Illu illalu pillalu : అత్తగారింట్లో అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఏం చేయనుంది?
on Jun 29, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -197 లో... ఊళ్లో దొంగలు పడ్డారని తిరుపతి వచ్చి రామరాజుతో చెప్పేసరికి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు బ్యాంకులో పెట్టమని రామరాజు చెప్తాడు. దాంతో శ్రీవల్లిని నగలు తీసుకురమ్మని చెప్తుంది వేదవతి. వేదవతి పిలుపు వినిపించేసరికి ఆ నగలకోసమే అయ్యి ఉంటుందని శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. అమ్మా వల్లీ అని వేదవతి ప్రేమగా పిలిచేసరికి.. చూశావా ప్రేమా.. అత్తయ్య గారికి ఆ అగ్గిపుల్ల కోడలంటే ఎంత ప్రేమో అని నర్మద అంటుంది. ఏయ్.. అగ్గిపుల్ల ఏంటే.. అగ్గిపుల్లా.. చిన్న పెద్ద తేడా తెలియకుండా అని వేదవతి అంటుంది. హా.. ఆ పేరు ఆవిడగారికి సరిగ్గా సరిపోతుందని ప్రేమ అంటుంది. ఏంటే.. దీనితో ఉండి నువ్వు కూడా దానిలాగే తయారయ్యావని వేదవతి అంటుంది.
ఇంతలో అగ్గిపుల్ల కోడలు.. చేతులు నలుపుకుంటూ వస్తుంది. ఏంటి అత్తయ్య గారూ పిలిచారా అని శ్రీవల్లి అడుగుతుంది. ఏం లేదమ్మా.. ఊరిలో దొంగలు పడ్డారంట.. మనందరి నగలు లాకర్‌లో పెట్టమని మీ మామయ్య గారు చెప్పారు. మీరు వెళ్లి మీ నగల్ని తీసుకుని రండి అని వేదవతి అంటుంది. ఇద్దరు కోడళ్లు వెళ్తారు కానీ.. శ్రీవల్లి మాత్రం అతితెలివి ప్రదర్శించి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అత్తయ్య గారూ.. లాకర్‌లో పెట్టడం ఎందుకు వేస్టూ అని అంటుంది. దొంగలు నీకంటే జాగ్రత్తగా ఉంటారు.. వెళ్లి చెప్పింది చెయ్ అని వేదవతి అంటుంది. అంటే అదీ అత్తయ్య గారండీ.. అన్ని నగల్ని లాకర్‌లో పెడితే ఫంక్షన్లకు ఏం వేసుకోవాలని శ్రీవల్లి అడుగుతుంది. అందరి నగలు పెడుతున్నాం కదా.. ఫంక్షన్ నీ ఒక్కదానికే రాదు కదా.. బ్యాంక్‌కి వెళ్లాలి తొందరగా వెళ్లి నగల్ని తీసుకునిరా అని వేదవతి అంటుంది. దాంతో చచ్చినట్టు నగలు తీసుకునిరావడానికి వెళ్తుంది శ్రీవల్లి.
ఈ నగల్ని బ్యాంక్‌లో పెడితే రోల్డ్ గోల్డ్‌వి అని తెలిసిపోతుంది.. ఏం చేయాల్రా దేవుడా అని తలపట్టుకుంటుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి.. కొంపలు అంటుకుంటున్నాయే అమ్మా.. మా ఏరియాలో దొంగలు పడ్డారట. అందుకని అందరి నగల్ని లాకర్‌లో పెడుతున్నారు. అప్పుడు ఇవి రోల్డ్ గోల్డ్ నగలని తెలిసిపోతుంది. దీంతో పాటు పెళ్లి కోసం మనం ఆడిన నాటకాలన్నీ బయటపడిపోతాయి. నా కాపురం నిలువుగా కూలిపోతుంది. ఆయనంటే నాకు చచ్చేంత ప్రేమే.. ఆయన దూరం అయితే నేను బతకలేనే అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



