
తెలుగు సినీ చరిత్రలో కామెడీ జానర్‌ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన అద్భుతమైన చిత్రం ‘జంబలకిడి పంబ’. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ మార్క్ హాస్యంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ చిత్రంలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పోషించిన ఆనందం పాత్ర కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంటాయి.
సమాజంలో స్త్రీ, పురుషుల పాత్రలు, బాధ్యతలు తారుమారైతే పరిస్థితులు ఎంత విచిత్రంగా, నవ్వుల పూయించేలా మారతాయో ఈ సన్నివేశాల్లో అత్యంత సహజంగా చూపెట్టారు. మగవారు ఇంట్లో వంట వార్పులు చేయడం, పసిపాపలను సాకడం, మంగళసూత్రాలు ధరించడం వంటి అంశాలు ఈ వినోదానికి ప్రధాన బలంగా నిలిచాయి.
కథలో భాగంగా బ్రహ్మానందం పండించిన నటన, ఆయన పలికిన డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ప్రత్యేకించి ఈ సినిమాలో వచ్చే "తొక్కలోది", "ముల్లు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది" వంటి సంభాషణలు టాలీవుడ్ చరిత్రలోనే ఐకానిక్ మీమ్ కంటెంట్‌గా నిలిచాయి.
ఇక ఆసుపత్రి సన్నివేశంలో సరళ అనే ఆమెకు డెలివరీ అవుతుండగా.. పురిటి నొప్పులు ఆమె భర్తకు రావాల్సింది ఆనందంకి వస్తాయి. దీంతో ఆనందాన్ని భార్య దారుణంగా కొట్టి.. అసలేం జరిగిందో చెప్పమని అడుగుతుంది. అప్పుడు ఆనందం.. "ఒక వర్షం కురిసిన రాత్రి చేబదులు కోసం వెళ్తే.. ఒక ఉరుము ఉరిమి సరళను కౌగిలించుకున్నాను. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగదీసుకుందండి." అంటూ చెప్పే డైలాగ్ లు సీన్ కే హైలైట్ గా నిలిచాయి.
కాలం మారినా, ఏళ్ళు గడిచినా జంబలకిడి పంబ చిత్రంలోని బ్రహ్మానందం కామెడీ సీన్స్ సృష్టిస్తున్న నవ్వుల సునామీ తగ్గలేదు.
Jambalakidi Pamba, Brahmanandam, Comedy Scenes, EVV Satyanarayana






