Home

»

Exclusive Movie News

కొడుకు కోసం స్టేజ్‌పై ఎమోషనల్ అయిన సింగర్ సునీత..!

Jun 1, 2026 2:49PM

తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గొంతుతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ సింగర్ సునీత (Singer Sunitha) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె ఎంతోమంది స్టార్ హీరోయిన్లకు ప్రాణం పోశారు. 

సునీత కుమారుడు ఆకాష్ 'సర్కారు నౌకరి' సినిమాతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆకాష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొత్త మలుపు’ (Kotha Malupu). ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సునీత.. తన కొడుకు గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

సునీత మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గిరిబాబు గారి వంటి గొప్పవారితో తనను తాను పోల్చుకునేంత పెద్దదాన్ని కాకపోవచ్చు అంటూనే, తన కుమారుడి భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడికి వెళ్లినా కేవలం "సునీత కొడుకు" అనే ట్యాగ్‌తో కాకుండా, పరిశ్రమలో తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె ఆకాంక్షించారు. "ఆకాష్‌ సమాజంలో, సినీ ఇండస్ట్రీలో ఒక ఇండివిడ్యువల్ పర్సన్‌గా ఎదగాలి" అని మనసారా కోరుకుంటున్నట్లు సునీత చెప్పారు.

తన కొడుకు వ్యక్తిత్వం, కష్టం గురించి చెబుతూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ఆకాష్ ఎంచుకున్న రంగంలో ఎంతో కష్టపడతాడని, ప్రతి విషయంలోనూ చాలా సిన్సియర్‌గా ఉంటాడని సునీత పేర్కొన్నారు. ఆ సిన్సియారిటీనే అతడిని ముందుకు నడిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. తన కష్టాన్ని నమ్ముకుని పరిశ్రమలో ఒక మంచి స్థాయికి చేరుకోవాలని, భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని ఒక తల్లిగా ఆకాంక్షిస్తున్నట్లు భావోద్వేగంతో పంచుకున్నారు.

సాధారణంగా స్టార్ సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సులభంగా దొరుకుతుంది కానీ, ప్రతిభతోనే నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను సునీత నొక్కి చెప్పారు. తన పేరు ప్రఖ్యాతులు కొడుకు ఎదుగుదలకు కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావాలని, ఆ తర్వాత ఆకాష్ తన స్వయంకృషితోనే ఒక గొప్ప నటుడిగా ఎదగాలని ఆమె ఆశపడటం అక్కడున్న వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

సునీత మాట్లాడిన ఈ ఎమోషనల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాతో ఆకాష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com