Home

»

Exclusive Movie News

తెలుగు తెరపై పంచెకట్టు మొనగాడు ఎవరు..?

Aug 27, 2026 11:12AM

వెండితెరపై హీరోలు పంచెకట్టులో కనిపిస్తే ఆ కిక్కే వేరు. దశాబ్దాల తెలుగు సినీ ప్రయాణంలో ఎన్నో ట్రెండ్స్ మారాయి. అదే బాటలో మన సాంప్రదాయ పంచెకట్టు కూడా క్లాస్ లుక్ నుండి మాస్ ఎలిమెంట్‌గా రూపాంతరం చెందింది. నాడు సీనియర్ ఎన్టీఆర్ చూపించిన రాయల్టీ నుండి, నేటి జూనియర్ ఎన్టీఆర్ సృష్టిస్తున్న స్వాగ్ వరకు తెలుగు సినిమాలో పంచెకట్టు ఎలా రూపాంతరం చెందుతూ వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

తెలుగు తెరపై పంచెకట్టుకు ఒక నిండుదనాన్ని, రాజసాన్ని అద్దిన ఘనత సీనియర్ ఎన్టీఆర్ దే. పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడిగా, రాముడిగా ధోవతి కట్టులో దైవత్వాన్ని పలికించినా, జానపదాల్లో యువరాజుగా మెరిసినా ఆయన కట్టులోనే ఒక ప్రత్యేకత ఉండేది. ఇక 'చండ శాసనుడు' వంటి సినిమాల్లో ఆయన పంచె కట్టిన తీరు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది.

మరోవైపు అక్కినేని నాగేశ్వరరావు పంచెకట్టులో ఎంతో క్లాసిక్ గా, లవ్ లీగా కనిపించేవారు. 'దేవదాసు'లో విరహ వేదనను పలికించినా, 'దసరా బుల్లోడు'లో తెల్లటి పంచె, రంగుల చొక్కాతో జోష్ చూపించినా అది ఏఎన్నార్ కే సాధ్యమైంది.

ఆ తర్వాత, కృష్ణ పంచెకట్టుతో అల్లూరి సీతారామరాజుగా వీరత్వాన్ని చూపించారు. అలాగే 'పాడిపంటలు'లో రైతుగా అలరించారు. ఇక శోభన్ బాబు 'సోగ్గాడు' లాంటి సినిమాల్లో పంచెకట్టుతో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యారు. కృష్ణంరాజు కూడా 'బొబ్బిలి బ్రహ్మన్న' సినిమాలో పంచెకట్టులో గంభీరంగా కనిపించి ఆకట్టుకున్నారు.

చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’, బాలకృష్ణ కెరీర్ ను మలుపు తిప్పిన ‘మంగమ్మగారి మనవడు’ సినిమాలు.. పంచెకట్టుకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. 'మన శంకర్ వరప్రసాద్' వరకు చిరంజీవి పలు సినిమాల్లో పంచెకట్టుతో మెప్పించారు. అయితే పంచెకట్టుకి రాయల్ లుక్ తీసుకొచ్చిన ఘనత బాలయ్య సొంతం. వీరసింహారెడ్డి వంటి సినిమాల్లో ఆయన లుక్ అందరినీ కట్టిపడేసింది.

ఇక నాగార్జున తన తండ్రి ఏఎన్నార్ బాటలోనే పంచెకట్టుకు సరికొత్త గ్లామర్ అద్దారు. 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' నుండి 'బంగార్రాజు' వరకు నాగ్ వేసిన పంచెకట్టు ట్రెండ్ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే వెంకటేష్ 'అబ్బాయిగారు', 'సూర్యవంశం' వంటి సినిమాల్లో సాంప్రదాయ పంచెకట్టుతో క్లాస్ లుక్ తీసుకొచ్చారు.

ఇక నేటి తరం స్టార్స్ కూడా పంచెకట్టుతో బాగానే మెరిశారు. 'అదుర్స్'లో చారిగా పంచెకట్టుతో నవ్వులు పూయించిన జూనియర్ ఎన్టీఆర్.. 'దేవర' సినిమాలో ఆ పంచె కట్టులోనే రౌద్రాన్ని చూపించారు.

పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు', 'భీమ్లా నాయక్' సినిమాల్లో లుంగీ, పంచెకట్టుతో తనదైన స్వాగ్ చూపించగా.. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథమ్' లో బ్రాహ్మణుడిగా ధోవతి కట్టులో అదరగొట్టారు. మహేష్ బాబు సైతం 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలలో లుంగీ, పంచెకట్టులో కాసేపు కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇక ప్రభాస్ కూడా 'మిర్చి'లో పంచెకట్టుతో మెస్మరైజ్ చేశారు.

కాలం మారుతున్నా, వెస్ట్రన్ కల్చర్ పెరుగుతున్నా.. టాలీవుడ్ హీరోలు మాత్రం ఇప్పటికీ ‘పంచెకట్టు’తో స్క్రీన్ పై ఇచ్చే కిక్కే వేరని నిరూపిస్తూనే ఉన్నారు.

 

 

 

 

[Panche Kattu, NTR, ANR, Chiranjeevi, Balakrishna]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com