Home

»

Exclusive Movie News

శరత్ బాబు, రమాప్రభ ఇంట్లో ఏం జరిగింది?.. రూమ్‌మేట్ బయటపెట్టిన సంచలన నిజాలు.!

Jul 20, 2026 12:23PM

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని బంధాలు ఎప్పటికీ నిలిపోతాయి. అలాంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన బంధం దివంగత నటుడు శరత్ బాబు, సీనియర్ నటి రమాప్రభలది. వీరిద్దరి గత జీవితం, మద్రాసు రోజుల్లో వారి ఉదారత గురించి ప్రముఖ రచయిత, సీనియర్ రంగస్థల కళాకారుడు కనగాల జయకుమార్ 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) వేదికగా కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను పంచుకున్నారు.

జయకుమార్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆ సమయంలో ఆయనకు వీరభద్రయ్య అనే ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానితో పరిచయం ఏర్పడింది. ఆయన పోలియో వల్ల రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ, ఎంతో తెలివైనవాడు, అందగాడు. ఆయన దర్శకత్వంలో 'తెరతొలిగింది' అనే ఒక ప్రసిద్ధ నాటకాన్ని వేశారు. ఆ నాటకంలో జయకుమార్ హీరోగా నటించగా, జీ. ఆనంద్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాత్రను, అలాగే శరత్ బాబు మరొక ముఖ్యమైన పాత్రను పోషించారు. శరత్ బాబు అసలు పేరు 'సత్యనారాయణ దీక్షిత్'. ఆయన శ్రీకాకుళం కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కాలేజీ అందాల పోటీల్లో ఫస్ట్ వచ్చి, 'కాలేజీ అందగాడు' గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'రామాలయం' అనే సినిమాతో ఆయన పేరును శరత్ బాబుగా మార్చడం జరిగింది.

శ్రీకాకుళం నాటక రంగం నుంచి మద్రాస్ (చెన్నై) వరకు సాగిన వీరి ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. మద్రాస్ లో ఒకరోజు 1000 లైట్స్ ప్రాంతంలో శరత్ బాబు వెళ్తుండగా జయకుమార్ చూసి పలకరించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మద్రాస్ లో ఒకే రూమ్‌లో ఉండటం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత శరత్ బాబు, రమాప్రభ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జయకుమార్ కి మద్రాస్ లో రూమ్ సమస్య వచ్చినప్పుడు, శరత్ బాబు స్వయంగా వచ్చి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. అలా రమాప్రభ, శరత్ బాబుల ఇంట్లో జయకుమార్ గారు ఏకంగా 2 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. ఆ 2 సంవత్సరాల కాలంలో వారు చూపించిన ఆదరణ, పెట్టిన అన్నం తానేప్పటికీ మర్చిపోలేనని జయకుమార్ ఎంతో ఎమోషనల్ గా గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో రమాప్రభ ఇల్లు ఒక అన్నపూర్ణ నిలయంలా ఉండేదని, రోజుకు కనీసం 10 నుండి 15 మంది వరకు వారి ఇంట్లో ఉచితంగా భోజనం చేసేవారని ఆయన నాటి రోజులను వివరించారు. రమాప్రభకి ఎవరైనా వస్తే అన్నం పెట్టే ఉదార స్వభావం చాలా ఎక్కువని కొనియాడారు.

ఈ జ్ఞాపకాల్లో జయకుమార్ ఒక సరదా సంఘటనను కూడా పంచుకున్నారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రెడ్డి గారు సూపర్ స్టార్ కృష్ణతో 'ఏకలవ్య' అనే ఒక పౌరాణిక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో అర్జునుడి పాత్ర కోసం చిత్ర పరిశ్రమ అంతా గాలించి, చివరకు శరత్ బాబు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారని భావించారు. ఒక ఆదివారం నాడు ఈ విషయమై మాట్లాడటానికి ప్రొడక్షన్ మేనేజర్ శరత్ బాబు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో హాల్లో రమాప్రభ, శరత్ బాబు, జయకుమార్ లతో పాటు హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి, "ఎం.ఎస్. రెడ్డి గారి సినిమాలో అర్జునుడి వేషం ఉంది, మీరు వేస్తారా?" అని శరత్ బాబును అడగగానే, ఆయన సమాధానం చెప్పేలోపే రమాప్రభ ఎంతో స్పాంటేనియస్ గా, "అర్జునుడి వేషానికి కళ్ళజోడు పెట్టుకోవచ్చా?" అని అడిగారట. 

సాధారణంగా శరత్ బాబుకి చిన్నప్పటి నుండి కాస్త కంటి సమస్య ఉండటం వల్ల ఆయన ఎప్పుడూ కళ్ళజోడు ధరించేవారు. బాలచందర్ సినిమాల్లో హీరోగా నటించినప్పుడు కూడా కళ్ళజోడుతోనే కనిపించారు. పౌరాణిక పాత్ర అయిన అర్జునుడికి కళ్ళజోడు ఎలా కుదురుతుంది అనే ఉద్దేశంతో రమాప్రభ అడిగిన ఆ చమత్కారమైన ప్రశ్నకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారని జయకుమార్ నవ్వుతూ పంచుకున్నారు. ఏదేమైనా ఆ తర్వాత శరత్ బాబు గారు ఆ అర్జునుడి పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారని, నాటి మద్రాస్ రోజులు, రమాప్రభ ఆతిథ్యం తన జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులని జయకుమార్ ముగించారు.

 

 

Sarath Babu, Rama Prabha, Kanagala Jayakumar, Interview, TeluguOne Cinema

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com