జీవాత్మ


    "గుడ్ నైట్" అన్నాడు మహదేవ్.
    
    "గుడ్ నైట్" బదులిచ్చాడు వరప్రసాదం.
    
                                                             *    *    *    *    *
    
    హఠాత్తుగా మెలకువొచ్చింది వరప్రసాదానికి. అంత హఠాత్తుగా అతనికెప్పుడూ మెలకువ రాలేదు. తనకెందుకు మెలకువ వచ్చిందీ అతని కర్ధం కాలేదు. పక్కకి చూశాడు. బెడ్ ల్యాంప్ కాంతిలో ప్రశాంతంగా నిద్ర పోతున్న మహదేవ్ కన్పించాడు.
    
    అంతటా నిశ్శబ్దం. వాల్ క్లాక్ చేస్తున్న ధ్వని తప్ప 'మరి తనకెందు కింత హఠాత్తుగా మెలకువ వచ్చిందో అర్ధంకాలేదు. చప్పుడు చేయకుండా మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నాడు కానీ కంటిమీదకి కునుకురాలేదు అతనికి. కొన్ని క్షణాల తర్వాత ఏదో కదిలిన చప్పుడు. 'ఏమిటిది?' అనుకున్నాడతను. చెవులు రిక్కించి విన్నాడు. ఏమీలేదు.
    
    'తను భ్రమపడ్డాడో? లేకపోతే నిజంగానే చప్పుడయిందో అనుకున్నాడు. అతనికి ఎందుకో ఆ గదిలో ఎవరో కదలాడుతున్నట్లు అన్పించింది.
    
    బెడ్ ల్యాంప్ కాంతిలో కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు. ఉహూ! ఎవరూ లేరు.
    
    'మరెందుకీరోజు తనకిలాన్తి భావాలొస్తున్నాయి?' అనుకున్నాడతను.
    
    ఇంతలో ఎక్కడో సన్నని రోదనలాంటి ధ్వని. లేచి కూర్చున్నాడు. ఆ ధ్వని వినిపిస్తున్న దిక్కుగా నడిచాడు. హాల్లోంచి వస్తుందా ధ్వని. హాల్లోకి అడుగుపెట్టి లైట్ ఆన్ చేశాడు.
    
    విచిత్రంగా ఆ రోదన ఆగిపోయింది. చెవులు రిక్కించి విన్నా మళ్ళీ వినిపించలేదా ధ్వని. లైటాఫ్ చేసి వెనుదిరుగుతుండగా మళ్ళీ వినిపించలేదా ధ్వని. లైటాఫ్ చేసి వెనుదిరుగుతుండగా మళ్ళీ మొదలయింది.

    ఈసారి అంతవరకూ పెరుగుతూ, మరింత పెద్దగా, అయినా పట్టించుకోలేదతను.
    
    తిన్నగా మహదేవ్ గదిలోకి నడిచాడు.
    
    ఆశ్చర్యం!
    
    మంచంమీద మహదేవ్ లేడు. 'ఎక్కడికెళ్ళాడా'ని ఆలోచించసాగాడు. అంతలో అటాచ్ డ్ బాత్ రూం తలుపు తీసుకుని బయటికొచ్చాడు అతను.
    
    "ఏమిటి నిద్రపట్టడంలేదా?" పక్కమీద కూర్చుని వున్న వర ప్రసాదాన్ని అడిగాడతను.    

    "అవును!" ముక్తసరిగా అని చెవులు రిక్కించాడు మళ్ళీ! ఈసారి రోధన ధ్వనులాగిపోయి ఎవరో నడిచివస్తున్న అడుగుల చప్పుడు.
    
    మెల్ల మెల్లగా దగ్గరవుతూ...
    
    గిరుక్కున వెనుదిరిగి చూశాడు ఏం లేదు.... అంత చీకటితప్ప. ఈ యింట్లో ఏవో ఆత్మలు వున్నాయి! రూఢిగా నిర్ధారించుకున్నాడతను.
    
    పక్కమీద వాలి కళ్ళు మూసుకున్నాడు. రాత్రంతా ఏవో చప్పుళ్ళూ, ధ్వనులు, లీలగా ఆకారంలేని నీడలు కదలాడుతున్న సంగతీ గమనించాడతను.
    
                                                             *    *    *    *    *
    
    సూర్యకిరణాలు కిటికీల్లోంచి నేరుగా మహదేవ్ గదిలో ప్రసరిస్తున్నాయ్.
    
    అప్పటికే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మొత్తం ఇల్లంతా తిరిగాడు వరప్రసాదం. రెండు బెడ్ రూమ్ లూ, హాలూ, కిచెన్, బాత్ రూంలతో సహా ఎక్కడ ఆతనికేం కన్పించలేదు.
    
    మహదేవ్ గదిలోకి నడిచాడు. అతన్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడతను. మనిషి బాగా సడలిపోయి, నీరసంగా కన్పిస్తున్నాడు.
    
    "హాస్పిటల్ లో వున్నప్పుడే బాగున్నాడు. రాత్రి కూడా బాగున్న మనిషి తెల్లారేసరికి ఇంత మార్పా?" ఆశ్చర్యంగా అనుకున్నాడతను.
    
    ఏడవుతుండగా నిద్రనుంచి మేల్కొన్నాడతను. వరప్రసాదాన్ని చూసి నీరసంగా నవ్వాడు.
    
    "ఎలా వుంది?" ఆత్రంగా అడిగాడు వరప్రసాదం.
    
    "బాగా నీరసంగా వుంది" బదులిచ్చాడు మహదేవ్.
    
    'రాత్రి వినిపించిన విచిత్రమైన ధ్వనులకీ మహదేవ్ ఈ పరిస్థితికీ ఏదయినా సంబంధం వుందా?' మనసులో అనుకున్నాడతను.
    
    మహదేవ్ మంచంమీదే నెమ్మదిగా లేచి కూర్చున్నాడు కొంచెం సేపు. తరువాత మంచందిగి బాత్ రూం వైపు నడిచాడు. పావుగంట తరువాత కాలకృత్యాలు ముగించుకుని బయటపడ్డాడు.
    
    అప్పుడే అభిరాం వచ్చాడు.
    
    ప్లాస్క్ నిండా కాఫీ, టిఫిన్ తెచ్చాడు. మహదేవ్ ని చూసి ఒక్కసారిగా అతని భ్రుకుటి ముడిపడటం వరప్రసాదం గమనించాడు.
    
    "బాగా నీరసించిపోయావేమిటి?" మహదేవ్ మొహం వంక తేరిపార చూస్తూ అడిగాడు అభిరాం.
    
    "కొంచెం నీరసంగా వున్నమాట నిజమే కానీ... మరి బెంబేలు పడిపోకు" అన్నాడు మహదేవ్ అభిరాం మాటలకి.
    
    "లేదు మహదేవ్ బాబూ! అభిరాం అన్నది కరెక్టే! రాత్రికీ, ఇప్పటికీ నీలో చాలా మార్పొచ్చింది!" అన్నాడు వరప్రసాదం.
    
    "నిజమా?" ఆశ్చర్యంగా అడిగాడు మహదేవ్.
    
    "రాత్రి నిద్ర పట్టలేదా?" అడిగాడు అభిరాం.
    
    "నాకు బాగానే పట్టింది. పాపం కొత్త ప్లేసవటం వల్ల కాబోలు వరప్రసాదంగారే సైర్గ్గా నిద్రపోలేకపోయారు" అన్నాడు మహదేవ్.
    
    "సరే! ముందు టిఫిన్ తినండి. చల్లారిపోతుంది" అంటూ పేకెట్స్ అందించాడు. ఇద్దరూ టిఫిన్ చేశాక కాఫీ తాగారు.
    
    "రాత్రి మీకు నిద్రపట్టలేదా?" అడిగాడు అభిరాం వరప్రసాదం వైపు చూస్తూ.
    
    "ఫర్వాలేదు. మహదేవ్ బాబన్నట్లు కొత్త ప్లేస్ కదా" అనేశాడు వరప్రసాదం.
    
    అభిరాం, మహదేవ్ కి వేసుకోవలసిన మందులూ, మంచినీళ్ళూ అందించాడు. మౌనంగా మాత్రలు మింగి వాళ్ళిద్దరివంకా చూస్తుండి పోయాడతను.
    
    "మీ ఆఫీసులో ఎవరికీ తెలియదులా వుంది నీకు ఏక్సిడెంట్ జైర్గిన విషయం" అన్నాడు అభిరాం.