడు అగును. ఋత్విక్కులకొఱకు ద్యుతిమంతుడగును. ప్రకాశవంతుడగును.

    2. అగ్ని యజ్ఞమునకు కేతన స్వరూపుడు. ప్రజ్ఞాపకుడు. అగ్ని యజమానిచే సన్మానితుడగును. పురోభాగమున స్థాపించబడును. అగ్ని ఇంద్రాది దేవతల దర్శకుడు. ఋత్విక్కులు మూడు స్థానములందు అగ్నిని సమిద్ధము చేసినారు. శోభనకర్ముడు, దేవతల ఆహ్వానకారి అగ్ని కుశయుక్త స్థానమున యజ్ఞము కొఱకు ప్రతిష్ఠించబడినాడు.

    3. అగ్నీ ! మాతృ స్వరూప అరణిద్వయము నుండి నీవు నిర్విఘ్నముగా ఆవిర్భవించినావు. నీవు పవిత్రుడవు. కవివి. మేధావివి. యజమానులద్వారా అవతరింతువు. పూర్వ మహర్షులు ఘృతము ద్వారా నిన్ను వర్థిల్ల చేసినారు.

    హవ్యవాహకా ! నీ అంతరిక్ష వ్యాపి ధూమము కేతన స్వరూపమగును. ప్రజ్ఞాపకమగును. అనుమాపకమగును.

    5. అగ్నీ ! నిన్ను గూర్చిన స్తుతులు సుమధుర వాక్యప్రయుక్తములు. స్తుతులు నీ మనసునకు సుఖము కలిగించవలెను. మహానదులు సముద్రమును పూరించును. బలయుక్తములను చేయును. అట్లే స్తుతులు నిన్ను పూర్ణుని, బలశాలిని చేయును.

    6. అగ్నీ! నీవు గుహామధ్యమున దాగినవాడవు. వనములను ఆశ్రయించి నిలిచినవాడవు. అంగిరులు నిన్ను ఆవిష్కరింప చేసినారు. నీవు విశేషబలమున మధించినపుడు పుట్టెదవు. అందుకే అందరు నిన్ను బలపుత్రుడందురు. "త్వమాహుఃసహస పుత్రమంగిరః"

                                         పన్నెండవ సూక్తము

       ఋషి-ఆత్రేయ పుత్రుడు భరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్ని సామర్థ్యాతిశయమున మహానుడు. యాగ యోగ్యుడు. జలవర్షకారి. బలశాలి. అభీష్టవర్షి. యజ్ఞమున అగ్నిముఖమున హుతమయిన పరమ పవిత్ర ఘృతమువలె స్తుతులు అగ్నికి ప్రీతికరములు కావలెను.

    2. అగ్నీ ! మేము నిన్ను స్తుతించుచున్నాము. నీవు మా స్తుతులను అర్థము చేసికొనుము. ఆమోదింపుము. విశేష జలవర్షమునకు సమాయత్తమగుము. మేము యజ్ఞమున బలప్రయోగముచేసి విఘ్నములు కలిగించము. విధ్యుక్తముకాని వైదిక కార్యములందు ప్రవర్తించము. నీవు దీప్తిమంతుడవు. కోరికలు తీర్చువాడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము.    

    3. అగ్నీ ! నీవు ఉదక వర్షకారకుడవు. స్తుతి యోగ్యుడవు. మేము చేయునట్టి ఎటువంటి సత్యకార్యము వలన నీవు మా స్తుతులను ఎరుగగలవు?

    అగ్ని ఋతువుల రక్షకుడు. దీప్తిమంతుడు. అతడు మమ్ము తెలియవలెను. మేము అగ్ని భక్తులము. మా పశువులు మున్నగు ధనముల స్వామి అగ్నిని తెలియకున్నాము.

    4. అగ్నీ ! ఎవడు శత్రువుల బంధనకారి? ఎవడు లోకరక్షకుడు?

    అసత్యవాదుల ఆశ్రయదాత ఎవడు? దుష్టవచనుల ఉత్సాహకర్త ఎవరు?

    (అగ్నిని ఆరాధించువారు అట్టివారు కారని అర్థము)

    5. అగ్నీ! నీ బంధుగణము సర్వత్ర వ్యాపించి ఉన్నారు. వారు పూర్వము నీ ఉపాసనను త్యజించి కష్టముల పాలయినారు. తదుపరి మరల నిన్ను ఆరాధించి సౌభాగ్యవంతులయినారు. మేము సరళ భావమును ఆచరించువారము అయినను అసాధు భావమున మమ్ము కుటిలాచారుడు అన్నవాడు మాకు శత్రువయి తన అరిష్టమును తానేకొని తెచ్చుకొనును.

    6. అగ్నీ! నీవు దీప్తిమంతుడవు. అభీష్టప్రదుడవు. నిన్ను హృదయ పూర్వకముగ స్తుతించువాడును. నీ కొఱకు యజ్ఞమును రక్షించువాడును విశాలగృహవంతుడగును. నీకు చక్కగా పరిచర్య చేయువానికి కోరికలు తీర్చగల పుత్రుడు కలుగును.

                                        పదమూడవ సూక్తము

        ఋషి - ఆత్రేయ భరుడు - దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి

    1. అగ్నీ! మేము నిన్ను పూజింతుము. ఆహ్వానింతుము. స్తుతింతుము. మా రక్షణకుగాను నిన్ను ప్రజ్వలితుని చేయుదుము.

    2. అగ్ని దీప్తిమంతుడు. ఆకాశస్పర్శి. మేము ధనార్థులము. అగ్నిని గూర్చి పురుషార్ధ సాధక స్తుతిని పఠింతుము.

    3. అగ్ని మానవుల మధ్య నిలుచును. సాగును. దేవతలను ఆహ్వానించును. అట్టి అగ్ని మా స్తుతులను గ్రహించవలెను. యజ్జీయ ద్రవ్యజాతమును దేవతల సమక్షమునకు చేర్చవలెను.

    4. అగ్నీ ! నీవు సర్వదా సంతోషివి. నీవు హోతవయి జనులకు వరణీయుడవయి బలవంతుడవగుదువు. నీ వలన యజమానులు యజ్ఞ సముపార్జకులగుదురు.

    5. అగ్నీ ! నీవు అన్నదాతవు. స్తుతియోగ్యుడవు. మేధావులగు స్తోతలు విశిష్ట స్తుతుల ద్వారా నిన్ను వర్థిల్ల చేయుదురు. నీవు మాకు ఉత్కృష్ట బలమును ప్రసాదించుము.

    6. అగ్నీ ! ఇరుసు చక్రమునందలి ఫలకములను త్రిప్పినట్లు నీవు దేవతలను వ్యాపింప చేసెదవు. నీవు మాకు నానా విధ ధనమును ప్రదానము చేయుము.

                                         పదునాలుగవ సూక్తము

        ఋషి-ఆత్రేయసుతుడు భరుడు, దేవత-అగ్ని, ఛందస్సు-గాయత్రి.

    1. యజమానీ ! నీవు అమరుడగు అగ్నిని స్తుతులద్వారా ప్రభోదితుని చేయుము. అగ్ని ప్రదీప్తుడయినపుడు అతడు దేవతలవద్దకు మన హవ్యమును చేర్చును.

    2. అగ్ని దీప్తమానుడు. అమరుడు. మానవులకు పరమారాధ్యుడు. నరులు అగ్నిని యజ్ఞస్థలమున స్తుతింతురు.

    3. యజ్ఞస్థలమున అనేకులు స్తోతలు ఘృతసిక్త స్రుక్ సహితులయి దేవతలవద్దకు హవ్యము చేర్చుమని అగ్నిని స్తుతించెదరు.

    4. అగ్ని అరణి మధ్యమున ఆవిర్భవించినాడు. అతడు తన తేజః ప్రభావమున అంధకారము యజ్ఞవిఘాతక వస్తువులను నష్టపరచి ప్రజ్వరిల్లును. గోవులు, అగ్ని సూర్యుడు అగ్ని నుండియే పుట్టినారు.

    5. అగ్ని జ్ఞాని. ఆరాధ్యుడు. ఊర్ధ్వభాగమున ఘృతాహుతి ద్వారా ప్రదీప్తుడగువాడు. నరులారా! అట్టి అగ్నిని పూజించుడు. అగ్ని మా ఆహ్వానమును ఆలకించవలెను తెలియవలెను.

    6. ఋత్విక్కులు ఘృతము, స్తోమము ద్వారా స్తుత్యభిలాషులు, ద్యానగమ్యులగు దేవతల సహితముగా సర్వదర్శి అగ్నిని, సంవర్థితుని చేయుదురు.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత నాలుగవ అష్టకము, ఐదవ మండలమున మొదటి అధ్యాయమున మొదటి అనువాకము సమాప్తము)

   
             రెండవ అనువాకము             పదిహేనవ సూక్తము

         ఋషి - అంగీరస ధరణుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్ని బలశాలి. సుఖస్వరూపుడు. ధనాధిపతి. హవ్యవాహకుడు. గృహదాత. విధాత. క్రాంతదర్శి. స్తుతియోగ్యుడు. యశస్వి. శ్రేష్ఠుడు. హవిస్వరూప ఘృతమున అగ్ని ప్రసన్నుడగును. అట్టి అగ్నిని మేము స్తుతింతుము. ప్రణమిల్లుదుము.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS