
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి అయిన గాయం ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది. ఆయన కోలుకోవడానికి కనీసం 6 నుంచి 8 వారాల పాటు అంటే దాదాపు రెండు నెలల సమయం విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలో ఎన్టీఆర్ చికిత్స విజయవంతంగా పూర్తయిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలియజేసినప్పటికీ, ఈ సుదీర్ఘ విశ్రాంతి సమయంలో ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా ఎముకలకు సంబంధించి తీవ్రమైన దెబ్బ తగిలినప్పుడు కనీసం 21 రోజుల విశ్రాంతి ప్రాథమికంగా అవసరం అవుతుంది. కానీ వైద్యులు ఏకంగా 6 నుంచి 8 వారాల సమయం నిర్దేశించారంటే అది సాధారణ దెబ్బ కాదని, తీవ్రమైన భుజం గాయమే అని స్పష్టమవుతోంది.
అయితే అధికారిక ప్రకటన కేవలం ఎన్టీఆర్ ఆఫీస్ నుంచే రావడంతో.. ఈ ప్రమాదం 'డ్రాగన్' సెట్స్‌లోనే జరిగిందా లేక బయట జరిగిందా అనే దానిపై కొంత సందేహం నెలకొంది. ఒకవేళ షూటింగ్ సెట్‌లో ప్రమాదం జరిగి ఉంటే సాధారణంగా నిర్మాణ సంస్థ లేదా ప్రొడక్షన్ యూనిట్ ప్రకటన విడుదల చేస్తుంది.
సినిమా కోసం లీన్ మజిల్ లుక్ సాధించేందుకు ఎన్టీఆర్ కఠినమైన జిమ్ వర్కౌట్లు చేస్తున్నారు. కాబట్టి జిమ్‌లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతాన్ని పరిశీలిస్తే ఎన్టీఆర్ కెరీర్‌లో ఇలా గాయపడటం ఇది మొదటిసారి కాదు. బ్లాక్‌బస్టర్ ‘ఆది’ సినిమా సమయంలోనూ గ్లాస్ ఫైట్ సీన్ చేస్తున్నప్పుడు ఆయన చేతికి తీవ్రమైన గాయమైంది. ఆ గాయం కట్టుతోనే ఒక పాట చిత్రీకరణలో ఆయన పాల్గొన్నారు. ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే ‘బృందావనం’ సినిమా సమయంలో యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్న సమయంలో కూడా ఆయనకు చిన్నపాటి ప్రమాదం జరిగింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటోంది. 2027 జూన్ లో విడుదల చేయాలనేది మేకర్స్ టార్గెట్. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ రెండు నెలల రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో.. విడుదల వాయిదా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ లేని ఇతర సన్నివేశాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ 8 వారాల వ్యవధిలో ప్రశాంత్ నీల్ పూర్తి చేసే అవకాశం ఉంది. దీనివల్ల సినిమా విడుదల తేదీపై ఎలాంటి పెద్ద ప్రభావం పడకుండా జాగ్రత్తపడవచ్చు.
రెండు నెలల విశ్రాంతి సమయంలో శారీరక శ్రమ తగ్గి బరువు పెరిగే అవకాశం ఉన్నందున, సరైన డైట్ ప్లాన్ పాటించడం ఎంతో ముఖ్యం. ఒక హీరో వెనుక వందలాది మంది టెక్నీషియన్లు, భారీ బడ్జెట్, ఓటీటీ కమిట్‌మెంట్లు ముడిపడి ఉంటాయి. కాబట్టి హీరోల ఆరోగ్యం వారిది మాత్రమే కాదు, ప్రాజెక్ట్ భవిష్యత్తు కూడా. ప్రస్తుతం ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Jr NTR, Injury, Dragon Movie, Prashanth Neel






