
తెలుగు సినిమా చరిత్రలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ అందించిన అద్భుతమైన హాస్య కావ్యాల్లో 'అప్పుల అప్పారావు' ఒకటి. నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందిన ఈ చిత్రం విడుదలై దశాబ్దాలు గడిచినా, ఇందులోని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో చిలిపి దొంగగా తనికెళ్ల భరణి చేసిన కామెడీ ఇప్పటికీ నవ్వుల వర్షం కురిపిస్తూనే ఉంటుంది.
తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌లో వైరల్ అవుతున్న ఈ సీన్‌లో ఇంట్లోకి చొరబడిన ఒక దొంగ, భార్యాభర్తల మధ్య జరిగిన విచిత్రమైన కామెడీ ఘట్టం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ సరదా సన్నివేశంలో దొంగ తనికెళ్ళ భరణి ఇంట్లోకి వచ్చి.. భార్యాభర్తలను కట్టేసి, వంటలన్నీ తినేస్తాడు. చెల్లెమ్మా వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటూనే, తనను పట్టుకుని పోలీసులకు పట్టిస్తారనే భయంతో ఇద్దరినీ కట్టేసినట్లు చెప్తాడు.
ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. ఆ ఇంట్లోని ఆవిడ తన కట్లు విప్పకపోయినా పర్వాలేదు కానీ, పక్కన ఉన్న ఆయన కట్లు మాత్రం వెంటనే విప్పేయమని ప్రాధేయపడుతుంది. దానికి ఆ దొంగ ఆశ్చర్యపోతూ "ఇంకా ఈ దేశంలో ఫుడ్, బెడ్ దొరుకుతున్నాయంటే కారణం.. పతి క్షేమం కోరే నీలాంటి మహా పతివ్రతలు ఉండబట్టే" అని దండం పెడతాడు.
కానీ ఇంతలోనే అసలు భర్త బయటి నుంచి రావడం, ఆవిడ కంగారుపడటం చూసి దొంగ మైండ్ బ్లాక్ అవుతుంది. పక్కన కట్టేసి ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగితే, ఆయన "పక్కంటి ఆయన" అని ఆవిడ చెప్పడంతో దొంగకు మైండ్ పోతుంది.
"ఛీ.. పతిత నీచురాలా. ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానివిగా పుట్టి, పట్టపగలు పరాయ మగాడితో కులుకుతున్న కులటా. ఈ ఘోరాన్ని నేను సహించలేను" అంటూ ఆ దొంగ విరుచుకుపడటం నవ్వుల పువ్వులు పూయిస్తుంది.
దొంగ వెళ్లి డోర్ ఓపెన్ చేయగా.. ఎదురుగా అసలు భర్త ఉంటాడు. తాను చెక్ పోస్ట్‌లో ఇన్స్పెక్టర్‌ని అని చెప్పగా.. దొంగ క్లాస్ పీకుతాడు. "చెక్ పోస్ట్‌లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకో అక్కర్లేదా? డబ్బు సంపాదించగానే సరిపోదయ్యా.. పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి" అంటూ దొంగ నీతులు చెప్పడం ఈ సీన్‌కే హైలైట్‌గా నిలుస్తుంది.
Appula Apparao, Comedy Scenes, Tanikella Bharani, Telugu Comedy





