Next Page 
శ్రీ సీతారామ కథ సుందరకాండము  పేజి 1


                                             శ్రీ సీతారామాంజనేయాయనమః 

                                       శ్రీ సీతారామకధ

                            సుందరకాండము

                                             (శ్రీ వాల్మీకి రామాయణము మూలము)
 


                                                     రచన:

 

                               సుందరదాసు  

                             ఎమ్మెస్. రామారావు
                                       అభిప్రాయములు   

    శ్రీ ఎమ్మెస్. రామారావుగారు శ్రావణమాసము శుక్లపక్షము రోజూ రాత్రి ప్రధమయామమున వెన్నెల్లో దీక్షగా ఏడు రోజులు తమ సుందరకాండ యావద్రచనా వినుపించారు.
    నాకు రామారావుగారు వినుపిస్తున్నట్లుగా లేదు. "వాల్మీకి తెలుగులో వ్రాసిన రామాయణాన్ని లవకుశులు వినిపిస్తున్నారు" ఇది నాకు కలిగిన అనుభూతి.
    సహృదయాః  ప్రమాణం!
    రాజమహేంద్రవరం
    17-11-1975
                                                                                                        ఇట్లు                                     

                                                                                                మల్లంపల్లి శరభేశ్వర శర్మ 
                          *      *    *
    శ్రీ ఎమ్మెస్. రామారావు గేయ రూపమున తెలుగులో రచించిన సుందరకాండములోని కొన్ని భాగములను పాడగా వింటిని. చేను విన్న చోట్ల రచన రమణీయంగా నున్నది. వారు మధురమైన కంఠము గలవారు. ఎనుబది తొంబది ఏండ్ల వరకు జీవించి శ్రీరామ సేవ, శ్రీ ఆంజనేయ సేవ మరియును చేయుచు చేయుచు, వారి ఇరువురి కృపను సంపూర్ణంగా పొందవలసిందిగా వారిని నేను ఆశీర్వదించుచున్నాను.
   
    మారుతీనగర్                                                                                                       ఇట్లు   
    విజయవాడ                                                                                           కళాప్రపూర్ణ, కవి సామ్రాట్  
    23-12-1975                                                                                          విశ్వనాధ సత్యనారాయణ
   
                                             కృతజ్ఞత

    రాజమహేంద్రవరం నవభారతి గురుకులంలో నేనుండగా, 1972,73,74, సం.లలో శ్రీ తులసీదాస్ హనుమాన్ చాలీసాను, శ్రీ వాల్మీకి రామాయణంలోని సుందరకాండమును, గేయరూపములో తేట తెలుగున అనువదించితిని. అట్టి ప్రశాంత వాతావరణంలో నాకు ఆశ్రయ మెసగిన గురుకుల వ్యవస్థాపకులు శ్రీ తన్నీరు బుల్లెయ్యగారికి నేనెంతో కృతజ్ఞుడను.
    సుందరకాండమును నేను పాడి వినుపించగా, శ్రద్ధగా పూర్తిగా విని, వారి అభిప్రాయమును ఇందు ముద్రించుటకు వ్రాసి ఇచ్చిన శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మగారికి నేనెంతో కృతజ్ఞుడను.
    సంపూర్తిగా వినుటకు సమయము లేక, అక్కడక్కడ కొన్ని భాగములను మాత్రమే విని, వారి అభిప్రాయములను ఇందు ముద్రించుటకు వ్రాసి ఇచ్చిన కళాప్రపూర్ణ. కవిసామ్రాట్, కీర్తిశేషులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి నేనెంతో కృతజ్ఞుడను. రచన సాగుచుండిన కాలములో, గురుకులములో ఉంటూ తరచు వినుచు నన్ను ప్రోత్సహించిన శ్రీ మల్లవరపు విశ్వేశ్వరరావుగారికి కృతజ్ఞుడను.
    సుందరకాండ గానమును ఆబాల గోపాలము వినుచు ఆనందించుచు నన్నానందింప చేయుచుండిన తెలుగు వారందరికి నేనెంతో కృతజ్ఞుడను.
                                                                                                                       ఇట్లు       

                                                                                                                   సుందరదాసు
                                                                                                             ఎమ్మెస్. రామారావు

                                                       "సుందరదాసు"

                             శ్రీ ఎమ్మెస్ రామారావు గారి జీవిత చరిత్ర

    మా తండ్రి గారైన "సుందరదాసు" శ్రీ ఎమ్మెస్ రామారావుగారు, వారు రచించిన భక్తి గేయాలతోను, తెలుగు హనుమాను చాలీసా, సుందరకాండము, బాలకాండము, అయోధ్య కాండముల గానముతో భారతదేశముననే గాక పాశ్చాత్య దేశములనందలి తెలుగువారి నందరినీ ఉర్రూతలూగించిన మహానుభావులు.
    1921 జులై మూడో తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలుకా మోపర్రు గ్రామంలో మోపర్తి రంగయ్య, శ్రీమతి మంగమ్మలకు వారు జన్మించారు. ఆయన చిన్నతనము నుండి పాటలు పాడటము పట్ల ఆసక్తి కనపరచేవారు. 1941వ సంవత్సరములో వారు గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరము చదువుతున్న రోజుల్లో అంతర కళాశాలల లలిత సంగీత పోటీ జరిగినది. అందులో మొదటి బహుమతి వారికి లభించింది. ఆ పోటీ న్యాయ నిర్ణేతలలో ఒకరయిన శ్రీ అడవి బాపిరాజు గారు వారిని చలన చిత్రరంగములో ప్రవేశించమని ప్రోత్సహించారు.
    తెలుగు చలనచిత్రరంగములో ప్లేబాక్ గాయకులలో వారు మొదటివారు. 1944వ సంవత్సరము నుండి 1964వ సంవత్సరము వరకు ఇరవై సంవత్సరముల పాటు మద్రాసు నగరములో సినీ నేపధ్య గాయకులుగా వారు గడిపారు. ఆ కాలములో వారు కొన్ని పాటలు సుబ్బారావుగారు రచించిన ఎంకిపాట "ఈరేయి నన్నోల్ల నేరవా రాజా!" వారు పాడిన మొట్టమొదటి సినిమా పాట. ఈ పాటలను ఆయనే పడవ వాని వేషములో పాడారు. సినీ దర్శకులు శ్రీ వై.వి.రావు, శ్రీ కె.ఎస్. ప్రకాశరావు, నటులు శ్రీ నాగయ్య, శ్రీ ఎన్.టి.ఆర్. ప్రభృతుల ప్రోత్సాహంతో వారు అప్పుడు వచ్చిన చాలా సినిమాలలో పాటలు పాడారు.
    "దీక్ష, ద్రోహి, మొదటిరాత్రి, పాండురంగ మహాత్యము, నాయిల్లు, సీతారామకళ్యాణము, శ్రీ రామాంజనేయ యుద్ధము" మొదలైన చిత్రములలో వారు పాటలు పాడారు. "పల్లె పడుచు" చిత్రానికి వారు సంగీత దర్శకత్వము కూడా వహించారు.
    "దీక్ష" చిత్రంలో "పోరా! బాబు పో!" అనే పాటను, తమిళ సినిమాకు కూడా తమిళములో పాడి గాయకుడిగా వారు తమిళంలోనూ పేరు తెచ్చుకున్నారు.
    కన్నడ సినిమా అయిన "నాగార్జున" చిత్రమునకు రాజన్-నాగేంద్ర సంగీత దర్శకత్వములో "శాంతి సమాధాన" అనే పాటను కూడా వారు పాడారు.
    శ్రీ ఆంజనేయస్వామి కృప చేత, వారు 1970వ సంవత్సరములో తులసీదాసు రచించిన "శ్రీ హనుమాను చాలీసా" ను తెలుగులో అనువాదము చేశారు. ఆ తర్వాత - శ్రీ వాల్మీకి రామాయణములోని సుందరకాండము, బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండములను గేయ రూపమున రచన చేసారు. ఆకాశవాణిలోను, దూరదర్శన్ లో వారు "సుందరకాండము" ను గానము చేశారు. బాలకాండము, సుందరకాండములను గ్రామఫోను రికార్డుగా కూడా ఇచ్చారు. "అయోధ్య కాండము"ను కాసెట్లకుగాను పాడారు.
    1991 సంవత్సరము నుండి "యుద్ధకాండము" ను గేయరూపమున కొంతభాగము రచన చేశారు. రామాయణమును పూర్తిగా గేయ రూపమున భక్తులకు అందించాలని వారి చిరకాల కోరిక, అయితే - వారు గుండెపోటుతో ఏప్రిల్ 20, 1992వ సంవత్సరమున పరమ పదించిరి.
    వారు మా మధ్య లేకున్నను, వారి సంకల్పమయిన శ్రీ వాల్మీకి రామాయణమును పూర్తిగా గేయ రూపమున భక్తులకు అందజేయుటకై, మిగిలిన "శ్రీ రామకధ" యుద్ధకాండమును నేను పూర్తి చేయుట జరిగినది. వారు రచించి, గానము చేసిన భక్తి గేయములు, లలితగేయములు, కూడా పుస్తక రూపమున వారి అభిమానులకు అందజేయగలమని నా మనవి.
    "శ్రీరామకధ" సుందరకాండమును పారాయణము చేసిన వారికి, కష్టనష్టములు తొలగి, సర్వ సౌఖ్యములు కలుగునని పెద్దలందురు. కనుక, ఈ గ్రంధమును పారాయణము చేసి, భక్తులందరు తరించగలరని నా విన్నపము.
    ఈ గ్రంధమును ఎంతో శ్రద్ధతో ముద్రించిన విప్ల కంప్యూటర్ సర్వీసెస్ సిబ్బంది వారికి, ముఖ్యముగా శ్రీ విజయసేనారేడ్డి గారికి, మరియు శ్రీ మారుతిగారికి నా కృతజ్ఞతలు.
                                                                                                    ఇట్లు             

                                                                                            ఎం.  నాగేశ్వరరావు
                                                                      ("సుందరదాసు " ఎమ్మెస్ రామారావుగారి కుమారుడు)

   
                                                               సమర్పణ   

                       శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీ హనుమాను గురుదేవుల పాదపద్మములకు 
           "శ్రీరామరక్ష - సర్వజగద్రక్ష"

    శ్లో.  ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
         లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో సమామ్యహం II          
             
                                            శ్రీ హనుమంతుని ద్వాదశ నామములు           

       హనుమా నంజనానూనుః వాయుపుత్రో మహాబలః
       రామేష్టః ఫల్గుణ సఖః పింగక్షో అమితవిక్రమః I
       ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః   
       లక్ష్మణ ప్రాణదాతాచ దశ గ్రీవన్య దర్పహా   
       ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః   
       స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః   
       తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ II
    హనుమంతుని ఈ పండ్రెండు నామములు పరుండబోవు నపుడు, ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయముండదు. సర్వత్ర విజయము కలుగును.
    హరేరామ హరేరామ రామరామ హరేహరే       
    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే

                         -: గురు ప్రార్ధన :-
   
    శ్రీ హనుమాను గురుదేవులు నాయెద
    పలికిన సీతారామ కధా - నే
    పలికెద సీతారామ కధ ... ... ...       IIశ్రీII
   

                                                                                 సుందరదాసు
                                                                           ఎమ్మెస్ రామారావు 


Next Page 

WRITERS
PUBLICATIONS