
టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ సరసన 'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళి' వంటి మూవీస్ లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్గా పాల్గొని బుల్లితెర ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్' సినిమాలో ప్రత్యేక గీతంలోనూ సందడి చేసింది.
అయితే తాజాగా మోనాల్ గజ్జర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. తనకు ఇటీవల పాపిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ (పాపిల్లరీ థైరాయిడ్ కాన్సర్) ఉన్నట్లు వెల్లడైందని, దీనికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపింది.
ఈ సర్జరీ సక్సెస్ అయ్యిందని ప్రస్తుతం కోలుకుంటున్నానని మోనాల్ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించాలని చెప్పింది. ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న హెచ్పీవీ వ్యాక్సిన్ గురించి తెలుసుకుని వైద్యుల సలహాతో టీకా తీసుకోవాలని మోనాల్ సూచించింది. మొత్తానికి తన ఆరోగ్య సమస్యను ధైర్యంగా బయటపెట్టడమే కాకుండా, ఇతరులు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మోనాల్ చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . ఆమె పూర్తిగా కోలుకోవాలని ఫాన్స్ అంతా విషెస్ చెప్తున్నారు.






