జీవాత్మ


        
    మన ప్రభుత్వం కుమావున్ మండల్ వికాస్ నిగమ్ (కె.ఎం.వి.ఎన్) వారు సంయుక్తంగా యాత్రికులని దేశ సరిహద్దు దాటిస్తారు. యాత్రకు అనుమతి లభించగానే కె.ఎం.వి.ఎన్. పేర వెయ్యిరూపాయలు డి.డి. తీసి విదేశీ వ్యవహారాల శాఖ వారికి పంపాలి.
        
    అనంతరం ఇండియా టైపు భోజనం, వసతి, లగేజీ ఛార్జీలు గైడ్ చార్జీలు నిమిత్తం మరో ఆరువేల ఐదువందల రూపాయలు చెల్లించాలి. చైనావైపు ఆ ప్రభుత్వం చేసే ఏర్పాట్లు కోసం వారికి 500 అమెరికా డాలర్లు చెల్లించాలి. చైనాలో యాత్రికులకి ఖర్చులకోసం ఇండియాలో 150 డాలర్లు ఇస్తారు. ఇందుకోసం ఒక్కో యాత్రికుడు 22 వేల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది.    
    ఇంత తతంగమూ, ఏ అడ్డంకులూ లేని సమయంలో వరప్రసాదం స్వేచ్చా విహంగంలా హిమాలయ పర్వత ప్రాంతాల్ని సందర్శించాడు.
    
    ఇప్పుడన్నీ అడ్డంకులే! పాస్ పోర్ట్ లేదు. ఓ గైడ్ లేడు. వాహన సదుపాయం లేదు. ముఖ్యమైన శరీరదారుఢ్యం కూడా లేదు... వున్నదల్లా ఒక్కటే.... పట్టుదల, మహదేవ్ ని బతికించుకోవాలనే తీవ్రమైన వాంఛ. అదే అతన్ని అన్నిటికీ తెగించేలా చేసింది. మనసులో మరోసారి అఘోరీ బాబాని తలుచుకున్నాడు. నేరుగా నడుస్తున్నాడు!
    
    చల్లటి ఈదురుగాలులు ఎన్ని ముతక దుస్తులు ధరించినా, ఎన్ని స్వెట్టర్లు శరీరాన్ని కప్పి వుంచినా గజగజ వణికిస్తున్నాయ్.
    
    అతను మంచుకొండల్లో నడుస్తున్నా కళ్ళు మాత్రం నలువైపులా శోధిస్తూనే వున్నాయ్. ఎవరయినా తన మార్గానికి అడ్డువస్తారని.
    
    అయితే ఒక మంచి కార్యాన్ని చేస్తున్న అతన్ని అవడానికి ఇచ్చగించని దైవం సరిహద్దు గస్తీ దళాలకి వరప్రసాదం వునికి తెలియనివ్వ లేదన్నట్టు దారిలో ఒక్కరూ కనిపించలేదు.
    
    కనిపించిన ఒకటి రెండు చెక్ పోస్ట్ ల వద్ద కూడా అప్పటిదాకా వుండి వెళ్ళిపోయినట్లు సైనికుల బూట్ల ముద్రలు అతను గమనించగలిగాడు. అతని మనసెందుకో అనిర్వచనీయమైన ఆనందానికి లోనవుతూనే వుంది. ఆ ప్రదేశాన్ని చేరుకున్నప్పట్నుంచి.
    
    ముందుగా అతను చేరుకున్న ప్రదేశం 'కైసాని' తరువాత వరుసగా 'త్రిశూల్' పర్వతాలు 'దుర్బులా' (ఈ ప్రదేశం కాశీనది ఒడ్డున వుంది. నదిపై వంతెనను దాటితే అవతలివేపు నేపాల్! అక్కడికి ఏ ఆంక్షలు లేకుండా వెళ్ళొచ్చు)
    
    వరప్రసాదం నడుస్తూనే వున్నాడు. 'ఇక విశ్రాంతి తీసుకో!' అన్నట్లు ఆ పర్వత పంక్తులన్నీ వెలుగులోకి వీడ్కోలు చెప్పి, చీకటిని ఆహ్వానించాయ్. అతను కనిపిమ్చిన ఓ గుహవైపు నడిచాడు.

                                                            *    *    *    *    *
    
    రాబోయే తుఫాన్ కు ముందున్న ప్రశాంతథా నెలకొని వుందక్కడ.
    
    పిన్ డ్రాప్ సైలెన్స్....!
    
    ఎవరూ ఎవరితోనూ మాట్లాడటం లేదు.
    
    క్షణాలు అత్యంత భారంగా గడుస్తున్నాయ్.
    
    అక్కడున్న వారందరి చూపులూ మహదేవ్ శరీరానికి అతుక్కుని వున్నాయ్.
    
    శిశిరం సమీపిస్తూ శిధిలమయి- రాలిపోవటానికి సిద్దంగా వున్న ఆకులా వుందతని దేహం.
    
    అభిరాం ఇక చూడలేనట్లు ముఖం తిప్పేసుకున్నాడు.
    
    భావరహితంగా వుంది మనస్విని. ఆమె కనురెప్ప సైతం మూతఃలు పడటం లేదు. తిరుపతి మౌనంతో నేస్తం కట్టినట్టు మాటా పలుకూ లేకుండా మౌనంగా చూస్తుండిపోయాడు.
    
    ఉన్నట్టుండి మహదేవ్ శరీరం కదలసాగింది. కడుపులో విపరీతమైన బాధని సూచిస్తూ రెండు చేతుల్నీ పొట్టకి అదుముకుని మెలికలు తిఇర్గి పోసాగాడు. దాంతో స్టాండ్ నుంచి వ్రేల్లాడుతూ అతని ఎడం చేతికి అమర్చబడిన ఫ్లూయిడ్ బాటిల్ కదిలి, నేలకి తాకి 'భళ్ళున పగిలిపోయింది.
        
    తుళ్ళిపడి అటు చూశారందరూ.
    
    బాధతో లుంగలు చుట్టుకుపోతున్నాడతను.
    
    అభిరాం చటుక్కున లేచి అతని శరీరాన్ని నేలమీద పడిపోకుండా అదిమి పట్టుకున్నాడు. మనస్విని చేష్టలుడిగి ఆటే చూస్తోంది. డాక్టర్ని తీసుకురావటానికి సుడిగాలిలా బయటకు నడిచాడు తిరుపతి.
    
    తన బాధని వ్యక్తపరచటానికి సైతం శక్తిలేనట్టు మహదేవ్ స్వర పేటిక నుంచి ఒక్క చిన్న శబ్దం కూడా రావటం లేదు.
    
    డాక్టర్ తో పాటు ఆ గదిలోకి ప్రవేశించాడు తిరుపతి.
    
    మహదేవ్ ని క్షణకాలం పరీక్షించగానే డాక్టర్ కి అతని బాధేమిటో అర్ధమయిపోయింది. మరుక్షణం అతన్ని ఆ గదిలో నుంచి మరో గదికి తరలించారు.
    
    ఆ గదిలో వున్న రేడియాలజిస్ట్ బేరియం ద్రవాన్ని మహదేవ్ గొంతులో పోశాడు.
    
    మెల్లగా గొంతులోంచి కడుపులోకి దిగుతున్న ద్రవం ఫ్లోరోస్కోప్ లో అన్ని అవయవాలనీ స్పష్టంగా చూపిస్తోంది.
    
    అభిరాం, తిరుపతి ఒక మూలాన నుంచుని చూస్తున్నారు. బేరియం ద్రవం మరింత కిందికి దిగింది. అదే సమయంలో మహదేవ్ శరీరంలోని 'అల్సర్'ని గమనించాడు డాక్టర్.
    
    కరెక్టుగా అల్సర్ వున్న ప్రదేశాన్ని మార్క్ చేస్తూ ఫోటోలు తీశాడు రేడియాలజిస్ట్ వెంటనే దాన్ని కరిగించే లేసర్ కిరణాలు అతని శుష్క దేహంలోని అల్సర్ పైకి ప్రసరించాయ్.
    
    కొన్ని క్షణాలు అతని శరీరం గాలికి కదిలి ఆకులా రెపరెపలాడింది. మళ్ళీ ఫ్లోరోస్కోప్ లో చూసుకుంటున్నారు డాక్టర్, రేడియాలజిస్ట్ లిద్దరూ! అల్సర్ మటుమాయమయింది. మరుక్షణం మహదేవ్ శరీరం అబ్జర్వేషన్ రూంకి తరలిపోయింది.
    
                                                                 *    *    *    *    *