
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -266....లో విడాకుల విషయం గురించి ఆలోచించుకోమని మాధవ్ మహాలక్ష్మికి సర్దిచెప్పగా మీ తమ్ముడితో కలిసి ఉండలేనని మహా చెప్తుంది. మహాలక్ష్మిని పిలిచి టిఫిన్ చేయమని పెద్ది కోరతాడు. తనకు ఆకలిగా లేదని చెప్పి ఆఫీసుకు వెళ్లబోతుండగా నాకోసం కొంచెం తినమని అడుగుతాడు. దీంతో మహా వచ్చి కూర్చుంటుంది. విడాకుల గురించి ఏం ఆలోచించావని మహాలక్ష్మిని అడుగుతాడు మాధవ్. మా తమ్ముడు అని చెప్పడం లేదు కానీ చక్రి నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదని అంటాడు. ఓ తండ్రి స్థానంలో ఉండి చెప్తున్నానని, పెళ్లి ఎలా ఏ పరిస్థితుల్లో జరిగినా అది పెళ్లేనని అంటాడు. నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగినా ఆ పెళ్లి జరిగేప్పుడు ముక్కోటి దేవతలు వచ్చి దీవిస్తారని చెప్తాడు. ఆ పైవాడి ప్రమేయం లేకుండా ఏ పెళ్లి జరగదని అంటాడు.
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుందని చెప్తాడు, ఇప్పుడు నువ్వు విడాకులు తీసుకుని బయటకు వెళ్లిపోతే నలుగురు నిన్ను నాలుగు రకాలుగా అనుకుంటారని అంటాడు. ఈ ఇంట్లోకి నువ్వు అతిథిగా వచ్చావని, నువ్వు చక్రి వేర్వేరు రూమ్ ల్లో దూరంగానే ఉన్నారని ఎవరూ అనుకోరని అంటాడు. ఓసారి విడాకులు తీసుకుని బయటకు వెళ్లిన ఆడపిల్లకు అంత మంచి పేరు ఉండదని సూచిస్తాడు. ఇవన్నీ నా తమ్ముడితో నిన్ను ఉండిపోవాలన్న స్వార్థంతో చెప్పడం లేదని, నా బిడ్డకు జరగబోయే అవమానాలు దృష్టిలో ఉంచుకునే చెప్తున్నానని అంటాడు. నువ్వు ఈ గడప దాటి వెళ్లిన మరుక్షణం ఈ బృందావనం మళ్లీ పాత బృందావనంలా మారిపోతుందని అదే భయంగా ఉందని చెప్తాడు. మీరు ఎన్ని చెప్పినా మీ తమ్ముడితో నేను కలిసి ఉండలేనని, ఈ విషయంలో నేను వెనక్కి తగ్గలేనని మహాలక్ష్మి చెప్తుంది.
మహాలక్ష్మి వినకపోవడంతో చక్రికి సర్దిచెప్పేందుకు మాధవ్ ప్రయత్నిస్తాడు. నువ్వు అయినా ఈ విడాకుల విషయంలో ఆలోచించరా అని అంటాడు. నువ్వు నిజంగానే మహాలక్ష్మికి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు. నువ్వు మహాను విడిచి ఉండగలవా అని అంటాడు, తనకు ఏది ఇష్టమో అదే చేస్తానని చక్రి చెప్తాడు. ఇప్పుడు నేను విడాకులు ఇవ్వకపోతే తన దృష్టిలో మోసం చేసి పెళ్లి చేసుకున్న వాడిగానే మిగిలిపోతానని అంటాడు. అందుకే తనకు విడాకులు ఇచ్చి మళ్లీ తననే ప్రేమించి తన ప్రేమను గెలిచి పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఇదంతా జరిగే పని కాదురా అని మాధవ్ సర్దిచెప్తాడు, మహా లేకుండా నువ్వు బతకలేవని చెప్తాడు. గాయత్రి దూరమైన తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసని అంటాడు. ఏదీ ఏమైనా మహా నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకు మరో మార్గం లేదని చెప్తాడు. ఆఫీసుకు వెళ్లిన మహాను విక్కీ మళ్లీ కాఫీకి పిలుస్తాడు. నాకు చాలా పనులు ఉన్నాయని మహా రిజెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






