Home

»

Exclusive Movie News

GVN ఆఖరి ఇంటర్వ్యూ: చిరంజీవి రోల్ అమితాబ్ చేయనన్నారు.. రజినీకాంత్‌ని అరేయ్ అంటాను.!

Aug 27, 2026 11:44AM

తెలుగు చిత్రసీమలో సీనియర్ నటుడిగా, నిర్మాతలుగా ఎనలేని గుర్తింపు పొందిన జి.వి. నారాయణరావు (GV Narayana Rao) అనారోగ్యంతో నేడు కన్నుమూశారు. ఆయన 'తెలుగువన్'కి ఇచ్చిన తన ఆఖరి ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్‌లతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ ప్రస్థానాన్ని ఎంతో ఆత్మీయంగా పంచుకున్నారు. 

తన తండ్రికి కొడుకుని డాక్టర్‌ని చేయాలనే కోరిక ఉండేదని, కానీ తనకేమో చిన్నప్పటి నుంచే నటనపై విపరీతమైన పిచ్చి ఉండేదని జి.వి. నారాయణరావు  వెల్లడించారు. తండ్రి మొదట్లో ఆయనను స్టూడియోలోకి కూడా రానిచ్చేవారు కాదని, అయితే భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి నృత్యరీతులతో పాటు డ్రామారంగంలో మెళకువలు నేర్చుకుని, 1973-74 నాటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (SIFCC) ఇన్స్టిట్యూట్‌లో రెండేళ్ల పూర్తికాల శిక్షణ పొందానని ఆయన గుర్తుచేసుకున్నారు. అక్కడే రజనీకాంత్ తనకు క్లాస్‌మేట్‌గా పరిచయమయ్యారని, చిరంజీవి 3 సంవత్సరాలు జూనియర్‌గా, రాజేంద్రప్రసాద్ 1 సంవత్సరం జూనియర్‌గా ఉండేవారని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవితో నారాయణరావు కాంబినేషన్ దాదాపు 15 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది. పొద్దున్నే 5 గంటలకే జిమ్‌కి వెళ్లడం దగ్గరనుంచి రాత్రి 10 గంటల వరకు చిరంజీవి, నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్‌లు అంతా ఒక బెటాలియన్ లాగా కలిసి మెలిసి ఉండేవారని తెలిపారు. చిరంజీవితో చేసిన సినిమాల్లో తనకు అత్యధిక హిట్లు ఉన్నాయని, 'చట్టానికి కళ్లు లేవు' చిత్రంలో తాను చేసిన క్యారెక్టర్ ఎంతగానో నచ్చి హిందీ రీమేక్ 'అంధా కానూన్'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు హీరో పాత్రను పక్కనపెట్టి మరీ నారాయణరావు చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్‌ను ఎంచుకుని నటించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.

తన సొంత బ్యానర్ 'దమయంతి ఆర్ట్ పిక్చర్స్' పై చిరంజీవి, విజయశాంతి జంటగా ప్రథమంగా తెరకెక్కించిన 'దేవాంతకుడు' చిత్రం శతదినోత్సవం జరుపుకుందని తెలిపారు. అంతేకాకుండా, సుధాకర్, హరిప్రసాద్‌లతో కలిసి 'డైనమిక్ మూవీ మేకర్స్' బ్యానర్‌పై చిరంజీవి కథానాయకుడిగా 'యముడికి మొగుడు' చిత్రాన్ని నిర్మించి సెన్సేషనల్ హిట్ సాధించారు. ఈ సినిమా కోసం చక్రవర్తి గారిని కాకుండా కొత్త సంగీత దర్శకులు రాజ్‌-కోటి ద్వయాన్ని ఎంచుకోవడంతో మద్రాస్‌లోని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోయినా, నారాయణరావు నమ్మకాన్ని నిజం చేస్తూ రాజ్-కోటి మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద బ్రేక్ సాధించింది.

మలయాళంలో ఫాజిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా నచ్చి, దాని హక్కులు తీసుకువచ్చి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై 'పసివాడి ప్రాణం'గా తెరకెక్కించడంలో నారాయణరావు కీలక పాత్ర పోషించారు. మొదట్లో పాటలు, ఫైట్లు లేవని చిరంజీవి గారు కాస్త సందేహించినా, భావోద్వేగమైన కథాంశంపై నమ్మకంతో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లగా, అది 200 రోజులు ప్రదర్శితమై టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. రజనీకాంత్‌ను ఇప్పటికీ 'అరే రజనీ' అని పిలిచేంత ఆత్మీయ చనువు తనకు ఉందని, దేవదాస్ కనకాల గారి శిక్షణలో క్రమశిక్షణతో కూడిన నటనా విధానమే తమను ఇండస్ట్రీలో నిలబెట్టిందని తన చివరి ఇంటర్వ్యూలో జీవి నారాయణరావు ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు.

 

 

 

[GV Narayana Rao, Interview, Chiranjeevi, Rajinikanth]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com