వజ్రాల పంజరం

 
    అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్న విజూషని గదిలోంచి బయటకు పంపాలంటే ఒకటే మార్గం.


 
    మంచి జోక్ చెప్పాలి.

 

    మూడ్ మార్చాలి.

 

    అలవాటుగా మొదలుపెట్టాడాయన.

 

    "చూడమ్మా .. నాలాంటి ఓ మనిషి అంటే  ముసలికాలంలోనూ ఇలాంటి యావచావనివాడు చచ్చి పై లోకానికి వెళ్లాడట."

 

    తాతయ్య చెప్పే జోక్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా వుండేదీ తెలిసిన విజూష  ఆసక్తిగా ముందుకు ఒరిగింది.

 

    "అలా పైలోకానికి వెళ్లాక యముడెదురొచ్చి "నువ్వు కొన్ని తప్పులు చేశావ్ కాబట్టి ముందు శిక్ష డిసైడ్ కావాలి.

 

    ఆ శిక్ష అనుభవించాక నువ్వు స్వర్గానికి వెళ్లాలా నరకానికి వెళ్లాలా అన్నది నిర్ణయిస్తాను అన్నాడట"

 

    "అయితే"

 

    "ఓ క్రమంలో శిక్షలనుభవిస్తున్న మగాళ్లని చూపించుకుంటూ పోయాడు యముడు.

 

    ఓ ముసలివాడు గొడ్డలితో చెట్టు మొదలు నరుకుతుంటే ఇది వద్దు అన్నాడట యముడిలా వున్నవ్యక్తి.

 

    ఇంకోచోట ఓ రాజకీయ నాయకుడు పప్పు రుబ్బుతుంటే ఈ శిక్ష వద్దన్నాడు.

 

    ఆ తర్వాత అలా నడుచుకుంటూ వెళుతున్న ఆ వ్యక్తి ఓ చోట ఠక్కున ఆగిపోయాడట.

 

    "ఎందుకు?" ఉత్కంఠగా అడిగింది విజూష.

 

    "ఓ ముసలాడి ఒడిలో దివ్యభారతి కనిపించింది."

 

    "అయితే"

 

    "ఆ ముసలాడికి విధించిన శిక్ష నాకూ విధించండి" అంటూ యముడ్ని తొందరపెట్టాడు ఆ వ్యక్తి. దానికి ఆ యముడేమన్నాడో తెలుసా?"

 

    క్షణం ఆగి చెప్పాడు

 

    "ముసలాడికి కాదు, మేం దివ్యభారతికి విధించిన శిక్షది" అన్నాడట యముడు."

 

    ఫకాల్న నవ్వింది విజూష.

 

    పడీపడీ నవ్వింది.

 

    ఇలా తనమీద తాను జోక్స్ వేసుకునే  తాతయ్యంటే ఆమెకి చాలా యిష్టం.

 

    "ఇక మనం డిన్నర్ కి వెళదామా?" అంటూ నవ్వుతూన్న విజూషని పసిపిల్లలా  పొదవి పట్టుకుని బయటకి నడిపించిన గౌరీనాధంగారు మెట్లుదిగి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లబోతూ ఆగిపోయాడు.

 

    విజూష తండ్రి ఇంటికి ఎప్పుడు వచ్చాడో ఏమో ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో.

 

    "నాకీ ప్రపంచంలో వారసురాలిగా వున్నది ఒక్కగానొక్క కూతురు.

 

    అందుకే దానికోసం ఏమన్నా చేస్తాను.

 

    దాని ఆనందం కోసం ఎన్ని లక్షల కోట్లయినా ఖర్చుచేస్తాను ఒక్క విషయంలో తప్ప."

 

    ఇంతకాలం తర్వాత తండ్రి నుంచి ఏదో కొత్త విషయం తెలుసుకోబోతున్నట్టు చెవులు రిక్కించింది విజూష.

 

    "అదేరా" విజూష తండ్రి ప్రసాదభూపతి సగర్వంగా అన్నాడు "విజూష పెళ్లి."


 
    క్షణం ఆగాడు.

 

    "అవును... .విజూష ఎవర్ని కట్టుకోవాలో అన్న ఒక్క విషయంలో మాత్రం నిర్ణయం నాది.

 

    బస్.....

 

    దేవుడు అడ్డుపడినా నా అభిప్రాయం మారదని నీకు తెలుసుగా?"

 

    విజూష స్థాణువైపోయింది.

 

    ఇలాంటి వాక్యాలు తండ్రి నోటినుండి ఇంతకుపూర్వం విందేమో ఆమెకు గుర్తులేదుకానీ ఈ రోజు వినగానే అదోలాంటి అసహనానికి గురి అయింది.

 

    ఇన్నేళ్ల తర్వాత తనను సమ్ముగ్దని చేసిన కాలం ఇంకా ఆలోచనల తడి అవకముందే దగ్దం గురించి నిర్ణయిస్తుంటే...

 

    తండ్రి మాటల్ని ఇంకోసారి మననం చేసుకుంది.
 


    తనకోసం కోట్సు ఖర్చుచేయగల డాడీ ఒక్క పెళ్లి విషయంలో మాత్రం తనకు స్వేచ్చనివ్వడా....

 

    మరి రుత్వి గురించి తను వేసిన పందెం ఏం కావాలి?

 

    "ఏం చేస్తానో నాకే తెలియదు."

 

    బంజారాహిల్స్ లోని ఓ ఖరీదయిన భవంతిలో ఏ ఎస్టేట్ మేనేజర్ మార్గరెట్ కి ఫోన్ లో ఆదేశిస్తుంది సశ్య తల్లి అవతలి వైపునుండి.

 

    "ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నాకున్న ఒక్కగానొక్క కూతురు సశ్య సశ్య పెళ్లి ఫోస్ట్ పోన్ మెంట్ కి తట్టుకోలేని సశ్య తల్లి అలా రోషాన్ని ప్రకటించడానికి  కారణం ఒక్కటే.....

 

    సశ్య తల్లి రూపాదేవి 'ఓడిపోతే నిన్ను పెళ్లి  చేసుకుని ఫారెన్ వస్తాను' అన్న రుత్విని ఓడించడానికి బలంగా పథకం వేసింది రెండు రోజుల క్రితమే.

 

    రుత్వి ఓటమి కోసం క్విజ్ మాస్టర్ సుందరంగారికి ఓ మద్యవర్తి ద్వారా అయిదు లక్షల ఆఫర్ యిచ్చింది.

 

    ఓడించాననుకున్నాడు సుందరం.

 

    కాని...

 

    విచిత్రంగా అతన్ని ఓటమిలాంటి సందిగ్ద స్థితికి నెట్టాడు రుత్వి.

 

    ముప్పయ్యేళ్ల మార్గరెట్ టెలిఫోన్ రిసీవర్ క్రెడిల్ చేసి దూరంగా గదిలో కూర్చునివున్న సశ్యని చూసింది ఏకాగ్రతగా.

 

    అలాంటి తల్లి వుండటమే సశ్ చేసుకున్న అదృష్టం.

 

    అదికాదు...

 

    సశ్య ఎప్పుడో స్టేట్స్ కి వెళ్లిపోవాల్సిన ఎన్. ఆరై. ఆగింది రుత్వి కోసమే.

 

    సశ్య తల్లి రూప ఇప్పుడు ఫోన్ చేసింది ఎక్కడనుంచో కాదు.

 

    యు. ఎస్. ఎ. కాలిఫోర్నియా స్టేట్ లోని సాన్ జోస్ నుంచి.

 

    రూపాదేవి ఒక పెద్ద సాప్ట్ వేరక్ కంపెనీ యజమానురాలిగా సెటిలయింది అక్కడే.

 

    "గ్రాండ్ పా" అర్దరాత్రి దాటేక తాతయ్య బెడ్ రూం లో అడుగుపెట్టింది విజూష.

 

    నిద్రరాక బెడ్ మీద అటు ఇటు దొర్లుతున్న గౌరీనాధంగారు పైకి లేచారు అలవాటుగా అల్లరి పెట్టటానికి వచ్చిందేమోనని.