Home

»

Exclusive Movie News

తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా!

Jun 8, 2026 5:20PM

 


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వర్ణయుగంగా పిలవబడే రోజుల్లో వచ్చిన చాలా  సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సమాజానికి బలమైన సందేశాన్ని అందించాయి. అటువంటి ఒక అద్భుతమైన ఆదర్శ ప్రాయమైన  సందేశాన్ని ఇచ్చిన  చిత్రం 'మంచి మనిషి'. లెంజెండరీ యాక్టర్ విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, మహానటి జమున, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లోనే ఒక సంచలనం. ఒక మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది అతను పుట్టిన కులాన్ని బట్టో, వంశాన్ని బట్టో కాకుండా, అతను పెరిగే వాతావరణం,సమాజం అతనిపై చూపే ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని  నిరూపించింది. ఇందులో ఎన్టీఆర్ దొంగగా, ప్రేమికుడిగా, సమాజం చేత దగాపడ్డ వ్యక్తిగా వేణు పాత్రలో అద్భుతమైన హావభావాలను పలికించి అభిమానులని, ప్రేక్షకులని  ఎంతగానో రంజింపజేశారు. దర్శకుడు కె. ప్రత్యగాత్మ ఎంతో సున్నితమైన ,సంక్లిష్టమైన ఈ కథాంశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా వెండితెరపై ఆవిష్కరించారు.

ఈ సినిమాలో అత్యంత కీలకమైన, ప్రేక్షకుల గుండెలని  పిండేసే సన్నివేశం ఏంటంటే అది కోర్టు డ్రామా మరియు ఒక విలక్షణమైన సెంటిమెంట్ సీన్. పరిస్థితుల ప్రభావం వల్ల గజదొంగగా మారిన వేణు, సుశీల పుట్టినరోజు నాడు ఒక చిన్న పాప లాకర్‌లో చిక్కుకుపోతే తన దొంగతనం నైపుణ్యంతో ఆ లాకర్‌ని తెరిచి పాప ప్రాణాలు  కాపాడతాడు. అలా ప్రాణాలు కాపాడిన వేణు, సమాజం కోసం తనని తాను పోలీసులకి అప్పగించుకుంటాడు. ఈ క్రమంలో  లాయర్ వాసుగా చేసిన జగ్గయ్య కోర్టులో వేణు తరుపు వాదిస్తూ "దొంగ కొడుకు ఎప్పుడూ దొంగ కానక్కర్లేదు" అంటూ సమాజంలోని కుళ్లును కడిగిపారేసేలా చేసే వాదనలు ఇప్పటికీ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. 172 నిమిషాల నిడివి గల ఈ అద్భుతమైన  కుటుంబ కథా చిత్రంలో జగ్గయ్య ,ఎన్టీఆర్ మధ్య వచ్చే డైలాగ్స్ థియేటర్లలో చప్పట్ల వర్షం కురిపించాయి. ఈ సీన్ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు  భావోద్వేగానికి గురవుతారు. వేణు జైలులో ఉన్నప్పుడు  సుశీల వెళ్ళి పకరించే సన్నివేశం, ఆ సందర్భంలో ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ కూడా నభూతో నభవిష్యత్.  

ఇలాంటి సీన్లు కేవలం నటనతోనే కాకుండా, ఆ నాటి దిగ్గజ దర్శకులు, రచయితల ప్రతిభకు అద్దం పడతాయి. పినిశెట్టి అందించిన తిరుగులేని సంభాషణలు, ఎస్. రాజేశ్వరరావు మరియు టి. చలపతిరావు అందించిన  సంగీతం  ఎవర్గ్రీన్ క్లాసిక్‌గా మార్చాయి. ఘంటసాల, పి. సుశీల పాడిన ‘అంతగా నను చూడకు’, ‘రాననుకున్నావేమో’ వంటి యుగళ గీతాలు నేటికీ సంగీత ప్రియుల ఇళ్లల్లో మారుమోగుతూనే ఉన్నాయి.  భావోద్వేగాలు, కుటుంబ విలువలు, ఆనాటి సామాజిక పరిస్థితులని  కళ్ళకి  కట్టినట్లు చూపించిన విధానం ఈ తరానికి కూడా ఒక పెద్ద పాఠం. 

అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలోని కోర్టు సన్నివేశాలు మరియు ఎమోషనల్ క్లిప్పింగ్స్ ఇప్పటికీ యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అవుతూనే ఉండటం విశేషం. పాత తరం సినిమాల గొప్పదనాన్ని, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి నట విశ్వరూపాన్ని చూడాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అద్భుత దృశ్య కావ్యం ఈ 'మంచి మనిషి'.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com