
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ లవ్ స్టోరీ 'సుస్వాగతం'. 1998లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, దేవయాని జంటగా నటించగా, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.
ప్రేమ కోసం పరితపించే ఒక సగటు యువకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన నటన ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తున్న కొద్దీ ప్రేక్షకుల గుండెలను పిండేసే ఒక అద్భుతమైన భావోద్వేగ సన్నివేశం వస్తుంది. అదే తండ్రి మరణించిన విషయం తెలియకుండా, హీరో తన ప్రేమ కోసం తిరిగే సీన్. ఈ సన్నివేశం బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే 'ఆలయాన హారతిలో' అనే పాట టాలీవుడ్ హిస్టరీలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది. ఎస్.ఏ. రాజ్‌కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం మధురమైన గొంతులో ఇప్పటికీ వింటుంటే ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి.
ఈ పాటలో సిరివెన్నెల రాసిన లిరిక్స్ ప్రేమ యొక్క నిజమైన తత్వాన్ని, జీవితంలోని పరమార్థాన్ని ఎంతో లోతుగా ఆవిష్కరిస్తాయి. "ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో.. రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్ని గుణం" అంటూ సాగే పల్లవి జీవితంలోని రెండు విభిన్న కోణాలను కళ్లకు కడుతుంది. గుడిలో ఇచ్చే హారతి ఇచ్చే పవిత్రత, శ్మశానంలో కాలే చితి మంటల్లో ఉండే బాధ.. ఈ రెండింటిలోనూ ఉండేది అగ్ని గుణమే అయినప్పటికీ, ప్రేమ అనే పదం కూడా అలాంటి ఒక ఆరని అగ్ని కణం లాంటిదని కవి ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఈ ప్రేమ ఒక మనిషి జీవితానికి దీపాన్ని చూపిస్తుందా లేక తాపంతో బలి పెడుతుందా అనేది ఎవరికీ తెలియదని, అది అమృతమో హాలాహలమో చెప్పడం ఎవరి తరం కాదని పాటలో ఎంతో ఎమోషనల్‌గా వివరిస్తారు. ఈ భావోద్వేగాలే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఈ చిత్రాన్ని ఒక మైలురాయిగా నిలబెట్టాయి.
Pawan Kalyan, Suswagatham Movie, Aalayana Harathilo Song, Sirivennela






