Read more!

తెల్లవారిని ఎదిరించిన తెలుగు శక్తి!

తెల్లవారిని ఎదిరించిన తెలుగు శక్తి!


భారతదేశం బ్రిటీషువారి చెర నుండి విముక్తి కావడానికి కేవలం అందరూ చెప్పుకుంటున్న నాయకులు మాత్రమే కారణమా?? ఇలా అనుకుంటే అందరూ పొరబెడినట్టే.. స్వాతంత్ర్య పోరాటంలో పురుషులు ఎంత దేశభక్తిలో, ధైర్యంతో పాల్గొన్నారో.. అంతకు మించి తెగువతో మహిళలు పాల్గొన్నారు. ఒకటి రెండు కాదు వందలు, వేల కొద్దీ మహిళలు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని బ్రిటీషువారికి చుక్కలు చూపించారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి ముందే చిట్టగాంగ్ విప్లవ వనితలు తెల్లదొరలకు మహిళా శక్తి రుచిచూపించారు. ఆ తరువాత స్వాతంత్రోద్యమంలో భారతదేశంలో పలుచోట్ల మహిళల పోరాటం తుఫానుగా మారింది. ముఖ్యంగా తెలుగు మహిళలు కూడా తెగువతో ముందుకు సాగారు. వారిలో దువ్వూరి సుబ్బమ్మగారు చెప్పుకోదగినవారు.


"భరత ఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ 

తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు, మూతులు బిగియగట్టి.”


 చిలకమర్తివారి ఈ పద్యమును రాగంతో కలిపి అభినయిస్తూ తెల్లవారి గడుసుతనాన్ని ఎత్తి చూపుతూ వారు ఏ ఏ రకాలుగా భారతదేశాన్ని  కొల్ల గొడుతున్నారో, మూతులు బిగియగట్టిన లేగదూడలల్లే భారతీయులు యెట్లా అసహాయులై బాధలను భరిస్తున్నారో చెబుతూ  శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మగారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. రామాయణ, భారత, భాగవతాలలో నుంచి అనేక ఘట్టాలను శ్రావ్యమైన చక్కని కంఠంతో రాగ వరసన చదువుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని యే రావణాసురుడుతోనో సరి పోల్చి చెప్పేవారు. ఏ మైకులులేని ఆ కాలంలో శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ గారి కంఠం సభా ప్రాంగణాలలో ఎంతో  దూరానికి కూడా వినిపించేది. అటు హిందూ పురాణ శ్రవణం చేస్తూ ఇటు భారత రాజకీయ పరిచయం చేసుకుంటూ నభికులు మంత్ర ముగ్ధులై కదలకుండా కూర్చుని వినేవారు. ఆమె తన విద్వత్తును, పాండిత్యాన్ని, కల్పనా శక్తిని స్వాతంత్ర్యోద్యమ ప్రచారానికి ఉత్సాహంగ అర్పించేవారు. 


ఆమెకు మొండి ధైర్యం, సాహసం చాలా ఎక్కువ. నదురు బెదురు లేకుండా బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చే సందర్భంలో శ్రీ గరిమెళ్లవారి రచనలు "మాకొద్దీ తెల్లదొరతనము" పాటను రాగం తానం పల్లవిలతో  అ సుదీర్ఘంగా, భావస్ఫూరితంగా చతురత నింపుకుని, మధ్యమధ్యలో చమకులతో పాడేవారు. సభకు హాజరైన ప్రజలందరూ ఆమె ఉపన్యాసం వినడానికి ఎంతో ఉవ్విల్లూరేవారు.  ఆమె ఉపన్యాసం విని   ఉత్తేజితులయ్యేవారు. ఇంత బహిరంగంగా వేలకొద్ది జనానికి తెల్లదొరతనం వద్దని విప్లవ మంత్రం వుపదేశిస్తూ వుంటే ప్రభుత్వ అధికారులుగా పోలీసు వారు డప్పులు, డబ్బాలు మోగించి ఆమె పాట, మాట వినపడకుండా చేసేవారు. 


ఆమె కోపం పట్టలేక “ఏమోయి అధికారీ నేనంటే ఏమనుకున్నావు. గంగా భగీరథీ సమానురాలను. తలచుకున్నానంటే నిన్ను నీ డప్పులను నీ పోలీసు వాళ్లను గంగలో ముంచెత్తగలను. కాని అహింసా వ్రతం చేపట్టాను. అందుకని అంత పని చేయటంలేదు జాగ్రత్త" అని గర్జించేవారు. ఆమె అలా అనడంతో కంగారు పడుతూ పోలీసువాళ్ళు  వచ్చిన దారినే వెళ్లిపోయేవారు. మరికొన్ని సభల సమయంలో పోలీసు అధికారులు కనిపించగానే "ఏమోయి బ్రిటిష్ వారి బానిసా..  రా, రా, నన్ను పట్టుకో," అని అరిచేవారు. అధికారులు ఇబ్బందిగా అటు, ఇటు చూసి వెళ్ళిపోయేవారు. ఇదంతా నువ్వు స్త్రీవి ఎందుకులే పాపం అని అనుకుని వారు వెళ్లిపోయారనుకుంటే పొరపాటే.. గొంతు విప్పనంత వరకు స్త్రీ బానిసగానూ.. ఇల్లు చక్కదిద్దే మనిషిగానూ అనిపిస్తుందేమో.. కానీ గొంతు విప్పి గర్జిస్తే.. శక్తి తాండవం చేసినట్టే..


                                   ◆నిశ్శబ్ద.