Home

»

Exclusive Movie News

Ntr: వెలుగులోకి ఎన్టీఆర్ సరికొత్త భోజనం అలవాట్లు.. కానీ సికింద్రాబాద్ లో దొరికే ఆ ఐటెం అంటే! 

Jul 20, 2026 2:30PM

 

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో నందమూరి తారకరామారావు(NTR)అనే పేరుకి ఉన్న బ్రాండ్ తెలిసిందే.. సదరు బ్రాండ్ కి ఎక్స్ పైరీ డేట్ అనేది అసాధ్యం. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆ పేరు నిత్యం మారుమోగిపోతూనే ఉంటుంది. ఎన్టీఆర్ కేవలం నటుడు మాత్రమే కాదు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఆరాధ్య దైవం. వెండితెరపై నటనలోనైనా, రాజకీయాల్లో పాలనలోనైనా ఆయన చూపించిన క్రమశిక్షణ, అంకితభావం ఎందరికో ఆదర్శం. అయితే అన్నగారి ఈ తిరుగులేని శక్తి వెనుక, ఆయన అద్భుతమైన నటన వెనుక ఉన్న కఠినమైన జీవనశైలి, విశేషమైన ఆహారపు అలవాట్ల గురించి ప్రముఖ రచయిత, దర్శకుడు కనగాల జయకుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన రహస్యాలను పంచుకున్నారు.


జయకుమార్ మాట్లాడుతు  ఎన్టీఆర్ గారి రోజువారి  దినచర్య తెల్లవారుజామునే ప్రారంభమయ్యేది. ప్రతిరోజూ ఉదయం సరిగ్గా 3:00 లేదా 3:30 గంటలకే నిద్రలేవడం ఆయనకి అలవాటు. నిద్రలేచిన వెంటనే కఠినమైన వ్యాయామాలు, కసరత్తులు చేసేవారు. ఈ క్రమశిక్షణే ఆయనను ఎల్లప్పుడూ సింహం లాంటి గంభీరమైన శరీర ఆకృతితో ఉంచేలా చేసింది. వ్యాయామం పూర్తయిన తర్వాత ఆయన ఆహార నియమాలు ఎంతో ప్రత్యేకంగా ఉండేవి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు వెండితెరపై పోషించే క్యారెక్టర్స్ నిబట్టి తన ఆహారాన్ని పూర్తిగా మార్చుకునేవారు. ఆయనలోని ఈ అంకితభావమే నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లింది.  శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి వంటి దేవుడి రోల్స్ చేస్తున్నప్పుడు  అత్యంత కఠినమైన నిష్ఠని పాటిస్తూ  పూర్తిగా శాకాహారం మాత్రమే తీసుకునేవారు. విలాసవంతమైన మంచాలపై కాకుండా, నేలపై కేవలం ఒక చాప వేసుకుని కటిక నేలపైనే నిద్రించడం ఆనవాయితీ. ఆ దేవుడి రోల్స్ కి  పూర్తి న్యాయం చేయాలనే తపన ఆయనలో అంతలా ఉండేది. కానీ, అదే సమయంలో రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక రౌద్ర రస పాత్రలు చేసేటప్పుడు  డైట్ ప్లాన్ పూర్తిగా భిన్నంగా మారిపోయేది. ఆ పాత్రల గాంభీర్యం, భారీ డైలాగులు చెప్పడానికి కావలసిన శక్తి కోసం  భారీగా ఆహారం తీసుకునేవారు.  ముఖ్యంగా 'దానవీరశూరకర్ణ' వంటి చారిత్రాత్మక చిత్రాల షూటింగ్ సమయంలో ఐదారుగురు తినేంత భారీ భోజనాన్ని అన్నగారు ఒక్కరే అవలీలగా తినేసేవారు. పొద్దున్నే ఒక పూర్తి నాటుకోడి చికెన్, ఆ తర్వాత ఒక పెద్ద బిందెడు పాలు లేదా లీటర్ల కొద్దీ యాపిల్ జ్యూస్ తాగేవారు. కెజి జీడిపప్పుని ఒకేసారి గుప్పిట్లోకి తీసుకొని తినేవారు. నాటుకోడి వంటకాలంటే ఎన్టీఆర్‌కు అమితమైన ఇష్టం. అలాగే సాయంత్రం వేళల్లో ముళ్లు, చర్మం పూర్తిగా తొలగించి, శెనగపిండితో ప్రత్యేకంగా వేయించిన దాదాపు ఒక కిలో బరువుండే చేపను ఎంతో ఇష్టంగా ఒక్కరే ఆరగించేవారు.

 

ఆయన అరుగుదల శక్తి  ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకునే కండబలం అందరినీ విస్మయానికి గురిచేసేవి.  ఒకరోజు షూటింగ్ విరామంలో ఎన్టీఆర్ గారికి  అభిమాని ఒక కిలో జీడిపప్పుని  తీసుకొచ్చి ఇచ్చాడు . సాధారణంగా ఎవరైనా అయితే వాటిని తమ కోసమే దాచుకుంటారు, కానీ అన్నగారు ఆ జీడిపప్పును అక్కడే ఉన్న నాతో పాటు  చుట్టుపక్కల ఉన్న యూనిట్ సభ్యులందరికీ సమానంగా పంచేసి, అందరితో కలిసి పంచుకుని తిన్నారు. తన వద్దకు వచ్చిన ఏ వస్తువునైనా చుట్టూ ఉన్నవారితో పంచుకోవడమే ఆయనకు తెలిసిన గొప్ప గుణం. షూటింగ్ సమయంలో ఒక్కోసారి కేవలం రెండు ఇడ్లీలు, ఒక వడతోనే గంటల తరబడి విశ్రాంతి లేకుండా పనిచేసేవారు .మధ్యాహ్నం భోజనంలో మాత్రం ఎన్టీఆర్ అన్నం చాలా తక్కువగా తిని, కూరలు ఎక్కువగా తినేవారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి దట్టించిన పాలకూర వంటకం, వంకాయ వేపుడు, ఆలుగడ్డ కూర మరియు ఆవకాయ పచ్చడి  భోజనంలో తప్పనిసరిగా ఉండాల్సిందే. స్వీట్స్  విషయానికి వస్తే సికింద్రాబాద్ గణేష్ ఆలయం వద్ద దొరికే రసమలై అంటే అన్నగారికి పంచప్రాణాలు. ఒకవైపు వృత్తి పట్ల అపారమైన గౌరవం, మరోవైపు పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని, ఆహారాన్ని మార్చుకునే ఈ అద్భుతమైన లక్షణాలే నందమూరి తారకరామారావు గారిని తెలుగు చలనచిత్ర జగత్తులో ఒక అజేయమైన శక్తిగా నిలబెట్టాయని జయకుమార్ చెప్పుకొచ్చాడు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com