Read more!

హలాసనంతో భలే లాభాలు.!

హలాసనంతో భలే లాభాలు.!

యోగాతో  శరీరం చాలా ఫిట్ గా మారుతుంది. చాలామంది జిమ్ లో కసరత్తులు చేస్తారు, బరువులు ఎత్తుతారు, డైట్ ఫాలో అవుతారు. చాలా కష్టపడతారు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫలితాలు యోగా చేస్తే లభిస్తాయి. యోగాలో ఆసనాలు, ధ్యానం, శ్వాసవ్యాయామాలు ఇలా అన్ని ఉంటాయి. ఒక్కో ఆసనం వల్ల ఒక్కో ఫలితం ఉంటుంది. యోగాలో ఉన్న ఆసనాలలో హలాసనం కూడా ఒకటి. హలము అంటే నాగలి. పొలాన్ని దున్నే నాగలి భంగిమలో ఉండటం వల్ల దీన్ని హలాసనం అని అంటారు. మహిళలు హలాసనం వేస్తే బోలెడు లాభాలుంటాయి.  ఈ ఆసనాన్ని ఎలా వెయ్యాలో.. దీని వల్ల కలిగే లాభాలేంటో  తెలుసుకుంటే..

హలాసనం వేసే విధానం..

హలాసనాన్ని ఖాళీ కడుపుతో మాత్రమే వెయ్యాలి.

మొదట ప్రశాంతమైన ప్రదేశంలో దుప్పటి లేదా యోగా మ్యాట్ వేసుకోవాలి.

యోగా మ్యాట్ మీద వెల్లికిలా పడుకోవాలి. ఇలా పడుకున్నప్పుడు కాళ్లు రెండూ పక్కపక్కనే ఆనుకుని ఉండాలి. చేతులు నడుముకు రెండు వైపులా అరచేతులు నేలకు తాకుతూ చాపుకుని ఉండాలి. శరీరాన్ని బిగించినట్టు కాకుండా వదులుగా రిలాక్స్ గా పడుకోవాలి.

రిలాక్స్ గా పడుకున్నప్పుడు కాళ్లను నిటారుగా పైకి లేపి  లంబకోణంలోకి తీసుకునిరావాలి. ఇప్పుడు కాళ్ల పాదాలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఉంటాయి. కాళ్లు ఇలా లంబకోణంలోకి తెచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు పాదాలను క్రమంగా వెనక్కు వంచుతూ పాదాలను తల వెనుకకు తీసుకెళ్ళాలి. అయితే ఈ ఆసనం వేసేటప్పుడు మోకాళ్లు వంచకూడదు.

హలాసనం వల్ల కలిగే లాభాల..

హలాసనం శరీరాన్ని, మనస్సునూ ప్రశాంతంగా ఉంచుతుంది.

ఈ ఆసనం వేస్తే వెన్నెముక, భుజాలు బాగా బెండ్ అవుతాయి. ఈ కారణంగా వెన్ను నొప్పి, భుజాలనొప్పి వంటి సమస్యలున్న వారికి ఇది మంచి ఉపశమనం ఇస్తుంది.

చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. థైరాయిడ్ పనితీరు దెబ్బతింటే శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అయితే హలాసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా మారుతుంది.

ఒత్తిడి, అలసట వంటి సమస్యలు ఉంటే కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేరు. కానీ హలాసనం వేస్తే ఒత్తిడి, అలసట దూరమై మంచి నిద్ర సొంతమవుతుంది.

హలాసనం వేసే క్రమంలో పొత్తి కడుపు కండరాలు బాగా పనిచేస్తాయి. ఈ కారణంగా పొత్తికడుపు కండరాలు బలంగా మారుతాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలుంటే అవి తగ్గుతాయి.

శరీరంలో కండరాలన్నీ ఈ ఆసనం వేసేటప్పుడు పనిచేస్తాయి. ఈ కారణంగా శరీర కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. చెడు కొలెన్ట్రాల్ తగ్గుతుంది.

హలాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధ సమస్యలు దరిచేరవు.

                                                     *నిశ్శబ్ద.