
స్టార్ హీరోలు అనగానే భారీ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. ఇటీవల ఈ డోస్ మరింత పెరిగిపోయింది. స్క్రీన్ ని ఎరుపెక్కిస్తున్నారు.
స్టార్స్ అంటే.. పాతిక రైళ్లు గాల్లో లేవడాలు, వందమందిని అడ్డంగా నరకడాలే కాదు. చాలెంజింగ్ రోల్స్ కూడా చేయాలి. అలాంటి చాలెంజింగ్ రోల్స్ లో.. బ్రాహ్మణ పాత్ర ఒకటి. మరి ఆ బ్రాహ్మణ పాత్రలో వావ్ అనిపించుకున్న హీరోలు ఎవరో ఓ లుక్కేద్దామా?.
ముందుగా అన్నగారు ఎన్టీఆర్. అసలు ఆయన చేయని పాత్ర ఉందా?. దేవుళ్ళ పాత్రలే కాదు, పూజారి పాత్ర చేసినా ఆయన తర్వాతే ఎవరైనా. ‘పాండురంగ మహాత్మ్యం’లో ఎన్టీఆర్ పోషించిన పుండరీకుడి పాత్ర ఆల్ టైం క్లాసిక్. జల్సారాయుడు నుంచి పరమ భక్తుడిగా మారే పాత్రలో.. ఎన్టీఆర్ చూపించిన నట విశ్వరూపం కట్టిపడేసింది.
ఏఎన్నార్ కి కూడా ఇలాంటి పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. ‘విప్ర నారాయణ’ సినిమాలో పరమ భక్తుడైన బ్రాహ్మణుడి పాత్రలో జీవించేశారు. భక్తికి, శృంగారానికి మధ్య నలిగిపోయే పాత్రలో.. ఏఎన్నార్ యాక్టింగ్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు.
సోగ్గాడు శోభన్ బాబు కూడా బ్రాహ్మణ పాత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘దేవాలయం’ సినిమాలో శోభన్ బాబు పోషించిన బ్రాహ్మణ పాత్ర.. ఆయన కెరీర్‌లోనే స్పెషల్ గా నిలిచింది.
మన మెగాస్టార్ చిరంజీవి ఏమైనా తక్కువా. 'రుద్రవీణ'లో సూర్యనారాయణ శాస్త్రి పాత్ర చిరంజీవి కెరీర్‌లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సంగీతం, సంప్రదాయం, సామాజిక ఆలోచనల మధ్య నడిచే పాత్రలో.. ఆయన పూర్తిగా డిఫరెంట్ షేడ్ చూపించారు.
అంతేకాదు, ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో మూడు పాత్రలు చేసి మెప్పించిన చిరంజీవి.. వాటిలో దత్తాత్రేయ పాత్రలో బ్రాహ్మణ యువకుడి గెటప్‌లో కనిపించారు. ఈ పాత్రలో కామెడీ, అమాయకత్వం, డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా నిలిచాయి.
ఇక మన్మథుడు నాగార్జున కూడా విభిన్న పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అన్నమయ్యగా ఆయన కనిపించిన తీరు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. భక్తి, ఆధ్యాత్మికతతో కూడిన ఈ పాత్ర నాగార్జున కెరీర్‌లో ఎంతో స్పెషల్.
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న బాలకృష్ణ.. ఇలాంటి చాలెంజింగ్ రోల్స్ చేయడంలో అసలు వెనకాడరు. ‘పాండురంగ మహాత్మ్యం’కు రీమేక్‌గా వచ్చిన ‘పాండురంగడు’ సినిమాలో.. తన నటనతో మ్యాజిక్ చేశారు బాలయ్య.
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ సైతం ‘ఓంకారం’ సినిమాలో సత్య అనే పాత్రలో కనిపించారు. ఒక బ్రాహ్మణ యువకుడి జీవితం.. నేర ప్రపంచం వైపు ఎలా మలుపు తిరిగింది? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా సాగుతుంది.
బ్రాహ్మణ పాత్ర అంటే.. భక్తి, సెంటిమెంట్ మాత్రమే కాదు.. కడుపుబ్బా నవ్వించవచ్చని నిరూపించిన పాత్ర 'చారి'. ‘అదుర్స్’ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ పోషించిన ఈ పాత్ర వెరీ వెరీ స్పెషల్. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన పూజారి చారిగా ఎన్టీఆర్ చేసిన కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోయింది. డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్, టైమింగ్‌తో ఈ క్యారెక్టర్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ వచ్చింది.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా.. 'దువ్వాడ జగన్నాథ శాస్త్రి' అలియాస్ 'DJ' పాత్రలో కనిపించారు. అగ్రహారం యాస, పంచెకట్టుతో బన్నీ అదరగొట్టారు. సంప్రదాయ బ్రాహ్మణ యువకుడి గెటప్‌తో పాటు యాక్షన్ యాంగిల్‌ను కూడా మిక్స్ చేసిన పాత్ర ఇది.
'అంటే సుందరానికి' సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా నాని కూడా తన న్యాచురల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశారు.
ఇక ‘సీమశాస్త్రి’ సినిమాలో సుబ్రమణ్య శాస్త్రిగా అల్లరి నరేష్ ఫుల్ గా నవ్వించారు. ప్రేమ కోసం ఫ్యాక్షనిస్టు గెటప్ వేసిన పూజారిగా.. అల్లరోడి కామెడీని అంత తేలికగా మర్చిపోలేం.
అన్నగారు నుంచి అల్లరోడు వరకు.. ఎందరో తెలుగు హీరోలు బ్రాహ్మణ పాత్రల్లో మెప్పించారు. కొందరు కంటతడి పెట్టిస్తే.. మరికొందరు కడుపుబ్బా నవ్వించారు.
ఇది కూడా చదవండి: ట్రిపుల్ రోల్.. టాలీవుడ్‌లో తోపు యాక్టర్ ఎవరు?
[Tollywood Heroes Brahmin Roles, NTR Panduranga Mahatyam, Nagarjuna Annamayya, Balakrishna Pandurangadu, Jr NTR Adhurs, Chiranjeevi, Allu Arjun, Nani, Allari Naresh, Telugu Film News]





