
బిగ్‌బాస్ తెలుగు 10లో ఫ్యామిలీ వీక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఇప్పటికే జబర్దస్త్ నరేష్, శ్వేతా నాయుడు కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా.. లేటెస్ట్ గా శివకుమార్ కోసం నటి ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె రాకతో హౌస్‌లో సందడి మాత్రమే కాదు.. ఏకంగా నిశ్చితార్థ వేడుక కూడా జరిగింది.
రీసెంట్ ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్ ముసుగు ధరించి వేదికపైకి వచ్చి కూర్చుంది. ఆమెను చూసిన శివకుమార్ మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ముసుగు తొలగించి తన కాబోయే భార్యను గుర్తుపట్టగానే ఆనందంతో హగ్ చేసుకున్నాడు . ఇద్దరూ కాసేపు ప్రేమగా మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రియాంక తన బిగ్‌బాస్ సీజన్ 7 ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. తాను గతంలో కంటెస్టెంట్‌గా ఉన్నప్పుడు అందంగా రెడీ అయ్యానని, ఇప్పుడు శివకుమార్ కూడా తన కోసం ప్రత్యేకంగా ముస్తాబు కావాలని చెప్పింది. అందుకు సంబంధించిన కొత్త దుస్తులను కూడా ఇచ్చింది. అంతేకాదు, బిగ్‌బాస్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచేలా ఈ హౌస్‌లో తమ ఎంగేజ్‌మెంట్ జరగబోతోందని ప్రకటించింది. దీంతో కంటెస్టెంట్లందరూ కేరింతలు కొట్టారు.
ఆ తర్వాత శివకుమార్‌ను పెళ్లికొడుకులా ముస్తాబు చేశారు. లేడీ కంటెస్టెంట్లు అతడిని వేదిక దగ్గరకు తీసుకురాగా, మేల్ కంటెస్టెంట్లు ప్రియాంకకు పూల గొడుగు పట్టి వేదికపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నరేష్.. ఎంతో అపురూపంగా పెంచుకున్న తమ చెల్లికి జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇవ్వాలని శివకుమార్‌ను అడిగాడు. అందుకు అతడు తప్పకుండా తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. తర్వాత శివకుమార్ మోకాళ్లపై కూర్చొని చేతిలో ఉంగరం పట్టుకుని ప్రియాంకకు పెళ్లి చేసుకుంటావా అని ప్రొపోజ్ చేసాడు . ప్రియాంక కూడా మోకాళ్లపై కూర్చొని శివకుమార్‌కు ప్రపోజ్ చేసింది. ఇద్దరూ తమ అంగీకారం తెలిపిన తర్వాత శివకుమార్ ప్రియాంక వేలికి ఉంగరం తొడిగాడు. ఇంటి సభ్యులంతా పూలు చల్లి కాబోయే జంటను ఆశీర్వదించారు.
ఆ తర్వాత కంటెస్టెంట్లు ఈ జంటను ఆటపట్టిస్తూ, సరదాగా సంబరాలు చేసుకున్నారు. శివకుమార్, ప్రియాంకలను పక్కపక్కన ఎత్తుకొని పూలదండలు మార్చుకునేలా చేశారు. అనంతరం ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ వేడుకను మరింత సందడిగా మార్చారు. తర్వాత శివకుమార్ తన కాబోయే భార్య ప్రియాంకతో కలిసి ఇంట్లోకి వస్తున్నానని చెప్పగా.. ప్రియాంక కూడా తన కాబోయే భర్త శివకుమార్‌తో కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తున్నానని సరదాగా చెప్పింది.





.webp)
