నానీ


    "నానీ వాళ్ళకు చిక్కేవరకూ హరిత వాళ్ల కస్టడీలోనే వుంటుంది. ముందు నానీని కడతేర్చటం, వెంటనే హరిత కథ ముగించటం వరుసగా జరుగుతుంది అంటే..." ఒక క్షణం ఆగాడు సాలోచనగా. "ఎల్లుండి నువ్వు నానీని కోర్టులో హాజరు పర్చాల్సిన సమయానికి బహుశా నానీ శవమే మిగులుతుంది. హరిత..."

 

    "నో... అలా జరగనివ్వను..." యశస్వి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.

 

    "ఏం చేస్తావు యశస్వీ... ఇన్నిరోజులుగా నానీ యెక్కడున్నాడో తెలీని నువ్వు ఇప్పుడు హరిత ఎక్కడుందీ ఎలా తెలుసుకోగలవు? శాంతిభద్రతల చేనుని రక్షించాల్సిన కంచే మేస్తుంటే ఎలా నువ్వు వాళ్ళని కాపాడుకోగలవు?"  

 

    "రామసూరిగారూ! ఇక్కడకు నేనూ, హరితా వచ్చింది నానీకోసం. వెనక్కి వెళ్ళడమంటూ జరిగితే ముగ్గురమౌతాం. లేదంటే ముగ్గురి కథ ఇక్కడే ముగిసిపోతుంది. వస్తా...!" యశస్వి వుద్వేగంగా వెళ్ళిపోతున్నాడు.

 

    ఆ నిశ్శబ్దపు చీకటిరాత్రి తను నమ్మిన ఒక సత్యంకోసం నిజాయితీగా అలజడి చెందుతూ వెళుతున్న యశస్విని చూస్తూ ఓ క్షణం నిలబడ్డ రామసూరి వెంటనే ఫోన్ దగ్గరకి నడిచాడు.

 

    ఓ గంటసేపటిదాకా ఫోన్స్ వరుసగా చేస్తూనే వున్నాడు రామసూరి. ఇక్కడ రామసూరి తన చివరి "మూవ్"ని చాలా పకడ్బందీగా అమలుపరుస్తున్న విషయం యశస్విక్కూడా తెలీదు...

 

    తెల్లవారింది ఎప్పటిలాగే...

 

    కాని అది అన్నిరోజుల్లా లేదు.

 

    దినపత్రికల్లో ఎక్కడ చూసినా నానీ వార్తలే!

 

    "నానీ ఏమయ్యాడు...? నానీ ఉనికి అంతుబట్టకుండా పోవడానికి కారణం హోంమినిష్టర్ అప్పారావేనా?"

 

    "తుంపాలకి చెందిన నానీ గనికొండ బాలుడిగా ప్రెస్ లో చెప్పిన హోం మినిష్టరే నానీని అదృశ్యం చేసి తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పదివేల బహుమతి ప్రకటించాడా?"

 

    "ఇన్ని గొడవలు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఊరుకుంటుంది?"

 

    "నానీని కాపాడబోయిన కాటికాపరి తవిటయ్యపై హోంమినిష్టర్ అనుచరులు ఎందుకు హత్యాప్రయత్నం చేశారు?"

 

    "డి.యస్పీ. సుందర్ సాక్ష్యాన్ని సమాధి చేయాలనుకోవడంలో అంతరమేమంటే..."

 

    "నానీని సురక్షితంగా అప్పచెబితే పదివేలు బహుమతిని ప్రకటించిన హోంమినిష్టర్ కోరుకుంటున్నది నిజంగా నానీ సురక్షితంగా దక్కటమేనా?"

 

    "జర్నలిస్టు రాందేవ్ హత్యలో పోలీసులు ఇంతవరకూ ఎవర్నీ కస్టడీలోకి తీసుకోకపోవడానికి కారణమేమిటి?"

 

    "అనసూయనే ఓ స్త్రీని హత్యచేసిన హరిని అరెస్ట్ చేయకపోవడానికి కారణం అతను హోంమినిష్టర్ కి అతిముఖ్యుడైన అనుచరుడు కావడమేనా?"

 

    "జరిగిన ప్రతి సంఘటనకి సాక్షి అయిన నానీ ఇంకా బ్రతికే వున్నాడా...?"

 

    రాష్ట్ర ప్రజలంతా నానీ గురించే మాట్లాడుకుంటున్నారు.

 

    నానీ అనే ఓ పసికందు ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం కూలిపోయే స్థితికి కారణమైన ఓ మారణాస్త్రమైపోయాడు.

 

    రంగంలోకి దిగాయి ప్రతిపక్షాలన్నీ.

 

    ఇప్పటికి ఈ సమస్య ఓ గాలివానగా మారడంతో శాంతిభద్రతల్ని కాపాడలేని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చారు రాష్ట్రస్థాయిలో...

 

    సరిగ్గా ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రప్రభుత్వం యిక్కడ రాష్ట్రాన్ని పాలిస్తున్నది మరో ప్రాంతీయ పార్టీ కావడంతో తనూ రంగంలోకి దిగిన సూచనగా ఓ పార్లమెంట్ కమిటీని వేసింది. గనికొండ టూర్ చేసి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసే ప్రయత్నంలో హైద్రాబాద్ దాకా విమానంలో వచ్చి అక్కడినించి హెలీకాప్టర్ లో గనికొండని చేరుకుంది పార్లమెంట్ కమిటీ.

 

    ఇవన్నీ ఒక ఎత్తయితే...

 

    నానీ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం మరో ప్రముఖ వార్తయిపోయింది.

 

    సుమారు ఓ గంటసేపు ఫోన్స్ ద్వారా ప్రయత్నించి తన పలుకుబడితో నిన్న అర్థరాత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడిన రామసూరి అభ్యర్థన్ని సుప్రీంకోర్టు రిట్ పిటీషన్ గా స్వీకరించింది.

 

    మరుసటిరోజే రాష్ట్ర డైరెక్టర్ జనరలాఫ్ పోలీసుకి సుప్రీంకోర్టునుంచి ఓ టెలిగ్రాం అందింది.

 

    దీని సారాంశం- నానీ అనే పసికందుని నలభైఎనిమిది గంటల్లో వెస్ట్ గోదావరి జిల్లా సెషన్స్ కోర్టులో హాజరు పరచమని...

 

    దానితో రాష్ట్ర పోలీసు బలగం మొత్తం నానీని సురక్షితంగా కోర్టులో హాజరుపరిచే విధికి సన్నద్ధం చేయబడింది.

 

    డి.జి.పి. ఈ విషయాన్ని చీఫ్ మినిష్టర్ కి తెలియజేసి తను వ్యక్తిగతంగా పరిశీలించడానికి గనికొండ బయలుదేరాడు.

 

    ఒకపక్క పత్రికలు, మరోపక్క ప్రతిపక్షాలు అంతకుమించి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం అంతటికీ కేంద్రమయిపోయాడు నానీ.

 

    ఎక్కడివాడు నానీ...

 

    ఏ మారుమూల పల్లెలో పుట్టాడు... ఏ తాత ఒడిలో... ఏ అమ్మ పొత్తిళ్ళలో పారాడాడు.

 

    ఎక్కడో... ఏ మృత్యు కరాళదంష్ట్రాల్లోనో నిశ్శబ్దంగా రాలిపోవాల్సినవాడు ఇప్పుడు ఎందరికి ముఖ్యుడయిపోయాడు!

 

    ఆరోజు...

 

    ఉదయం పదిగంటలకల్లా పరిస్థితి చేయిదాటిపోతూందని గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజధానికి రావడానికి మొహం చెల్లని హోంశాఖా మంత్రి అప్పారావుకి పరిస్థితినంతా వివరించి వెంటనే రాజీనామా సమర్పించమన్నాడు ఫోన్ ద్వారా.

 

    ఇచ్చిన వ్యవధింకా పూర్తికాలేదని అప్పారావు నచ్చచెప్పబోతే ముఖ్యమంత్రి అసహనంగా కసురుకున్నాడు.

 

    "పరిస్థితి చేజారిపోయింది అప్పారావు! చాలా గడువిచ్చాను నీకు. మొత్తం పార్టీ ప్రతిష్టకే తలవంపులుతెచ్చే ఈ సమస్యలో నీకింకా కొమ్ముకాసి నేను అప్రతిష్టకి గురికాలేను. అందుచేత నీ అంతట నువ్వు రాజీనామా చేయకపోతే నిన్ను బర్తరఫ్ చెయ్యమని నేనే గవర్నర్ కి రికమెండ్ చేయాల్సివుంటుంది. ఆలోచించుకో. రెండుగంటలు అవకాశమిస్తున్నాను."