జీవాత్మ


    
    క్షణాలు నిముషాలుగా రూపాంతరం చెంది కాలం ముందుకు కదులుతోంది.
    
    అభిరాం కాఫీ తాగి టీపాయ్ మీద కప్పుంచిన ధ్వనికి కళ్ళు తెరిచి-
    
    "అభిరాంగారూ! చిన్న విషయం" అన్నాడు వరప్రసాదం.
    
    "ఏమిటో చెప్పండి" మామూలుగా అన్నాడు అభిరాం.
    
    "మీకు మహదేవ్ అనే ఫ్రెండున్నాడా?" అడిగాడు.
    
    "అవునూ! అయితే ఏం?" ఆశ్చర్యంగా అడిగాడు అభిరాం.
    
    "ఏం లేదు! అపోలో హాస్పిటల్ నుంచి ఆరున్నరకి మీకు ఫోనొచ్చింది..."
    
    "ఏమని?" అతని మాటలు పూర్తికాక ముందే ఆందోళన నిండిన కంఠంతో అడిగాడు అభిరాం.
    
    "అదే మీ ఫ్రెండ్ మహదేవ్ గారికి ఏక్సిడెంట్ అయిందట. అపోలోలో ఎడ్మిట్ చేశారట. అతని షర్ట్ జేబులో మీ విజిటింగ్ కార్డు వుంటే అందులో నెంబర్ ని బట్టి మనకు ఫోన్ చేశారు."
    
    "మరి వెంటనే నన్ను లేపి చెప్పకపోయారా?" కాస్త కోపం ధ్వనించింది అభిరాం కంఠంలో.
    
    "సారీ... కేవలం విజిటింగ్ కార్డున్నంత మాత్రాన ఫ్రెండ్ అవ్వాలనే ముంది. ఏ బిజినెస్ పర్సన్ తోనో మీరాయనకి కార్దిచ్చి వుంటారు. అతను మీ స్నేహితుడు అయి వుండడని అనుకున్నాను. పైగా రాత్రి బాగా ఆలస్యంగా నిద్రపోవటంవల్ల మీరు ఆదమరిచి నిద్రపోతుంటే లేపబుద్ది కాలేదు"
    
    "సర్లెండి" అంటూ గబగబా బట్టలు ధరించి అమ్మమ్మకి మాత్రం విషయం చెప్పకుండా బయలుదేరాడు.
    
    "నన్ను కూడా రమ్మంటే వస్తాను" అన్నాడు వరప్రసాదం.
    
    కాదనలేకపోయాడు అభిరాం. పైగా అమరో మనిషి తోడు ఇటువంటి సమయంలో తప్పనిసరనిపించింది. దాంతో "రండి" అన్నాడు.
    
    అప్పటికే లాల్చీ, పైజామల్లో వున్న వరప్రసాదం అతన్ని అనుసరించాడు.
    
                                                            *    *    *    *    *
    
    'సినిమాల్లో తప్ప నిజజీవితంలో కూడా కారునింత స్పీడుగా డ్రైవ్ చేసే వాళ్ళుంటారా?' అనుకున్నాడు వరప్రసాదం అభిరాం డ్రైవింగ్ చూసి.
    
    సరిగ్గా ఒకటిన్నర నిముషంలో మూడు నాలుగు మలుపులు తిరిగి అపోలో హాస్పిటల్ ముందుకు చేరుకుంది కారు.
    
    "మహదేవ్ అనే పేషెంట్ కావాలి ఎర్లీ మార్నింగ్ ఏక్సిడెంట్ అయి జాయినైనతను" తనవంకే ప్రశ్నార్ధకంగా చూసిన రిసెప్షనిస్ట్ తో అన్నాడు అభిరాం.
    
    అతను వివరాలు చెప్పగానే బాణంలా అటువైపుకు దూసుకు పోయాడు.
    
    వరప్రసాదం అతన్ని అనుసరించాడు.
    
    అద్దాలతో నిండిన ఇంటెన్సివ్ కేర్ లో నిస్తేజంగా పడి వున్నాడు మహదేవ్.
    
    అతని ఒంట్లోంచి చాలా రక్తం పోయిందన్నట్టు ఖాళీ అయిన ప్లాస్టిక్ బ్లడ్ యూనిట్ ని మార్చి మరొకటి అమర్చింది నర్సు! మహదేవ్ తలకి కట్లు.
    
    అభిరాం కళ్ళు అతనికి తెలియకనే చెమర్చాయి. వరప్రసాదం అతన్ని ఓదార్చాడు. మహదేవ్ ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరికి నడిచాడు అభిరాం.
    
    "ఎస్" హుందాగా అన్నాడతను.    

    "నా పేరు అభిరాం. మీరు ట్రీట్ చేస్తున్న మహదేవ్ నా ప్రాణ స్నేహితుడు. అసలీ దారుణం ఎలా జరిగింది?"
    
    అతని గొంతులో బాధనర్ధం చేసుకున్నాడు డాక్టర్.
    
    "సైనిక్ పురి కాలనీ నుంచి సికిందరాబాద్ కెళ్ళే రోడ్డులో జరిగిందట ప్రమాదం. అప్పుడు సమయం ఆరు దగ్గర కావస్తుందట"
    
    "ఎవరు చెప్పారు? అసలెవరు మహదేవ్ ను జాయిన్ చేశారు?" అడిగాడు.
    
    "ఓ లారీ డ్రైవర్, అతని లారీకి కొన్ని గజాల దూరంలో వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయితే డ్రైవర్, అందులోని పాసింజర్ నీ... అదే మీ ఫ్రెండ్ మహదేవ్ ని, ఆటో డ్రైవర్నీ బాగా గాయాలైన పరిస్థితిలో తీసుకొచ్చాడు. అతనొక విషయం చెప్పాడు" ఏదో గుర్తొచ్చిన వాడిలా మధ్యలో ఆగి అన్నాడు.
    
    "ఏమిటది?" ఆతృతగా అడిగాడు అభిరాం.
    
    "తన లారీకి కొంత దూరంలో స్పీడుగా సాగిపోతున్న ఆటో ఒక్కసారే గాల్లో పైకి లేచి గింగిరీలు తిరుగుతూ పడిపోయిందట....."
    
    "అదేమిటి? కొంపతీసి తానే ఏక్సిడెంట్ చేసేసి తప్పించుకోవటానికి కట్టుకథలళ్ళుతున్నాడా?" ఆశ్చర్యపోతూ అన్నాడు అభిరాం.
    
    "నేనూ ముందలాగే ఆలోచించి ఎందుకయినా మంచిదని లారీ నెంబర్, అతని లైసెన్స్ నెంబర్ నోట్ చేసుకున్నాను. అయినా తనే ఏక్సిడెంట్ చేసి హాస్పిటల్ కి తీసుకురాడుగా?" అన్నాడు డాక్టర్.
    
    సాలోచనగా తలూపాడు అభిరాం.
    
    "ఏదేమైనా పేషెంటు లిద్దరూ తెలివిలోకి వస్తే కానీ అసలేం జరిగిందో తెలుసుకోలేం" అన్నాడతను.
    
    సరిగ్గా అప్పుడే సుడిగాలిలా దూసుకొచ్చిన నర్సు అంది- "సార్! ఇంటెన్సివ్ కేర్ లోని పేషెంట్ పోయాడు. అదే ఉదయం ఎడ్మిటైన వాళ్ళల్లో ఒకతను."
    
    "వ్వాట్?" అంటూ దిగ్గున లేచాడు డాక్టర్. పరుగులాంటి నడకతో బయటపడ్డాడు.
    
    నర్సు మాటలతో నవనాడులూ కృంగిపోయినట్లు అభిరాం కదల్లేక పోయాడు.
    
    వరప్రసాదం మాత్రం త్వరత్వరగా బయటకు నడిచి మహదేవ్ వున్న వైపు చూశాడు.
    
    అక్కడ డాక్టర్ కానీ, మరెవరు కానీ లేరు. అంటే పోయింది ఆటో డ్రైవరై వుంటాడు అని మరికొంచెం ముందుకు నడిచాడు. అక్కడ కనిపించారు ఇద్దరు డాక్టర్లు, ఓ నర్స్, ఓ ఆయా.
    
    గబగబా వెనుదిరిగాడు వరప్రసాదం.
    
    టేబుల్ మీద తలుంచి నిశ్శబ్దంగా వున్న అభిరాం భుజం మీద చెయ్యేసి- "పాపం ఆటోడ్రయివర్ పోయాడు. మహదేవ్ కులాసానే" అన్నాడు.
    
    "నిజమా...?" మహదేవ్ కేమీ కాలేదన్న సంతోషం అతని మనసులో. ఇంతలో డాక్టర్ వచ్చాడు.
    
    "మీ ఫ్రెండ్ విషయం కూడా ఇంకో ట్వెల్వ్ అవర్స్ వరకూ ఏం చెప్పలేం. ఆటోడ్రైవర్ పోయాడు" అని చెప్పాడు అభిరాంతో.