పక్షవాతం కారణాలు - చికిత్స

 

పక్షవాతం కారణాలు - చికిత్స

 

పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధి. శరీరంలోని అవయవాలు ప్రయత్న పూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతము అంటారు. పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటు, మెదడులో రక్త సరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, లేదా ఇతరత్రా ప్రమాదాలు.

పక్షవాతం వచ్చిన రోగి ఆరోగ్యం ఈ క్రింది విధంగా క్షీణిస్తుంది.

  • పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి.

  • నాడీకణాలు, న్యూరాన్ల మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. ఫలితంగా మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.

  • మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం ఆగిపోతుంది.

నాడీకణాలు మరణించే సంఖ్యపైనే పక్షవాతంతో బాధపడే రోగి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

శరీరంలోకి ఒక వైపు భాగాలు పని చేయకపోవడం, మూతి వంకర అవ్వడం, సరిగా మాట రాకపోవడం, స్పృహ తప్పడం, విపరీతమైన తలనొప్పి, చూపు తగ్గడం పక్షవాతానికి దారి తీస్తున్న పరిస్థితులుగా పరిగణించాలి. పక్షవాతం సోకిన వారికి ఇప్పటి వరకు మెడికల్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా చికిత్స చేస్తున్నారు. ఈ విధానంలో శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా మందులతో చికిత్సచేస్తారు. అయితే ఇటీవల ఫిజియోథెరఫి అనే పద్దతి విస్త్రృతంగా వాడుకలోకి వచ్చింది.

పక్షవాతం సోకిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం.

ఫిజియోథెరపీలో రోగికి మందులు అందిస్తూనే శారీరకంగా, మనసికంగా చికిత్స అందిస్తారు. పక్షవాతంతో బలహీనపడ్డ శరీర కండరాలను నయం చేస్తూ రోగిని పూర్వస్థితికి తెస్తారు.

  • రోగి కూర్చునే , పడుకునే, నిలబడే, నడిచేవిధానాలు, మెట్లు ఎక్కడం, దిగడం క్రమ పద్దతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. 0-1 గ్రేడ్‌ కోసం బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్‌ స్టిమ్‌లేటర్‌ చికిత్స చేస్తారు.

  • ఆపై 1-5వరకు సస్పెన్షన్‌ థెరఫీ, ఇన్‌క్లెయిన్‌బోర్డు, వేయిట్‌ బేరింగ్‌, క్వార్టర్‌ సైడ్‌ చేయిల్‌, ఫోల్డర్‌, పుల్లీవాల్‌ ల్యాపర్‌, స్టెఫ్‌ ఆఫ్‌ స్టెఫ్‌డౌన్‌, కాడ్‌మాన్‌, సైక్టింగ్‌ ఎక్సైర్‌సైజ్‌లతో కండరాన్ని, బలపరుస్తారు. అనంతరం సరైన నడకను నేర్పించడానికి ప్యారలాల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయిస్తారు.

దీంతో పక్షవాతం సోకిన రోగి త్వరగా కోలుకునే అంశాలుంటాయి. మందులు, ఫిజియోథెరపీ తో పాటు పక్షవాతం సోకిన రోగికి మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా, చూస్తుండాలి. చాలాసేపటి వరకు ఒంటరిగా ఉండనివ్వకుండా ఎవరో ఒకరు రోగితో మాట్లాడుతూ ఉండాలి. మీ ఫ్యామిలీ లో జరగబోయే శుభకార్యాల గురించి మాట్లాడాలి, వారి అభిప్రాయాన్ని అడుగుతుండాలి. వారి ఎదురుగా కూర్చుని న్యూస్ పేపర్ చదవడం, కలిసి టి.వి. చూడటం లాంటివి చేస్తుండాలి. దీంతో పేషెంట్ కి మనశ్శాంతి కలిగి మానసిక ఒత్తిడి నుండి బయటపడగలడు.

ఎప్పటికప్పుడు తన శరీరంలో వచ్చే మార్పుల్ని, కుదుటపడుతున్న తన ఆరోగ్య పరిస్థితిని గురించి అతనికి తెలియజేస్తూ ఉండాలి. త్వరలో కోలుకుంటారన్న విశ్వాసాన్ని కలిగించాలి.